ఏ పాత్రను అయినా అలవోకగా పోషించే బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ (Anupam Kher). భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్‌లో సినిమాలు చేస్తుంటాడు. వైవిధ్యభరిత పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. చివరగా ‘ద కశ్మీర్ ఫైల్స్’ (The Kashmir Files)లో కనిపించాడు. అనుపమ్ ఖేర్ తాజాగా హైదరాబాద్‌లోని యస్‌యస్. రాజమౌళి (SS Rajamouli) నివాసాన్ని సందర్శించాడు. ఈ విషయాన్ని అనుపమ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను అతడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి కామెంట్ చేశాడు.
అనుపమ్ ఖేర్ ఈ సందర్భంగా రాజమౌళిని శాలువాతో సత్కరించాడు. ‘‘ప్రియమైన రమా గారు, యస్‌యస్. రాజమౌళి. మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. మీ సొంత ఇంటిలో మీకు శాలువాతో స్వాగతం పలుకడం నాకు సంతోషంగా ఉంది. మీ వినయ, విధేయతలు నాకెంతో నచ్చాయి. మీ ఇద్దరి నుంచి ఎంతగానో నేర్చుకోవాలి’’ అని అనుపమ్ ఖేర్ పేర్కొన్నాడు. ఇక కెరీర్ విషయానికి వస్తే.. అనుపమ్ ఖేర్ ‘కార్తికేయ-2’ లో కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ఆగస్టు 13న విడుదల కానుంది. రవితేజ హీరోగా నటిస్తున్న ‘టైగర్ నాగేశ్వర రావ్’ (Tiger Nageswara Rao) లోను కనిపించనున్నాడు. స్టూవర్ట్ పురం గజదొంగ నాగేశ్వర రావు జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు