ఆహాలో ‘అర్జున ఫల్గుణ’.. ఎప్పుడంటే?

శ్రీవిష్ణు, అమృత అయ్యర్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ‘అర్జున ఫల్గుణ’ చిత్రం ఓటీటీలో విడుదలకాబోతోంది. 31 డిసెంబర్, 2021న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. సక్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడీ చిత్రాన్ని రిపబ్లిక్ డేని పురస్కరించుకుని స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ‘ఆహా’ ఓటీటీ ప్రకటించింది. మ్యాట్సీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా.. తేజ మర్ని దర్శకత్వం వహించారు.


చిత్ర కథ విషయానికి వస్తే.. 

తూర్పుగోదావరి జిల్లా ములకల్లంకలో అర్జున్ (శ్రీవిష్ణు), శ్రావణి (అమృతా అయ్యర్), తాడోడు (రంగస్థలం మహేశ్), రాంబాబు, ఆస్కార్ చిన్నప్పటి నుంచి స్నేహితులు.  ఆ ఊళ్ళో అల్లరి చిల్లరగా తిరుగుతూ తల్లి దండ్రులకు తలపోటుగా మారతారు. అర్జున్‌కు తన స్నేహితులంటే ప్రాణం. తాడోడి ఇంటిని బ్యాంక్ వారు జప్తు చేస్తుంటే.. ఆ ఊరి కరణం ( నరేశ్ ) హామీ మేరకు కొంత డబ్బు చెల్లించి.. జప్తును కొద్దిరోజులు వాయిదా వేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ ప్రాసెస్ లో అర్జున్ తన ఆవును కరణానికి తనఖా పెట్టాల్సి వస్తుంది. తాడోడి ఇంటిని విడిపించి.. వారి కుటుంబాన్ని ఒడ్డున పడేయాలనుకున్న అర్జున్ స్నేహితులు.. ఆ ఊళ్ళో సోడా సెంటర్ పెట్టాలనుకుంటారు. ఆ ప్రాసెస్‌లో వారి చిన్నప్పటి మరో స్నేహితుడి ఆఫర్ మేరకు వైజాగ్ వెళ్ళి గంజాయి స్మగ్లింగ్ చేయాల్సి వస్తుంది. ఐదుగురు స్నేహితులు వైజాగ్‌లోని అరకు చేరతారు. అక్కడ సరుకు తీసుకొని.. ఒరిస్సాలో దాన్ని అందచేసి డబ్బులు తీసుకొని మళ్ళీ వైజాగ్ వచ్చేయాలని ప్లాన్ చేస్తారు. అయితే అనూహ్యంగా ఈ మిత్ర బృందం పోలీసులకు చిక్కుతారు. అక్కడనుంచి కష్టపడి తప్పించుకొని తిరిగి తమ ఊరికి వచ్చేస్తారు. పోలీసులు వీరిని వేటాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఊరిలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతాయి. ఆ అనూహ్యమైన సంఘటనలు ఏంటి? అర్జున్ మిత్ర బృందం ఈ కేసునుంచి ఎలా బైట పడ్డారు? వంటి ఆసక్తికరమైన అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.