Krishna Vrinda Vihari film review: ఈ సినిమా కూడా గోవిందా గోవిందా!

ABN , First Publish Date - 2022-09-23T19:12:27+05:30 IST

నాగశౌర్య (Naga Shaurya) మంచి నటుడే కానీ సక్సెస్ (Success) మాత్రం రావడం లేదు. 2017 లో చేసిన 'చలో' హిట్ తరువాత 'ఓ! బేబీ' (Oh! Baby) అన్న సినిమా సమంత (Samantha) వల్ల హిట్..

Krishna Vrinda Vihari film review:  ఈ సినిమా కూడా గోవిందా గోవిందా!

సినిమా: కృష్ణ వ్రింద విహారి

నటీనటులు: నాగ శౌర్య, షిర్లీ, రాధికా, జయ ప్రకాష్, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ తదితరులు 

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్ 

సంగీతం: మహతి సాగర్ 

నిర్మాత: ఉష మూల్పూరి 

కథ, మాటలు, దర్శకత్వం: అనీష్ ఆర్ కృష్ణ 


-సురేష్ కవిరాయని 


నాగశౌర్య (Naga Shaurya) మంచి నటుడే కానీ సక్సెస్ (Success) మాత్రం రావడం లేదు. 2017 లో చేసిన 'చలో' హిట్ తరువాత 'ఓ! బేబీ' (Oh! Baby) అన్న సినిమా సమంత (Samantha) వల్ల  హిట్ అయింది.  అంతే ఆ తరువాత చేసిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు.  ఇప్పుడు అతను 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari) అనే సినిమాతో వచ్చాడు.  దీనికి అనీష్ ఆర్ కృష్ణ (Anish R Krishna) దర్శకత్వం (director) వహించాడు. ఈ సినిమా నాగశౌర్య తల్లిదండ్రులే నిర్మించారు, షిర్లీ (Shirley) కథానాయిక. ఈ సినిమా అయినా నాగ శౌర్య కి విజయం ఇస్తుందో లేదో చూద్దాం. 



కథ:

కృష్ణ (నాగశౌర్య) ఒక సనాతన బ్రాహ్మణ కుటుంబం నుండి వచ్చి హైదరాబాదులో ఒక సాఫ్ట్ వెర్ కంపెనీలో ఉద్యోగంలో చేస్తాడు. అతని తల్లి (రాధికా) ఏమి చెప్పినా అయి తీరుతుందని ఆ కుటుంబం, ప్రజల నమ్మకం. అందుకని ఆమెకి అందరూ కొంచెం భయపడుతూ వుంటారు. కృష్ణ పని చేసే టీం లీడర్ వ్రింద (షిర్లీ). చూసిన మొదటిసారే కృష్ణ ఆమెని ప్రేమించేస్తాడు పెళ్లి కూడా చేసుకుంటా అంటదు. మరి కృష్ణ అమ్మ మడి తడి ఆచారం అంటూ ఉంటుంది కాబట్టి తన పెళ్లికి ఒప్పుకోదని కృష్ణకి తెలుసు. అందుకని కృష్ణ ఒక చిన్న అబద్ధం ఆడతాడు. క్రికెట్ బాల్ తనకి తగలరాని చోట తగిలిందని, దాని వల్ల పిల్లలు పుట్టరని అబద్ధం చెబుతాడు. అది నమ్మి ఇతనికి ఎవరు పిల్లని ఇవ్వం అంటారు. తల్లి ఇంకా చేసేదేమి లేక ఏ అమ్మాయి అయినా ఒకే అని చెప్తుంది. అదే సమయంలో తనని ఒక అమ్మాయి ప్రేమిస్తుందని పెళ్లి కూడా చేసుకుంటాను అంటుందని చెప్పి తను ప్రేమించిన వ్రింద ని పెళ్లి చేసుకుంటాడు.  అయితే పెళ్లికి ముందే వ్రింద తనకు ఓ సమస్య ఉందని చెప్తుంది, కానీ కృష్ణ అది తన తల్లిదండ్రులకు తెలియనివాడు. పెళ్లయిన కొన్ని నెలలకి వ్రింద ప్రేగ్నన్ట్ అని తెలుస్తుంది. కృష్ణ తల్లికి అనుమానం వస్తుంది. అసలు కథ ఇక్కడ నుండి మొదలవుతుంది. కృష్ణ, వ్రింద విడిపోయారా, కలిసి వున్నారా, కృష్ణ  స్పందించారు, చివరికి ఆ సమస్యలన్నీ ఎలా తీరాయి అన్నదే మిగతా కథ. 


