చిన్నారులతో... రూటు మార్చిన దర్శకుడు

ABN , First Publish Date - 2021-08-06T01:06:35+05:30 IST

ప్రసన్న - స్నేహ జంటగా నటించిన చిత్రం ‘అచ్చముండు అచ్చముండు’. ఈ చిత్రానికి దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌. ఆ తర్వాత సీనియర్‌ నటుడు అర్జున్‌ హీరోగా ‘నిబునన్‌’, మోహన్‌లాల్‌తో ‘పెరుచ్చొళి’ వంటి చిత్రాలను

చిన్నారులతో... రూటు మార్చిన దర్శకుడు

ప్రసన్న - స్నేహ జంటగా నటించిన చిత్రం ‘అచ్చముండు అచ్చముండు’. ఈ చిత్రానికి దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌. ఆ తర్వాత సీనియర్‌ నటుడు అర్జున్‌ హీరోగా ‘నిబునన్‌’, మోహన్‌లాల్‌తో ‘పెరుచ్చొళి’ వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. అలాగే, ‘సీతాక్కతి’ వంటి చిత్రాలకు సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఈయన ఇపుడు రూటు మార్చి చిన్నారుల కోసం ఓ చిత్రాన్ని ప్లాన్‌ చేశారు. దానికి దర్శకత్వం వహించడమే కాకుండా తన సొంత నిర్మాణ సంస్థ యూనివర్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై నిర్మించనున్నారు. 


ఈ మూవీ విషయాలను దర్శకుడు అరుణ్‌ వైద్యనాథన్‌ తెలియజేస్తూ.. ‘‘చిన్నారులను సెంటర్‌ పాయింట్‌గా చేసుకుని తమిళంలో చాలా తక్కువ సంఖ్యలో చిత్రాలు వస్తున్నాయి. ఒకవేళ అలాంటి సినిమాలను తెరకెక్కించిన పక్షంలో వాటిలో ప్రేమ, యాక్షన్‌ సన్నివేశాలుంటున్నాయి. ఇలాంటి అంశాలేవీ లేకుండా కేవలం చిన్నారుల కోసమే, చిన్నారులనే కేంద్రంగా చేసుకుని, చిన్నారులనే చూపించాలన్న ప్రయత్నమే ఈ చిత్రం. ఇది చిన్నారుల కోసం తీసే చిత్రంగా ఉన్నప్పటికీ అన్ని వయస్సుల ప్రేక్షకులు చూసేలా ఉంటుంది. కరోనా కష్టకాలంలో చిన్నారులే అధికంగా ఇబ్బందులు పడ్డారు. ఓటీటీల్లో కూడా చిన్నారులకు ఆహ్లాదాన్ని కలిగించే చిత్రాలు రాలేదు. ఈ చిత్ర కథను కరోనాకు ముందే రాసుకున్నాను. దీనిని దృశ్యకావ్యంగా మార్చేందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నాను. పలు అంతర్జాతీయ చిత్సోవాల్లో కూడా ఈ మూవీని ప్రదర్శించాలని భావిస్తున్నాను. నలుగురు చిన్నారులు ఈ చిత్రంలో కీలక భూమికను పోషిస్తారు. ఈ చిత్ర కథ చెన్నైలో జరిగినప్పటికీ ప్రపంచంలోని ప్రతి చిన్నారికి ఇది సంబంధం ఉంటుంది. నిర్మాణపరంగా కూడా ఉన్నత సాంకేతిక విలువలతో తెరకెక్కించాలని ప్లాన్‌ చేస్తున్నాం’’ అన్నారు.

Updated Date - 2021-08-06T01:06:35+05:30 IST