మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ విడుదల హడావిడిలో ఉన్నాడు. తారక్, జక్కన్నలతో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఇక దీని తర్వాత చెర్రీ నటిస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం RC 15. శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు ప్రొడక్షన్స్ లో నిర్మాణం జరుపుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తయింది. తదుపరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది. ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్డేట్ అభిమానుల్ని ఊరిస్తోంది. ఇందులో చరణ్ ఎలక్షన్ కమీషనర్ గా నటించబోతున్నట్టు, అలాగే.. తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ఇందులో శ్రీకాంత్ ఓ విలన్ గా నటిస్తున్నాడని కూడా వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన మరో వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
తాజా సమాచారం ప్రకారం RC 15 లో హ్యాండ్సమ్ యాక్టర్ అరవింద స్వామి మెయిన్ విలన్ గా నటిస్తున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. మణిరత్నం ‘దళపతి’ చిత్రంతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడు. ఆ తర్వాత జయం రవి ‘తనీ ఒరువన్’ చిత్రంతో విలన్ గా అలరించారు. అదే సినిమా తెలుగు వెర్షన్ ‘ధ్రువ’ లోనూ రామ్ చరణ్ విలన్ గా మెప్పించారు. ఇప్పుడు మరోసారి RC 15 లో విలన్ గా నటించనుండడం విశేషం. ఇందులో ఆయన పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశాడట శంకర్. రామ్ చరణ్ , అరవింద స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయట. మరి ఈ వార్తల్లో నిజానిజాలేంటో తెలియాలి.