సెకండాఫ్‌లో సందడికి బీటౌన్‌ రెడీ!

ABN , First Publish Date - 2021-07-12T06:18:34+05:30 IST

తెలుగు సినిమాకు ఈ ఏడాది మంచి ఆరంభం లభించింది. కరోనా కొట్టిన దెబ్బ నుంచి కోలుకుని, థియేటర్లలో చిత్రాలను విడుదల చేసింది....

సెకండాఫ్‌లో సందడికి బీటౌన్‌ రెడీ!

తెలుగు సినిమాకు ఈ ఏడాది మంచి ఆరంభం లభించింది. కరోనా కొట్టిన దెబ్బ నుంచి కోలుకుని, థియేటర్లలో చిత్రాలను విడుదల చేసింది. రెండో దశ దెబ్బకు ‘వకీల్‌ సాబ్‌’ తర్వాత తెలుగులో మరో చిత్రం థియేటర్లలోకి రాలేదు. ఇప్పుడు రాబోతున్నాయి. అయితే, ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో భారీ విజయాలు అందుకున్నవి  ఎక్కువే ఉన్నాయి. ఓటీటీలో విడుదలైన చిన్న చిత్రాలు పెద్ద సంఖ్యలో వీక్షకుల్ని ఆకట్టుకున్నాయి. హిందీలో ఆమాత్రం సందడి కూడా లేదు. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చిన చిత్రాల్లో విజయాలు సాధించినవి తక్కువ. అరకొర విజయాలతో ఆర్నెల్లు గడిచాయి. అయితే, రాబోయే ఆర్నెల్లలో కొత్త సినిమాలతో సందడి చేయడానికి బీటౌన్‌ రెడీగా ఉంది. వాటిలో పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన తెలుగు సినిమాలూ ఉన్నాయి. థియేటర్లలో కావచ్చు... ఓటీటీ వేదికల్లో కావచ్చు... 2021 సెకండాఫ్‌లో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలేవో చూడండి.


హిందీలో పేరున్న తారలు నటించిన చిత్రాలు ఈ ఏడాది ఎన్ని విడుదలయ్యాయి? అంటే... వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. సల్మాన్‌ఖాన్‌ ‘రాధే’, విద్యా బాలన్‌ ‘షేర్ని’, జాన్‌ అబ్రహం - ఇమ్రాన్‌ హష్మిల ‘ముంబై సాగా’, తాప్సీ ‘హసీన్‌ దిల్‌రూబా’, అర్జున్‌ కపూర్‌ - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ల ‘సర్దార్‌ కా గ్రాండ్‌సన్‌’, రాజ్‌కుమార్‌ రావ్‌ - జాన్వీ కపూర్‌ల ‘రూహి’, పరిణీతి చోప్రా ‘సైనా’, ‘ద గాళ్‌ ఆన్‌ ద ట్రైన్‌’ వంటివి ఉన్నాయి. వీటిలోనూ ఓటీటీల్లో విడుదలైనవి ఎక్కువ. సెకండాఫ్‌లోనూ ఓటీటీ రిలీజులు కొన్ని ఉన్నప్పటికీ... థియేటర్లలోకి రావడానికి సిద్ధమైనవీ ఉన్నాయి. అందుకని, థియేటర్ల దగ్గర మళ్లీ సందడి నెలకొంటుందని ఆశించవచ్చు.


తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘హసీన్‌ దిల్‌రూబా’తో హిందీ చిత్రసీమలో ద్వితీయార్థం ప్రారంభమైంది. ఈ నెల 2న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. దీని తర్వాత 9న జీ5లో ‘స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ ఎటాక్‌’ విడుదలైంది. రాబోయే చిత్రాల సంగతికి వస్తే... అమెజాన్‌ ప్రైమ్‌లో 16న ఫర్హాన్‌ అక్తర్‌ ‘తూఫాన్‌’, 23న డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ‘హంగామా-2’ విడుదలకు సిద్ధమయ్యాయి. రెండూ ఓటీటీ రిలీజులే. ఆ తర్వాత కృతీ సనన్‌ ‘మిమి’ (30న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల)తో సహా! మరి, థియేట్రికల్‌ రిలీజుల సంగతేంటి? అంటే... థియేటర్ల డోర్లు ఓపెన్‌ చేసే బాధ్యతను అక్షయ్‌కుమార్‌ తీసుకున్నారు. బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలతో, వరుసగా రెండు వారాలు థియేటర్లలో అడుగుపెట్టడానికి సిద్ధమయ్యారు.


అక్షయ్‌కుమార్‌ డబుల్‌ ధమాకా!

అక్షయ్‌కుమార్‌ కథానాయకుడిగా నటించిన స్పై థ్రిల్లర్‌ ‘బెల్‌ బాటమ్‌’. ఈ నెల 27న థియేటర్లలో విడుదల కానుంది... ఎటువంటి అడ్డంకులూ ఎదురు కాకపోతే! అక్షయ్‌ ‘రా’ ఏజెంట్‌గా నటించిన ఈ సినిమాకు లభించే స్పందన, వసూళ్లు చాలా కీలకం. ఎందుకంటే... కరోనాకు భయపడి ప్రేక్షకులెవరూ థియేటర్లకు రాకపోతే, కొత్త సినిమాలను విడుదల చేసే సాహసం హిందీ నిర్మాతలు చేయకపోవచ్చు. కొన్నాళ్లు వేచిచూద్దామని వాయిదా వేయవచ్చు. అయితే, ‘బెల్‌ బాటమ్‌’ విడుదలైన తర్వాత వారమే... ఆగస్టు 6న ‘అతరంగీ రే’ను విడుదలకు సిద్ధం చేశారు అక్షయ్‌. ధనుష్‌, సారా అలీ ఖాన్‌తో ఆయన నటించిన చిత్రమది. ఈ రెంటికీ మధ్యలో ఈ నెల 30న ఆలియా భట్‌ వేశ్యగా నటించిన ‘గంగూబాయి కథియవాడి’ థియేటర్లలోకి రానుంది. సంజయ్‌ లీలా భన్సాలీ సినిమా కావడంతో దీనిపైనా మంచి అంచనాలు ఉన్నాయి.


బీటౌన్‌లో టాలీవుడ్‌ హంగామా!

ఆగస్టులో హిందీ సినిమాల స్పీడు కొంచెం తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అక్షయ్‌, ధనుష్‌, సారాల ‘అతరంగీ రే’ తర్వాత హీరో అజయ్‌ దేవగణ్‌  నటించిన దేశభక్తి సినిమా ‘భుజ్‌: ద ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియా’ వస్తోంది. దీనిని ఓటీటీకి ఇచ్చేశారు. ఆగస్టు 13న విడుదల కానుంది. జాన్‌ అబ్రహం, జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన ‘ఎటాక్‌’ను అదే తేదీన థియేటర్లలో విడుదల చేయాలనుకున్నప్పటికీ... వాయిదా పడే ఛాన్సు ఉందంట. రణ్‌వీర్‌ సింగ్‌ ‘జయేశ్‌భాయ్‌ జోర్దార్‌’ మాత్రం ఆగస్టు 27న థియేటర్లలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే, ఆ తర్వాత నుంచి రెండు నెలలు బీటౌన్‌లో టాలీవుడ్‌దే హంగామా.


