బ్యూటీస్‌ విత్‌ క్యూటీస్‌

టాలీవుడ్‌ హీరోయిన్లలో చాలా మందికి పెట్స్‌   (పెంపుడు జంతువులు) ఉన్నాయి. వాటిలో శునకాలే ఎక్కువ. అవంటే మన కథానాయికలకు మహా ప్రేమ. నిత్యం సినిమాలతో బిజీగా ఉండే వీరికి, కాస్త సమయం దొరికితే చాలు తమ పెట్స్‌తో ఫోటోలకు ఫోజులిస్తారు. కొంతమంది సినిమా సెట్స్‌కు కూడా బుజ్జిబుజ్జి శునకాలను తెచ్చు కుంటుంటారు. తమ పెట్స్‌తో బలమైన బంధాన్ని ఏర్పరచుకున్న హీరోయిన్లు వీరంతా. 


పోలో ప్రేమలో అంజలి

దక్షిణాది హీరోయిన్‌ అనగానే చటుక్కున్న గుర్తొచ్చే పేరు అంజలి. ఈ అచ్చతెనుగు ఆడపడుచు తమిళంలో మంచి పేరు తెచ్చుకుని, తెలుగులోనూ టాప్‌ హీరోయిన్‌గా నిలిచింది. పన్నెండేళ్ల నుంచి సినిమా ప్రపంచంలో తనదైన శైలిలో దూసుకుపోతోంది. అంజలికి ఏడాది క్రితం కొత్త స్నేహం తోడైౖంది. ఆ స్నేహం ప్రేమగా మారిపోయిందిప్పుడు. కారణం? ‘పోలో’. అది ఓ బుజ్జి కుక్కపిల్ల. దానికి ఈ మధ్యనే మొదటి పుట్టినరోజును ఘనంగా చేసింది అంజలి. పోలో తన ఇంటికి వచ్చిన తొలి రోజునే దాని పుట్టిన రోజు జరుపుకుంది. ఆ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోలో ఫోటోలను అప్‌లోడ్‌ చేసి ‘డియర్‌ పోలో, నువ్వు నా జీవితంలోకి బోలెడంత సంతోషాన్ని తీసుకొచ్చావు, ఐ లవ్‌ యూ’ అని క్యాప్షన్‌ పెట్టింది. ఇప్పుడు అంజలి అభిమానులకు కూడా పోలో ఫేవరెట్‌ డాగ్‌ అయ్యింది. 

రెండేళ్ల బంధం

సూపర్‌ హిట్‌ సినిమాలతో విజయవంతంగా సాగిపోతోంది సమంత. మఽధ్యలో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలోనూ మెరుస్తోంది. సమంతకు సోషల్‌ మీడియాలో సూపర్‌ ఫాలోయింగ్‌ ఉంది. తెలుగులో హీరోలతో సమానంగా క్రేజ్‌ ఉన్న హీరోయిన్‌ సామ్‌. ఆమె అప్పుడప్పుడు తన ఇన్‌స్టా ఖాతాలో పెంపుడు శునకాల ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంది. 2018 లో సామ్‌- చై కలిసి రెండు శునకాలను కొని తెచ్చుకున్నారట. అందులో ఒక దాని పేరు ‘హష్‌ అక్కినేని’, రెండోది ‘డ్రోగో అక్కినేని’. రెండూ బుజ్జి కుక్కపిల్లలే. పెద్దగా ఎత్తు, పొడవు ఉండవు. సామ్‌ వర్కవుట్‌ చేస్తుంటే పక్కనే నిల్చుని ఆమెకు తోడుగా ఉంటుంది హష్‌. ఎందుకో కానీ డ్రోగో కన్నా హష్‌తోనే ఎక్కువ ఫోటోలు షేర్‌ చేస్తుంటుంది సామ్‌. జాతీయ పెంపుడు జంతువుల దినోత్సవం రోజున హష్‌ ను ఉద్దేశిస్తూ పోస్టు పెట్టింది. ‘బెస్ట్‌ డాగ్‌ ఎవర్‌’ అని బిరుదు కూడా ఇచ్చేసింది. 

జంతు ప్రేమికురాలు

రష్మిక ఈ మధ్యనే ‘పెట్‌ పేరెంట్‌’ గా మారింది. ఓ బుజ్జి శునకాన్ని దత్తత తీసుకుని తనను ‘పెట్‌ మామ్‌’గా చెప్పుకుంటోంది. ఈ ఏడాది జూన్‌లోనే రష్మిక జీవితంలోకి ‘ఆరా’ వచ్చింది. ఇక అప్పట్నించి దాంతోనే ఎక్కువ సమయం గడుపుతోంది రష్మిక. అంతేకాదు ఆరాను సరదాగా తన ట్రావెల్‌ పార్టనర్‌గా మార్చేసుకుంది. తాను ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకెళుతోంది. తన జీవితంలో ఉత్తమ ట్రావెల్‌ పార్టనర్‌ ఆరానే అని చెబుతూ ఆ మధ్య పోస్టు పెట్టింది. ఆరాను అభిమానులకు పరిచయం చేసేప్పుడు చాలా హృద్యంగా రాసుకొచ్చింది రష్మిక. ‘ఎవరైనా ఎదుటి వ్యక్తిని చూడగానే మూడు సెకన్లలో ప్రేమలో పడొచ్చు. కానీ నేను ఆరాను చూశాక కేవలం 0.3 మిల్లీసెకన్లలో ఇష్టపడ్డాను. ఆరా గురించి ఇక అప్డేట్‌ చేస్తూనే ఉంటాను’ అని రాసుకొచ్చింది. షూట్‌ లో రెండు రోజులు గ్యాప్‌ వస్తే చాలు ఆరా కోసమే రష్మిక ఇంటికి వెళ్లిపోతోందట. ఆమె తన ఫామ్‌హౌస్‌లో ఆవులు, బాతులు, కోళ్లు కూడా పెంచుతోంది. 