ఇక నటీనటుల విషయానికి వస్తే నాగశౌర్య కొంతవరకు పరవాలేదు అనిపించాడు కానీ బ్రాహ్మణ అబ్బాయిగా అయితే మాత్రం ఒప్పించలేకపోయాడు. కథానాయికగా షిర్లీ పెద్దగా అనిపించలేదు. ఆ పాత్రకి ఆమె సరిపోలేదు అనిపిస్తుంది. నాగ శౌర్య తల్లిగా రాధిక (Radhika Sarath Kumar) చేసింది, ఆమెకి కూడా ఆ బ్రాహ్మణ పాత్ర సూట్ కాలేదు.  అన్నపూర్ణ మధ్య మధ్య లో చిరాకు తెప్పిస్తుంది. వెన్నెల కిశోర్ (Vennela Kishore) మరియు బ్రహ్మాజీ (Brahmaji) లు మధ్య మధ్యలో నవ్వించి సినిమాకి ఒక రిలీఫ్ లాగా వుంటారు. కథలో దమ్ము లేనప్పుడు క్యారెక్టర్స్ ఎవరు చేసిన నడవదు. ఈ సినిమాకి సంగీతం ఇంకో పెద్ద మైనస్.  పాటలు అంతగా బాగోలేవు, బయటికి వచ్చిన తర్వాత మరిచిపోతాం. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అంతంత మాత్రమే.  సాంకేతికంగా సినిమాటోగ్రఫీ పరవాలేదు. మాటలు మామూలుగా వున్నాయి. 

చివరగా 'కృష్ణ వ్రింద విహారి' సినిమా నాగశౌర్య ప్లాపులు జాబితాలో మరొక సినిమాగా చేరింది.  నాగశౌర్య ఈ సినిమా కోసం చేసిన పాదయాత్ర పాపం వృధా ప్రయాస అయింది. నాని ట్రై చేసి సక్సెస్ కాలేకపోయాడు ఇప్పుడు నాగ షూర్య కూడా అదే సినిమాని ట్రై చేసి బోర్లా పడ్డాడు. కంటెంట్ లేక ఇంకో సినిమా గోవిందా గోవిందా! తొందరగానే ఓటిటి లో  వచ్చేస్తుంది, వెయిట్ చెయ్యండి. 


విశ్లేషణ:

పైన కథ చదువుతుంటే ఈ కథ ఎక్కడో విన్నట్టు మనందరికీ అనిపిస్తోంది కదా! మరి ఈ కృష్ణ వ్రింద విహారి దర్శకుడు అనిష్‌కు ఎందుకు ఆలా అనిపించట్లేదు అన్నది అర్థం  కావటం లేదు. నాని ఇంతకు ముందు చేసిన 'అంటే సుందరానికి' (Ante Sundaraniki) సినిమాకి ఈ 'కృష్ణ వ్రింద విహారి' సినిమాకి, ఒక్క టైటిలు, నటీనటులు తప్ప మిగతా అంత ఒకటే. అదే సినిమాని మళ్ళీ వేరే నటులతో పెద్ద గ్యాప్ లేకుండా విడుదల చేస్తే ఎవరు చూస్తారు. అదీ కాకుండా అందులో ఇంకా చెప్పుకోవటానికి ఏముంటుంది. పోనీ ఈ కృష్ణ వ్రింద  విహారి లో ఏమైనా ఆసక్తికరంగా చెప్పాడా అంటే అదీ లేదు. మన తెలుగు సినిమాల్లో చాలామందికి పట్టుకున్న జాడ్యం ఏంటి అంటే ఎదో సనాతన బ్రాహ్మణా కుటుంబం అని చూపించటం. అక్కడక్క తెచ్చి పెట్టుకున్నట్టుగా బ్రాహ్మిన్స్ ఇలా మాట్లాడతారు అని ఒకటి రెండు డైలాగ్స్  పెడతారు,కానీ ఒక్క దర్శకుడికి కూడా బ్రాహ్మణ కుటుంబం లో ఎలా మాట్లాడతారు, వాళ్ళ నడవడిక ఎలా ఉంటుంది అన్నది తెలీదు. ఎదో పంచె, జంధ్యం చూపిస్తే అయిపోతుంది అనుకుంటారు. హోమ్ వర్క్ అస్సలు చెయ్యరు. మన దౌర్భాగ్యం అంతే. ఇందులో కూడా అలానే చూపెట్టేసారు. ఊరికె  బ్రాహ్మణ కుటుంబం అంటారు కానీ, ఒక సీన్ అయిపోయాక అన్నీ మామూలే. ఇంకా నాని 'అంటే సుందరానికి' సినిమాలో బ్రాహ్మణ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయి,  ఈ 'కృష్ణ వ్రింద విహారి'లో బ్రాహ్మణ అబ్బాయి నార్త్ ఇండియన్ అమ్మాయి.  చిన్న తేడా మిగతా అంత సేమ్ టు సేమ్. 

ఫస్టాఫ్ అంతా దర్శకుడు సోది చెప్తాడు, కథ ఏమి లేదు. చాలా మట్టుకు సాగదీసాడు. సెకండాఫ్ లో కూడా వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ  కామెడీ సీన్ తప్పితే చెప్పుకోవడానికి ఏం పెద్దగా లేవు. అంటే సుందరానికి చేసిన సినిమాలో చేసిన తప్పులే ఈ సినిమాలో కూడా చేశారు.  ఆ సినిమా ఎందుకు ఆడలేదు అని చూసి ఇందులో ఆ తప్పులు చేయకుండా ఉంటే నడిచేదేమో కానీ అలా చేయలేదు. అంటే ఇద్దరూ ఒకే కొరియన్ సినిమాని కాపీ చేశారేమో. అది ముందు విడుదల అయింది, ఇది తరువాత విడుదల అయింది. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అన్ని అనీష్ కృష్ణ చేసాడు. ఇవన్నీ ఆయనే కాబట్టి సినిమా ప్లాప్ కి అతనిదే బాధ్యత.  

Updated Date - 2022-09-23T19:12:27+05:30 IST