పవన్ కల్యాణ్ అన్నప్పుడే.. సినిమా వాళ్లంతా ఏకమైతే మరోలా ఉండేదేమో!

‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఏపీ ప్రభుత్వ ఆన్‌లైన్ టికెటింగ్‌ విధానంపై, టికెట్ల ధరలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడు టాలీవుడ్ నుండి పెద్దగా స్పందన రాలేదు. ఒకరిద్దరు మినహా పవన్ కల్యాణ్‌ నిర్ణయానికి సపోర్ట్ చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఒకవేళ వస్తే.. క్రెడిట్ మొత్తం పవన్ కల్యాణ్‌కే పోతుందని అనుకున్నారో.. లేక మనకెందుకులే అని అనుకున్నారో తెలియదు కానీ.. ఇప్పుడు మాత్రం టాలీవుడ్‌కి పెద్ద డ్యామేజీనే జరిగిందని చెప్పుకోవచ్చు. బుధవారం ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ ఎమెండ్మెంట్ బిల్లు‌ను ప్రవేశ పెట్టింది. ఈ బిల్లు ప్రకారం.. ‘‘నో బెనిఫిట్ షోస్, నో ఎక్స్‌ట్రా షోస్, నో టికెట్ హైక్స్.. కేవలం నాలుగంటే నాలుగే ఆటలు. టికెట్లను కూడా ప్రభుత్వమే ఆన్‌లైన్‌లో అమ్ముతుంది..’’.. అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఏపీ ప్రభుత్వ చేతుల్లోకి వెళ్లిపోయినట్లే. ప్రభుత్వం ఎలా అంటే అలా నడవాల్సిందే. 

అదే పవన్ కల్యాణ్ అన్నప్పుడు కనుక ఇండస్ట్రీ మొత్తం ఏకమై ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ బిల్లు విషయంలో ఏపీ ప్రభుత్వం ఆలోచించి ఉండేది. కొంతలో కొంతైనా మార్పు ఉండేది. ఇప్పుడసలు మారు మాట్లాడడానికి లేకుండా చేశారు. మరో వైపు ఏపీ ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రాష్ట్రంలో అనేక సమస్యలుండగా, నిత్యావసర ధరలు మండిపోతున్న తరుణంలో వాటిపై దృష్టి పెట్టకుండా.. ఇష్టం ఉంటే కొనుక్కునే సినిమా టికెట్ విషయంలో ఎందుకింత చొరవ చూపిస్తున్నారనే విషయం నిజంగా అంతుబట్టడం లేదంటూ సినీ పెద్దలే కొందరు బాహాటంగా అంటున్నారు. 

పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి సమస్య లేనప్పుడు.. కేవలం ఏపీలోనే ఎందుకు దీనిని భూతద్ధంలో చూస్తున్నారనేది కూడా అర్థం కాదు. మంత్రి పేర్ని నాని అయితే.. ఏపీలో ఏ రంగంలోనూ అన్యాయం జరగడం లేదు.. కేవలం సినిమా టికెట్ల విషయంలోనే ప్రజలు నష్టపోతున్నారు అన్నట్లుగా మాట్లాడుతుండటం మరీ విడ్డూరం. పోనీ సినిమా ఇండస్ట్రీ ఏపీకి రావడం లేదని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారా? అంటే.. దీనిపై ఇండస్ట్రీ నుండి సానుకూల స్పందనే ఉంది. సరైన సౌకర్యాలు కల్పిస్తే.. రెండు చోట్ల నుండి పని చేయడానికి మేము సిద్దమే అనేలా సినీ ఇండస్ట్రీ వర్గాలు ఎప్పుడో తెలియజేశాయి. అయినా ఏపీ ప్రభుత్వానికి ఎందుకింత పంతమో అర్థం కాని విషయం. కాగా, ఈ బిల్లుపై ఇండస్ట్రీ నుండి ఎటువంటి కదలిక ఉంటుందో తెలియదు కానీ.. ఈ నిర్ణయంతో థియేటర్ల వ్యవస్థ కుంటుపడి ఓటీటీ సంస్థలు రాజ్యమేలడం మాత్రం ఖాయం.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.