కీర్తికి క్లోజ్‌ ఫ్రెండ్‌

‘మహానటి’ సినిమా తరువాత కీర్తికి వీరాభిమానులున్నారు. ఆ సినిమాతో తెలుగింటి అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. జాతీయ ఉత్తమనటిగా నిలిచింది. లాక్‌డౌన్‌లో కీర్తి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండేది. షూటింగులు లేకపోవడం, ఇంట్లోనే ఖాళీగా ఉండడంతో ఇన్‌స్టాలో అభిమానులకు చేరువయ్యేందుకు ప్రయత్నించింది. ఇందులో భాగంగా తన కొత్త స్నేహితుడు ‘నైక్‌’ను పరిచయం చేసిందామె. నలుపు, తెలుపు రంగుల్లో ఉన్న నైక్‌ను ఎత్తుకుని ఫోటోలకు ఫోజులిచ్చి, వాటిని అభిమానుల కోసం ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. అంతేకాదు కొన్ని ఫోటో షూట్లకు కూడా నైక్‌ను వెంట తీసుకుని వెళ్లింది. 2021 కొత్త ఏడాదిలో తన తొలి ఫోటో షూట్‌లో నైక్‌తో పాటూ పాల్గొంది. దాని ఫోటోలను ఇన్‌స్టాలో నైక్‌ డైరీస్‌ హ్యాష్‌ ట్యాగ్‌తో పోస్టులు చేస్తోంది కీర్తి. ఇప్పుడు ఆమెకునిత్యం వెంట ఉండే  స్నేహితుడు ‘నైక్‌’. 

బ్రూనో అంటే ప్రాణం

టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. ఆమెను ఒక నెటిజన్‌ ‘మీరు డాగ్‌ లవరా లేదా క్యాట్‌ లవరా?’ అని అడిగాడు. దానికి ఆమె తన పెంపుడు శునకంతో ఆడుకుంటున్న ఫోటోను పోస్టు చేసింది. తనకు శునకాలంటే చాలా ఇష్టమని చెప్పింది. ఆమె పెంచుకున్న శునకం పేరు బ్రూనో. గోల్డెన్‌ రిట్రీవర్‌ జాతికి చెందినది. దీపావళి నాడు బాణాసంచా కాలిస్తే బ్రూనో భయపడుతుందని భావించి, ఇంట్లోనే దానికి తోడుగా ఉంది. అంతేకాదు ఇన్‌స్టాలో మూగజీవాలకు ఇబ్బంది కలగకుండా చూసుకోమంటూ సూచనలు చేసింది. శునకాల ఆహారమైన డ్రూల్స్‌ కంపెనీతో అనుసంధానమైంది. వీధికుక్కలకు ఉచిత ఆహారం అందిస్తున్న పనిలో కూడా పాలు పంచుకుంది పూజా. బ్రూనో కోసం ఆహారం కూడా ప్రత్యేకంగా చేయిస్తుంది. ఆ చిట్టి కుక్కపిల్లను తన స్నేహితుడిగా చెప్పుకుంటుంది. 

హన్సిక ఇంట్లో టెడీ

హన్సిక కుటుంబంలోకి ఈ ఏడాది మేలో ఒక కొత్త సభ్యుడు అడుగుపెట్టాడు. పేరు ‘టెడీ మోత్వానీ’. రోజుల వయసుండే ఆ కుక్కపిల్లని హన్సిక పెంచుకునేందుకు ఇంటికి తెచ్చుకుంది. ఈ కుక్కపిల్ల జాతి ‘టీకప్‌ మాల్టీస్‌’. చూడటానికి చక్కటి బొమ్మల్లా కనిపించే ఈ పప్పీలు ఎత్తు పెరగవు. ఎదిగినా నాలుగంగుళాలు మాత్రమే పెరుగుతాయి. వయసు పెరిగినా వీటి సైజు చిన్నగానే ఉంటుంది కనుక ముద్దుగా ఉంటాయి. అందుకే హన్సిక ఏరికోరి దీన్ని కొని తెచ్చుకుంది. చాలా మంది సెలెబ్రిటీలకు ఈ జాతి కుక్కపిల్లలంటే ఇష్టం. హన్సిక క్యూట్‌ కుక్కపిల్ల టెడీకి వీరాభిమాని అయిపోయింది. ఇన్‌స్టాలో తన ఫాలోవర్లకు టెడీని పరిచయం చేసింది. ‘వెల్‌కమ్‌ హోమ్‌ టెడీ’ అని పోస్టు పెట్టింది.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.