‘అసలేం జరిగింది’.. ఎంతో సంతృప్తినిచ్చింది: హీరో శ్రీరామ్

శ్రీరామ్, సంచితా పదుకునే జంటగా ఎన్వీఆర్ దర్శకత్వంలో ఎక్సోడస్ మీడియా పతాకంపై మైనేని నీలిమా చౌదరి, కింగ్ జాన్సన్ కొయ్యడ నిర్మించిన చిత్రం ‘అసలేం జరిగింది’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో చిత్రబృందం విజయోత్సవ వేడుకను నిర్వహించింది. 


ఈ కార్యక్రమంలో హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. తెలుగులో సహాయ పాత్రలు ఎక్కువగా వస్తున్నాయి. అలాంటి పాత్రలకు దూరంగా ఉంటూ సోలో హీరోగా మాత్రమే నటించాలనే నిర్ణయం తీసుకున్న నాకు.. మేకప్‌మ్యాన్ ద్వారా ఈ దర్శకనిర్మాతలు నన్ను కలిశారు. వారు చెప్పిన కథ నచ్చింది. లిమిటెడ్ బడ్జెట్‌లో నిజాయితీగా సినిమా చేస్తామని మాటిచ్చారు. అన్నట్లుగానే ఎంతో క్రమశిక్షణ, తపనతో కష్టాల కోర్చి నాణ్యతతో ఈ సినిమా పూర్తిచేశారు. చక్కటి పదాలతో వాసు అర్థవంతమైన సంభాషణలు రాశారు. షూటింగ్ మొత్తం సరదాగా సాగింది. పల్లెటూరికి విహారయాత్రకు వెళ్లిన అనుభూతి కలిగింది. పెద్ద సినిమాల వల్ల చిన్న చిత్రాలకు స్క్రీన్స్ దొరకడం లేదు. ఆ పోరాటం ఎప్పుడూ ఉంటుంది. పెద్దవారిని విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదు. కష్టపడి సాధించిన విజయంలో ఎంతో సంతృప్తి ఉంటుంది. అలాంటి సక్సెస్‌ను మాకు అందించిన చిత్రమిది. కొత్తవాళ్లను ప్రోత్సహించే కింగ్ జాన్సన్ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడే ప్రతిభావంతులకు అవకాశాలు దొరకుతాయి. మంచి పాటలున్న సినిమా చాలా రోజుల తర్వాత చేయడం ఆనందంగా అనిపించింది. మిడిల్‌ క్లాస్ సినిమా బాగుంటేనే ఇండస్ట్రీ బాగుంటుంది. ఈ సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు.. అని అన్నారు.

నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. ఎక్సోడస్ మీడియా పతాకంపై మేము నిర్మించిన తొలి సినిమా ఇది. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశంతో పరిమిత బడ్జెట్‌లో సినిమాను తెరకెక్కించాం. తెలుగు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తున్నది. పాజిటివ్ టాక్ వస్తుంది. వసూళ్లు బాగున్నాయి. ఊహించని విజయమిదని తెలుపగా.. దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ క్రెడిట్ నిర్మాత జాన్సన్‌కు దక్కుతుంది. సినిమా హిట్ అవుతుందని నమ్మిన తొలి వ్యక్తి హీరో శ్రీరామ్. నన్ను, నా కథను నమ్మి అండగా నిలిచారు.. వారికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు అని చెప్పారు.

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.