Anukoni Prayanam film review: సహజత్వానికి దూరంగా...

ABN , First Publish Date - 2022-10-28T22:20:48+05:30 IST

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) లీడ్ యాక్టర్ గా, క్యారక్టర్ నటుడిగా చాలా సినిమాలు చేసాడు. ఆసక్తికరం ఏంటి అంటే, ఇంకా అతను లీడ్ యాక్టర్ గా కూడా చేస్తున్నాడు. ఆలా చేసిన సినిమా ఈ 'అనుకోని ప్రయాణం'

Anukoni Prayanam film review: సహజత్వానికి దూరంగా...

సినిమా: అనుకోని ప్రయాణం 

నటీనటులు: రాజేంద్ర ప్రసాద్, నరసింహ రాజు, తులసి, ప్రేమ, నారాయణ రావు, అల్లరి రవి బాబు, ధనరాజ్ తదితరులు 

సంగీతం: ఎస్ శివ దినవాహి 

సినిమాటోగ్రఫీ: మల్లికార్జున్ నరగాని 

నిర్మాత: డా: జగన్ మోహన్ డి వై 

దర్శకత్వం: వెంకటేష్ పి 


సురేష్ కవిరాయని 


సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) లీడ్ యాక్టర్ గా, క్యారక్టర్ నటుడిగా  చాలా సినిమాలు చేసాడు. ఆసక్తికరం ఏంటి అంటే, ఇంకా అతను లీడ్ యాక్టర్ గా కూడా చేస్తున్నాడు. ఆలా చేసిన సినిమా ఈ 'అనుకోని ప్రయాణం' (Anukoni Prayanam film review). ఇందులో ఇంకో సీనియర్ నటుడు నరసింహ రాజు (Narasimha Raju) ఒక కీలక పాత్రలో కనపడతాడు. వెంకటేష్ పెదిరెడ్ల దీనికి దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. 


Anukoni Prayanam story: కథ 

రాజేంద్ర ప్రసాద్ మరియు నరసింహ రాజు భుబనేశ్వర్ పట్టణం లో రోజువారీ కూలీలు గా చేస్తుంటారు. ఇద్దరూ ఒకే రూమ్ లో ఉంటూ వుంటారు, నరసింహ రాజు కుటుంబం ఆంధ్రాలో ఉంటుంది, రాజేంద్ర ప్రసాద్ పెళ్లి చేసుకోడు. ఇద్దరూ కుటుంబం, సంసారం డబ్బులు టాపిక్ వచ్చినప్పుడు, రాజేంద్ర ప్రసాద్ సంతోషంగా తనకి ఎవరూ లేరు అందుకని తాను చాల సంతోషంగా వున్నాను అని చెపుతూ ఉంటాడు. నరసింహ రాజు మాత్రం తనకంటూ ఒకరు ఉండాలి, చనిపోయినపుడు ఆఖరి చూపు కోసం చాలామంది వచ్చి చూసి వెళతారు అని చెపుతూ ఉంటాడు. ఈలోపు కోవిడ్ రావటం, పని చేస్తున్న కూలీలు అందరిని ఎవరి స్వస్థానికి వాళ్ళని వెళ్లిపొమ్మని చెప్తారు. నరసింహ రాజు, రాజేంద్ర ప్రసాద్ ఇద్దరూ బయలుదేరుతుండగా నరసింహ రాజు చనిపోతాడు. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ అతని శవాన్ని వాళ్ళ సొంత వూరు తీసుకెళ్లే ప్రయత్నమే ఈ అనుకోని ప్రయాణం మిగతా కథ. 


విశ్లేషణ: 

దర్శకుడు వెంకటేష్ తీసుకున్న కథ చాల మంచిదే కానీ, అది వెండి తెర మీద చూపే విధానం అంత ఆసక్తికరంగా అనిపించలేదు. ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కి కుటుంబం, పెళ్లి, పిల్లలు ఈ గోల లేకుండా సంతోషంగా వున్నాను అనే భావం ఉంటే, అతని స్నేహితుడికి కుటుంబం, పిల్లలు, కొంత వయస్సు వచ్చాక మనిషికి తోడు కావాలి అనుకునే స్వభావం. ఈ కథ కొంచెం 'ఆ నలుగురు' సినిమాలో లాగా చివరికి వెళుతున్న కొద్దీ భావోద్వేగాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా అలాగే ఒంటరిగా వున్న రాజేంద్ర ప్రసాద్ చివరికి వెళ్లేసరికి తాను ఏమి కోల్పోయాడో తెలిసి భావోద్వేగానికి గురి కావాలి.  

