నాని నన్ను మెచ్చుకున్నారు: భానుశ్రీ

ABN , First Publish Date - 2020-04-03T03:36:54+05:30 IST

సినిమా నటి, టీవీ సీరియల్స్‌ నటి భానుశ్రీ. సీరియల్స్‌లో, తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారామె. తాజాగా మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. బిగ్‌ బాస్‌–2 రియాల్టీ షో

నాని నన్ను మెచ్చుకున్నారు: భానుశ్రీ

సినిమా నటి, టీవీ సీరియల్స్‌ నటి భానుశ్రీ. సీరియల్స్‌లో, తెలుగు, తమిళ చిత్రాల్లో హీరోయిన్‌గా చేశారామె. తాజాగా మరో నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు. బిగ్‌ బాస్‌–2 రియాల్టీ షో ద్వారా తెలుగువారందరికీ మరింత చేరువయ్యారామె. ఇప్పుడు జీ తెలుగు ఛానల్‌లో ‘అదిరింది’ లాఫ్టర్‌ షో యాంకర్‌గా కూడా ఆమె ప్రేక్షకులను అలరిస్తున్నారు.నటులకు గుర్తింపు తెచ్చేది ప్రేక్షకులే. ప్రేక్షకులు లేకపోతే నటులు లేరు. నటుల విజయానికి కారకులు ప్రేక్షకులే’’ అంటున్న భానుశ్రీ అంతరంగమిది. 


తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ భానుశ్రీ పుట్టిన ఊరు. అశోక్‌, పద్మల ఏకైక గారాలపట్టి. ఆమె తండ్రి ప్రభుత్వం ఉద్యోగం చేసి రిటైరయ్యారు. ఎంతో అపురూపంగా పెరిగిన భానుశ్రీ చదువు, బాల్యం వరంగల్‌‌లోనే గడిచింది. చిన్నప్పటినుంచీ స్కూల్లో అన్ని ఆటల్లోనూ ఆమే ముందు ఉండేది. నాట్యం అంటే ఎంతో ఇష్టపడేది. ఆమె బంధువులు కొందరు టాలీవుడ్‌ డాన్సర్స్‌గా రాణిస్తూ ఉండటంతో తను కూడా అలా టాలీవుడ్‌కు వెళ్ళాలని కలలు కనేది. టీవీలో పాటలు చూస్తూ ఇంట్లో తనకుతానుగా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేసేది. కూచిపూడి, భరతనాట్యం ఏమీ నేర్చుకోకపోయినా, నాట్యం బాగా అలవడింది. వరంగల్‌లో బి.ఏ డిగ్రీ పూర్తిచేసి కొంతకాలం హన్మకొండలో ప్రభుత్వ ఆరోగ్యశాఖలో పనిచేసింది. 


టాలీవుడ్‌ డాన్సర్‌గా కెరీర్‌ 

బాల్యం నుంచీ భానుశ్రీ మనసంతా నాట్యం మీదే ఉండేది. టాలీవుడ్‌ డ్యాన్సరవ్వాలనే కోరికతో సన్నిహిత మిత్రుల సహాయంతో హైదరాబాద్‌ చేరుకుంది. తమ కుమార్తె ఏ పని చేసినా సరైన పద్ధతిలో చేస్తుందనే సంపూర్ణ విశ్వాసంతో తల్లిదండ్రులు ఆమెను ప్రోత్సహించారు. దాంతో బంధువుల సంరక్షణలో హైదరాబాద్‌లోనే ఉంటూ తన కజిన్‌ సహాయంతో టాలీవుడ్‌ డ్యాన్స్‌ యూనియన్‌లో సభ్యత్వం పొంది కెరీర్‌ ప్రారంభించి, క్రమంగా డాన్సర్‌గా బిజీ అయిపోయింది. సుమారు మూడున్నరేళ్ళు ఎన్నో తెలుగు సినిమాల్లో పాటలకు డ్యాన్సర్‌గా చేసింది. 


టీవీ సీరియల్ నటిగా

టాలీవుడ్‌లో డ్యాన్సర్‌గా ఉన్న సమయంలోనే భానుశ్రీకి ప్రముఖ టీవీ ఛానల్‌లో ఒక కొత్త సీరియల్‌లో నటించే అవకాశం వచ్చింది. అలా ‘జాబిలమ్మ’ సీరియల్‌లో అమాయకురాలైన ఆడపిల్ల పాత్రలో, ఇద్దరు చెల్లెళ్ళకు అక్కగా 250 ఎపిసోడ్స్‌లో నటించిన భానుశ్రీకి ప్రేక్షకుల్లో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ‘సీతాకోక చిలుక’ సీరియల్లో నెగిటివ్‌ రోల్‌ చేసింది. సీరియల్స్‌ చేస్తూనే, సినిమాల్లో కూడా పనిచేసేవారు భానుశ్రీ. 