విజయ్‌ దేవరకొండ హీరోగా దర్శకుడు పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న ‘లైగర్‌’ను సెప్టెంబర్‌ 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా కొంత షూటింగ్‌ బ్యాలెన్స్‌ ఉన్నప్పటికీ... పూరి స్పీడుకు సినిమా రెడీ కావడం పెద్ద విషయమేమీ కాదు. అయితే, ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా? ఓటీటీకా? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్‌. సెప్టెంబర్‌ 24న విడుదలకు సిద్ధమవుతున్న హిందీ సినిమాతోనూ టాలీవుడ్‌కు సంబంధం ఉంది. కార్తికేయ హీరోగా నటించిన హిట్‌ సినిమా ‘ఆర్‌ఎక్స్‌ 100’కు అది రీమేక్‌. అక్టోబర్‌ 13న విజయదశమి సందర్భంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదల కానుంది. ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమా కావడం... ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ తొలిసారి కలిసి నటిస్తున్న సినిమా కనుక దేశవ్యాప్తంగా అంచనాలు నెలకొన్నాయి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ముందు కంగనా రనౌత్‌ నటిస్తున్న ‘ధాకడ్‌’ అక్టోబర్‌ 1న విడుదలకు సిద్ధమైంది. అదే నెలలో 15న ‘మైదాన్‌’ విడుదల చేయనున్నట్టు నిర్మాత బోనీ కపూర్‌ ప్రకటించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో అతిథిగా నటించిన అజయ్‌ దేవగణ్‌ అందులో సోలో హీరో. ‘పుష్ప’ కూడా హిందీలో విడుదల కానుంది. త్వరలో విడుదల తేది ప్రకటిస్తారని సమాచారం.


లాస్ట్‌ షాట్‌ రణ్‌వీర్‌దే!

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ విడుదలైన మరో రెండు మూడు వారాల వరకూ భారీ హిందీ చిత్రాలు రావడం లేదు. అయితే... నవంబర్‌ 5న అక్షయ్‌కుమార్‌ ‘పృథ్వీరాజ్‌’, షాహిద్‌ కపూర్‌ ‘జెర్సీ’ చిత్రాలు బాక్సాఫీస్‌ బరిలో ఢీ కొట్టబోతున్నాయి. ప్రస్తుతానికి నవంబర్‌లో కర్ఛీఫ్‌ వేసినవి ఆ రెండే. మళ్లీ క్రిస్మస్‌కి సందడి నెలకొనడం ఖాయం. డిసెంబర్‌ 3న టైగర్‌ ష్రాఫ్‌ ‘హీరోపంతి-2’ రానుంది. ‘లాల్‌సింగ్‌ చద్దా’తో క్రిస్మస్‌ సీజన్‌లో 24న ఆమిర్‌ఖాన్‌ రానున్నారు. ఆ సినిమాలో నాగచైతన్య అక్కినేని నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇయర్‌ ఎండ్‌కి రణ్‌వీర్‌ సింగ్‌ ‘సర్కస్‌’ థియేటర్లలోకి వస్తున్నాయి. నిజం చెప్పాలంటే... కపిల్‌దేవ్‌గా రణ్‌వీర్‌ నటించిన ‘83’ ఇప్పటికే విడుదల కావాల్సింది. కరోనా వల్ల గత ఏడాది ఓసారి, ఈ ఏడాది మరోసారి వాయిదా పడింది. పరిస్థితులను బట్టి ఆ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తున్నాయి. అయితే, దానితో సంబంధం లేకుండా రణ్‌వీర్‌ నటించిన మరో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇవే కాకుండా మధ్యలో కొన్ని చిత్రాలు ఓటీటీ వేదికల్లో సందడి చేయనున్నాయి. కరోనా పరిస్థితులను బట్టి ఈ విడుదల తేదీలూ మారొచ్చు.


‘రోర్‌ ఆఫ్‌ ఆర్‌ఆర్‌ఆర్‌’ పేరుతో ఈ నెల 15న మేకింగ్‌ వీడియో విడుదల చేయనున్నట్టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం ప్రకటించింది. రాజమౌళి దర్శకత్వంతో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్‌ నటిస్తున్న ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాత.


Updated Date - 2021-07-12T06:18:34+05:30 IST