దర్శకుడు ఇక్కడే పరమ పద సోపానం అని వైకుంఠపాళి ఆట ఇద్దరు ఆడుతూ వుంటారు. అందులో మధ్యలో పాములు మింగి కిందకి జారిపోతున్నా, మధ్యలో మళ్ళీ నిచ్చెనల ద్వారా వైకుంఠానికి ఎలా చేరతాము అన్నదే ఈ ఆట. అలాగే రాజేంద్ర ప్రసాద్ అతని స్నేహితుడి శవాన్ని తీసుకెళుతున్నప్పుడు మధ్యలో అవాంతరాలు ఎదురవుతున్న, ఒక మంచి ఉద్దేశంతో వెళుతున్నాడు కాబట్టి అతనికి చివరికి మంచే జరుగుతుంది, అందరి సాయం అందుతుంది  అన్నది ఒక పాయింట్. ఈ సినిమా కథ భావోద్వేగాలతో కూడుకున్నది. అయితే దీనికి కొంచెం సహజత్వంగా వుండేటట్టు దర్శకుడు ఇంకా కొంచెం శ్రద్ధ వహిస్తే, సినిమా ఇంకా చాల బాగా వచ్చేది. కానీ చాలా సన్నివేశాలు సినిమాటిక్ గా, అసహజంగా అనిపిస్తూ ఉండటం వలన సినిమా చాలా దెబ్బతింది. 

అసలు ఒక శవాన్ని ఎలా పడితే ఆలా తీసుకెళ్లచ్చా? అలాగే కొన్ని గంటల తరువాత శవం పాడయిపోతుంది కదా . ఇవేమి దృష్టిలో పెట్టుకోకుండా కొన్ని సన్నివేశాల్లో ఆ శవాన్ని పట్టుకొని దర్శకుడు కామెడీ చేసేసాడు. అలాగే రాజేంద్ర ప్రసాద్ రౌడీలను కొట్టే సన్నివేశం, ఇంకా శవాన్ని మోసుకుంటూ అన్ని మైళ్ళు వెళ్లే సన్నివేశాలు, ఇంకా ఇలాంటివి చాలా అసహజంగా వున్నాయి. అలాగే రవిబాబు పోలీస్ ఆఫీసర్ గా రాజేంద్ర ప్రసాద్ తో వచ్చే సన్నివేశాలు కూడా అంత బాగా రాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ మనిషి చనిపోయాడా, బతికున్నాడా అన్న విషయం ఈజీ గానే  పోల్చేస్తాడు, కానీ సినిమాలో ఆ విషయం అసలు పట్టించుకోలేదు. మళ్ళీ తరువాత అదే పోలీస్ ఆఫీసర్ స్నేహితుడి కోసం ఇంత పని చేస్తున్నావ్ కాబట్టి వదిలేస్తున్న అని అంటాడు. కోవిద్ అని పట్టణంలో ఎవరూ కనిపించరు కానీ రాజేంద్ర ప్రసాద్ మాత్రం శవాన్ని మోసుకొంటూ రోడ్ల మీద, బైక్ మీద తిరుగుతూ ఉంటాడు. ఎవరూ పట్టించుకోరు. ఏంటో మరి. దర్శకుడి ఆలోచన మంచిదే కానీ, ఇంకా కొంచెం దృష్టి పెట్టి ఉంటే ఈ సినిమా అద్భుతంగా వచ్చేది. 


ఇంకా నటీనటుల విషయానికి వస్తే, రాజేంద్ర ప్రసాద్ అద్భుత నటుడు అని నేను కితాబు ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే అతను ఆల్రెడీ నిరూపించుకున్నాడు, ఎన్నో మంచి సినిమాలు చేసాడు కూడా. ఇందులో కూడా చాలా బాగా చేసాడు, కానీ నేను అతని కెరీర్ లో ఇది బెస్ట్ అని మాత్రం చెప్పలేను, ఎందుకంటే దీనికన్నా 'ఆ నలుగురు' లో వేసిన పాత్ర బెస్ట్ అంటాను. 'అనుకోని ప్రయాణం' లో అతని రోల్ ఇంకా బాగా తీర్చి దిద్ది ఉంటే బాగుండేది. అలాగే నరసింహ రాజు రోల్ చాలా పెద్దది, కష్టం అయినది కూడా. ఎందుకు కష్టం అన్నాను అంటే, అతను రాజేంద్ర ప్రసాద్ తో సినిమా అంత కనపడతాడు, కానీ శవంలా కనపడాలి. ఆలా కనపడాలి అంటే చాల కష్టం, అది అతను చేసి చూపించాడు. ఇంకా నారాయణ రావు, తులసి, శుభలేఖ సుధాకర్ అందరూ సపోర్ట్ చేసారు. రవి బాబు పోలీస్ ఆఫీసర్ గా బాగా చేసాడు. ప్రేమ తళుక్కుమని చివర్లో మెరుస్తుంది. మాటలు ఇంకా పదునుగా హృదయానికి హత్తుకునేలా ఉంటే బాగుండేది. పాటలు, సంగీతం బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు. 

చివరగా 'అనుకోని ప్రయాణం' సినిమా కథ మంచిదే కానీ, దర్శకుడు ఇంకా బాగా దృష్టి పెట్టి చూపించివుంటే బాగుండేది. భావోద్వేగాలు వుండే కథని, మధ్యలో కొని సన్నివేశాలు కామెడీ గా తీసేసి ఎదో చేసాడు. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, రాజేంద్ర ప్రసాద్ నటన బాగుంది. 'అనుకోని ప్రయాణం' సహజత్వానికి దూరంగా వుంది. 

Updated Date - 2022-10-28T22:20:48+05:30 IST