బాహుబలి సీన్స్‌లో భానుశ్రీ

తెలుగుచిత్ర పరిశ్రమకు ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చిన ‘బాహుబలి’ చిత్రంలో తమన్నాతో కలిసి నటించారు భానుశ్రీ. అంతకుముందు ‘కుమారి 21F’ చిత్రంలో రాజ్‌ తరుణ్‌ గాళ్‌ ఫ్రెండ్‌గా, ‘ఇద్దరి మధ్య 18’ సినిమాలో హీరోయిన్‌గా, ‘మహానుభావుడు’ చిత్రంలో హీరో శర్వానంద్‌ గాళ్‌ ఫ్రెండ్‌గా నటించారామె. ‘గుంటూరోడు’ చిత్రంలో హీరోయిన్‌ ఫ్రెండ్‌ పాత్రలో నటించింది. 


ప్రస్తుతం నాలుగు సినిమాల్లో...

తాజాగా నాలుగు సినిమాల్లో నటిస్తున్నారు భానుశ్రీ. ‘ఈఎమ్ఐ, నల్లమల, టూరింగ్‌ టాకీస్‌, సముద్రుడు చిత్రాల్లో నటిస్తున్నారు. షూటింగ్‌ పూర్తిచేసుకున్న ఈఎమ్ఐ సినిమాలో హీరోయిన్‌ సత్య పాత్రలో నటించారు. తమిళభాషలో కూడా ఒక చిత్రంలో చేస్తున్నారామె. ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అనే ఈ తమిళ చిత్రంలో హీరో జయ్‌ సరసన హీరోయిన్‌గా చేస్తున్నారు. 


బిగ్‌ బాస్‌ –2 రియాలిటీ షో లో 35 రోజులు

టాలీవుడ్‌ స్టార్‌ హీరో నానీ హోస్ట్‌గా వ్యవహరించిన ‘బిగ్‌ బాస్‌ –2’ సంచిక ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యారు భానుశ్రీ. 35రోజులపాటు బిగ్‌ బాస్‌–2 హోమ్‌లో గడిపారు. ‘‘హోమ్‌లో వాతావరణం ఎంతో డిఫరెంట్‌గా ఉంటుంది. సి.సి కెమేరాల నిఘా మధ్య నిరంతరం కాన్షియస్‌గా ఉన్నా. అప్పుడే రోల్‌ రైడా నాకు క్లోజయ్యాడు. బయట కూడా వాడితో ఎంతో ఆత్మీయంగా ఉంటాను. హోంలో సెలబ్రిటీలందరితోనూ సన్నిహితంగా ఉండేదాన్ని. వాళ్ళందరూ నాతో ఎంతో సరదాగా ఉండేవారు. నిత్యం మంచి ముచ్చట్లు, ఆటలు, పాటలు, తిండి....ఎంతో హాయిగా గడచిపోయింది. అదొక గొప్ప అవకాశం. అలాంటి అవకాశం అందరికీ రాదు. మళ్ళీ మళ్ళీ కోరుకున్నా రాదు. ఈ రియాల్టీ షో ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు బాగా చేరువ అయ్యాను. ప్రేక్షకుల్లో బాగా గుర్తింపు రావడంతో, వారి ఆప్యాయతను చవి చూశాను’’ అన్నారు ఆమె.


‘బిగ్‌ బాస్‌’ ఒక మైండ్ గేమ్‌

‘‘నిజం చెప్పాలంటే, నా గురించి నేను తెలుసుకోడానికీ, నన్ను నేను బాగా అంచనా వేసుకోవడానికీ,  ప్రేక్షకుల గుర్తింపు పొందడానికీ ఈ బిగ్‌ బాస్‌ –2 రియాల్టీ షో నా జీవితంలో ఒక గొప్ప సదవకాశంగా ఉపయోగపడింది’’ అన్నారు భానుశ్రీ. ‘‘మానవ సంబంధాలు కొనసాగించడానికి ఈ షో నాకెంతో దోహదపడింది. అందరితోనూ ఎలా పోటీ పడాలి, ఎలా గెలవాలి....లాంటి విషయాలెన్నో ఈ షో ద్వారా నేర్చుకున్నాను. నన్ను నేను మెరుగుపరుచుకోవడానికి ఈ షో నాకు ఎంతో ఉపయోగపడింది. ఈ షో చేసినంతకాలం చాలా మెంటల్‌ ప్రెజర్‌ ఉంటుంది. నిజం చెప్పాలంటే, బిగ్‌ బాస్‌ అనేది ఒక మైండ్‌ గేమ్‌. హోస్ట్‌ నాని నన్ను బాగా ప్రశంసించారు. ‘నువ్వు ఒక ప్యూర్‌ సోల్‌. చాలా జెన్యూన్‌గా, చాలా లాయల్‌గా ఉండే మనిషివి’ అని నాని నన్ను ప్రశంసించారు. స్ర్టాంగ్ పర్సనాలిటీగా, చాలా ఫాస్ట్‌గా ఉండేదాన్ని. కానీ ఇంకా మరికొన్ని రోజులు బిగ్‌ బాస్‌–2 హోమ్‌లో ఉంటే మరిన్ని గొప్ప విషయాలు నేర్చుకుని ఉండేదాన్ని’’ అన్నారు భానుశ్రీ.


బిగ్‌ బాస్‌తో కొత్త మలుపు తిరిగిన కెరీర్‌ 

‘‘బిగ్‌ బాస్‌ –2 ఒక వండర్‌ఫుల్ అనుభవం. దీంతో నా కెరీర్‌ కొత్త మలుపు తిరిగింది’’ అన్నారు భానుశ్రీ. బిగ్‌ బాస్‌ వల్ల నాకు ఇంకా మంచి గుర్తింపు వచ్చింది. నాకు అవకాశాలు పెరిగాయి. మంచి సినిమాలు వచ్చాయి. ‘ఢీ’ ప్రోగ్రాం టీం లీడర్‌గా చేశాను. సంక్రాంతి, ఉగాది ఈవెంట్స్‌తో టీవీ ప్రేక్షకులను అలరిస్తూ, స్కిట్లు, డాన్స్‌ పెర్ఫార్మెన్సులు చేశాను. ప్రస్తుతం నా జీవితం ఎంతో హ్యాపీగా ఉంది’’ అన్నారామె.



జీ తెలుగులో ‘అదిరింది’ లాఫ్టర్‌ షో

సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, జీ తెలుగు ఫ్యామిలీతో కూడా భానుశ్రీకి అనుబంధం ఏర్పడింది. తాజాగా జీ తెలుగు ఛానల్‌లో ‘అదిరింది’ లాఫ్టర్‌ షో యాంకర్‌గా చేస్తున్నారామె. ‘‘ఈ అనుభవం ఎంతో డిఫరెంట్‌గా ఉంది. నాకు స్టేజీ ఫియర్‌ లేదు కాబట్టి, సామాన్య ప్రజలకు రిలాక్సేషన్‌ ఇచ్చే కామెడీ స్కిట్ల లాఫ్టర్‌ షోలో నా తోటి యాంకర్‌ రవితో కలిసి చక్కగా చేస్తున్నాను. హాస్య రసం పండించే మాటలతో ఒక యాంకర్‌గా ఈ షోకి కొత్త సొబగులద్దడమే మా కర్తవ్యం. స్కిట్లు చూసి కడుపుబ్బ నవ్వుకుంటాం. స్కిట్‌లో నాకు నచ్చిన పాయింట్స్‌పై అక్కడికక్కడే నేను స్పందిస్తాను. ‘అదిరింది’ షో ను బాగా ఎంజాయ్‌ చేస్తున్నాం’’ అన్నారు భానుశ్రీ.


