అన్నయ్య సినిమా తీశాడంటే హిట్టే
ABN , First Publish Date - 2022-04-04T06:33:24+05:30 IST
‘‘మా అన్నయ్య బాబీ నిర్మాతగా చేసిన తొలి చిత్రం ‘గని’ త్వరలో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది...

‘‘మా అన్నయ్య బాబీ నిర్మాతగా చేసిన తొలి చిత్రం ‘గని’ త్వరలో రిలీజ్ అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సినీరంగంలో ఆయనకి 20 ఏళ్ల అనుభవం ఉంది. అన్నయ్య జడ్జిమెంట్ ఎప్పుడూ తప్పలేదు. తను ఒక కథ ఎంపిక చేసి సినిమా తీశాడంటే అది హిట్టై తీరుతుంది’ అని అల్లు అర్జున్ అన్నారు. వరుణ్‌తేజ్, సాయి మంజ్రేకర్ జంటగా నటించిన చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు బాబీ, సిద్దు ముద్ద నిర్మాతలు. ఈ నెల 8న విడుదలవుతోంది. ఇటీవలె వైజాగ్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు అల్లు అర్జున్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వరుణ్ తేజ్ ఎంచుకునే కథలు అంటే నాకు చాలా ఇష్టం. ‘గని’ సినిమా కోసం తను ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అందుకే దర ్శకుడు కిరణ్‌కు ముందే శుభాకాంక్షలు చెబుతున్నాను’అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘‘తమ్ముడు’ సినిమా స్ఫూర్తితో క్రీడా నేపథ్యంలో ‘గని’ చిత్రం చేశాం. మూడేళ్లు కష్టపడ్డాం. కిరణ్‌ను దర్శకుడిగా తీసుకోవాలనే నా నిర్ణయం సరైందని తను నిరూపించాడు. చరణ్ అన్న పంపిన ట్రైనర్ పర్యవేక్షణలో బాక్సింగ్, సిక్స్‌ప్యాక్ చేశాను. అల్లు బాబి, సిద్దు ముద్ద ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను నిర్మించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుందని నమ్ముతున్నాను’ అన్నారు. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘కరోనా వల్ల ఈ సినిమా నిర్మాణంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నారు. బడ్జెట్ కూడా ఎక్కువైంది. ఈ సినిమా అనుకున్నవిధంగా పూర్తవడానికి కారణం వరుణ్‌తేజ్. తనతో ‘కేజీఎఫ్’ లాంటి భారీ చిత్రం చేస్తాను. అల్లు పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేసిన అల్లు అర్జున్‌ను సభాముఖంగా అభినందిస్తున్నాను’ అని తెలిపారు. అల్లు బాబీ మాట్లాడుతూ ‘చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాను గొప్పగా తీశాం. రిలీజయ్యాక సినిమా గురించి మరింత మాట్లాడతాను’ అన్నారు. సిద్దు ముద్ద మాట్లాడుతూ ‘వరుణ్‌తేజ్ సినిమాకు సంబంధించిన ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నారు. అల్లు అర్జున్ సలహాలిచ్చారు’ అని చెప్పారు. కిరణ్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నా మూడేళ్ల కల. ‘గని’ కచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. పవన్ కల్యాణ్ గారికి ‘తమ్ముడు’ సినిమాలా వరుణ్‌తేజ్‌కు ‘గని’ మైలురాయిగా నిలిచిపోతుంద’న్నారు. దర్శకుడు హరీష్‌శంకర్ మాట్లాడుతూ ‘అల్లు బాబి, సిద్దు కలిసి ‘గని’ సినిమాను అద్భుతంగా నిర్మించారు’ అన్నారు. ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ సాయి మంజ్రేకర్ కృతజ్ఞతలు తెలిపారు.