సినీ నటిగా మంచి గుర్తింపు రావాలి

ప్రస్తుతం నాలుగు సినిమాల్లో నటిస్తున్నందువల్ల చాలా సీరియల్స్‌లో అవకాశాలు వస్తున్నప్పటికీ భానుశ్రీ వాటిని అంగీకరించడంలేదు. ‘‘మొదట్లో నటిగా కెమేరా ముందు నిలబడినప్పుడు చాలా భయం వేసేది. చెయ్యలేకపోతున్నానని చాలా బాధపడేదాన్ని. అప్పుడే నాకు తల్లిగా నటించిన సహనటి సలహాలు తీసుకున్నాను. భావోద్వేగాలను పలికించేటప్పుడు ఏ విధంగా మన మనసును సంసిద్ధం చేసుకోవాలి? ఆయా సందర్భాలకనుగుణంగా ఎలా నటించాలో అప్పటినుంచీ బాగా తెలుసుకోవడం ప్రారంభించాను. మిగిలిన సీనియర్‌ నటులు ఎలా నటిస్తున్నారో, కెమెరా ముందు సీన్‌కు అనుగుణంగా వారి మూడ్స్‌ ఎలా మారిపోతున్నాయో బాగా గమనించేదాన్ని. అలా క్రమ క్రమంగా అవగాహన పెంపొందించుకుని నా భయాలు జయించి అలవోకగా నటించడం నేర్చుకున్నాను’’ అన్నారు భానుశ్రీ. ‘‘టాలీవుడ్‌లో మంచి నటిగా పేరు తెచ్చుకోవాలనేదే నా కోరిక’’ అన్నారు ఆమె.


నటన నేచురల్‌గా ఉండాలి

‘‘సమంత, దీపికా పదుకొనే నాకు బాగా ఇష్టం. వారి సినిమాలన్నీ చూస్తాను. నాకు కూడా అలాంటి మంచి పాత్రలు వస్తే బాగుంటుందనిపిస్తుంది. సమంత, దీపికల నటన చాలా నేచురల్‌గా ఉంటుంది. కష్టపడి నటించినట్టు అనిపించదు. నటన ఎప్పుడూ అలా నేచురల్‌గా ఉండాలి. అదే నేనూ ఇష్టపడతాను’’ అన్నారామె.


మనమీద మనకి కాన్ఫిడెన్స్‌ ఉండాలి

‘‘నటన నేచురల్‌గా లేకపోతే ప్రేక్షకులు ఇష్టపడరు, ఆదరణ ఉండదు’’ అన్నారు భానుశ్రీ. ‘‘నేను ఎలాంటి ఎమోషన్స్‌ అయినా ఈజీగా చెయ్యగలను. ముందు దేనికైనా మనమీద మనకి కాన్ఫిడెన్స్‌ ఉండాలి. ఆ ఆత్మవిశ్వాసమే ఉంటే ఎలాంటి భావోద్వేగాలనైనా ఈజీగా పండించగలుగుతాం. ముఖ్యంగా కెమేరా ముందు నిలబడినప్పుడు ఆత్మవిశ్వాసం ఉండాలి. లేకపోతే ఆర్టిస్టుగా నిలదొక్కుకోలేం’’ అన్నారామె. 


మా మధ్య ఉండేది ప్రేమానుబంధమే 

‘‘నటీనటులకు–ప్రేక్షకులకు మధ్య ఉండేది ప్రేమానుబంధమే, నటులకు గుర్తింపునిచ్చేది ప్రేక్షకులే. ప్రేక్షకులు లేకపోతే నటులు లేరు. మా విజయానికి కారకులు ప్రేక్షకులే’’అన్నారామె. ‘‘పాత్రకు జీవం పోసిన నటులను ప్రేక్షకులు ప్రేమిస్తారు. అభిమానిస్తారు, ఆరాధిస్తారు. బుల్లి తెరమీద ఉన్నా, వెండి తెరమీద ఉన్నా ప్రేక్షకులు నన్ను అలాగే ఆదరించారు. సినిమా రంగంలోని వాతావరణం కూడా నాకు చాలా బాగుంది. నాకేమీ సమస్యలు లేవు. అందరూ నాకు మంచి గౌరవం ఇస్తారు. అందరితో కలుపుగోలుగా ఉండటమే నా లక్షణం. ఆ కలుపుగోలుతనం, స్నేహభావం వల్లనే నాకు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. నేను ఈ స్థాయికి ఎదుగుతానని అమ్మా నాన్నా ఊహించలేదు. ఇప్పుడు వాళ్ళెంతో సంతోషంగా ఉన్నారు. పండుగలకు, పబ్బాలకు మా సొంత ఊరు వెళతాను. బంధువులందరూ నన్ను, నా ఎదుగుదలనూ, నా నటననూ మెచ్చుకుంటుంటే నాకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. జీవితం ఆనందంగా, హ్యాపీగా సాగిపోతోంది’’ అన్నారు భానుశ్రీ. కీపిటప్‌ భాను.


Updated Date - 2020-04-03T03:36:54+05:30 IST