సినిమా రివ్యూ: అనుభవించు రాజా

ABN , First Publish Date - 2021-11-26T20:07:18+05:30 IST

కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తు్న్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. తాజాగా తనకి బాగా అచ్చివచ్చిన కామెడీ జోనర్ లోనే డిఫరెంట్ కథాంశంతో ‘అనుభవించు రాజా’ సినిమాతో ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుంది? రాజ్ తరుణ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ దక్కించుకొనే అవకాశం ఏమేరకు ఉంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం..

సినిమా రివ్యూ: అనుభవించు రాజా

చిత్రం: అనుభవించు రాజా

విడుదల తేదీ: 26 నవంబర్, 2021

నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, ఆడుకళాం నరేన్, పోసాని కృష్ణమురళి, అజయ్, రవికృష్ణ, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, అరియనా తదితరులు

సంగీతం: గోపీ సుందర్

ఎడిటర్: ఛోటా కె ప్రసాద్

సినిమాటోగ్రాఫర్: నగేశ్ బనేల్ 

నిర్మాణం: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీవెంకటేశ్వరా సినిమాస్ ఎల్లెల్పీ  

కథ, స్ర్కీన్‌ప్లే , దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి


కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో రాజ్ తరుణ్.. తాజాగా తనకి బాగా అచ్చివచ్చిన కామెడీ జోనర్ లోనే డిఫరెంట్ కథాంశంతో ‘అనుభవించు రాజా’ సినిమాతో ఈ రోజే (శుక్రవారం) థియేటర్స్ లోకి వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులకు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుంది? రాజ్ తరుణ్ ఈ సినిమాతో సాలిడ్ హిట్ దక్కించుకొనే అవకాశం ఏమేరకు ఉంది?  అనే విషయాలు రివ్యూలో చూద్దాం.. 


కథ

యండగండి గ్రామంలో బంగారం(రాజ్ తరుణ్ ) తాత పెద్ద ధనవంతుడు. పైసా పైసా కూడబెట్టి..  ఆ ఊరికే పెద్ద కోటీశ్వరుడు అవుతాడు.  ఒక రోజు  బంగారం తాత, తల్లిదండ్రులు యాక్సిడెంట్ కు గురవుతారు. తల్లిదండ్రులు చనిపోతారు.  తాత చనిపోయే ముందు తన మనవడ్ని పిలిచి.. తనకి ఇన్నాళ్లూ డబ్బులు కూడబెట్టడమే సరిపోయింది. కానీ దాన్ని అనుభవించలేకపోయాను. నువ్వైనా దర్జాగా ఈ ఆస్తినంతటినీ అనుభవించరా అని చెప్పి కనుమూస్తాడు. బంగారం పెరిగి పెద్దవాడవుతాడు. కానీ అనూహ్యంగా అతడు జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్ లో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా జాయిన్ అవుతాడు. అంతటి కోటీశ్వరుడైన బంగారం అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు? యండగండి గ్రామంలో దర్జాగా బతకాల్సిన వాడు  హైదరాబాబ్ కు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది?  దానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అనేది మిగతా కథ. 


విశ్లేషణ  

సాధారణంగా గ్రామీణ నేపథ్యంలోని కథాంశాలు ఎక్కువగా స్ట్రైట్ నెరేషన్ తోనే ఉంటాయి. అయితే ‘అనుభవించు రాజా’ సినిమా విషయంలో మాత్రం దర్శకుడు శ్రీను గవిరెడ్డి కొత్తగా ఆలోచించారు. దీనికి డిఫరెంట్ స్ర్కీన్ ప్లే టచ్ ఇచ్చారు. దాంతో ఈ సినిమా ఫ్లేవరే మారిపోయింది. టైటిల్స్ కు ముందు హీరోని ఒక గ్రామంలో  కోటీశ్వరుడి వారసుడిగా  ఎస్లాబ్లిష్ చేసి.. పెరిగి పెద్దవాడవగానే.. ఒక జైల్లో ఇంట్రడ్యూస్ చేశారు. అసలు యండగండిలో దర్జాగా తాత ఇచ్చిన ఆస్తిని అనుభవించకుండా.. హీరో జైలుకు ఎందుకు  వెళ్ళాడు? అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. అలాగే.. అంత డబ్బున్నవాడు ఒక సిటీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయాల్సిన అవసరం ఏంటి? అసలు టైటిల్ కి, అతడి ప్రొఫెషన్ కీ సంబంధం ఏంటి.. అనే ఆలోచన మరోవైపు కలుగుతుంది. అదే ఈ సినిమా ప్రత్యేకత. హీరో ఏదో ఒక లక్ష్యం తోనే సిటీలోకి అడుగుపెట్టినట్టు అర్ధమవుతుంది. ఇంతకీ అతడి ఎయిమ్ ఏంటి? అనుకొనే లోపు ఒక ట్విస్ట్ తో ఇంట్రవెల్ పడుతుంది. సెకండాఫ్ మీద మరింత ఆసక్తి రేకెత్తుతుంది. 


సెకండాఫ్ ను యండగండి గ్రామంలో ఓపెన్ చేసి.. ఫ్లాష్ బ్యాక్ ను రివీల్ చేస్తారు. రాజ్ తరుణ్ అసలు కేరక్టరైజేషన్ ను అప్పుడు ఓపెన్ అవుతుంది. కోడిపందాలు ఎలా జరుగుతాయి? ఎంతెంత పందాలు కాస్తారు? పందాలకు తమ కోడిపుంజుల్ని ఎలా రెడీ చేస్తారు? అనే విషయాల్ని కొంచెం డీటెయిల్డ్ గా చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. అలాగే.. గ్రామాల్లో ప్రెసిడెంట్ స్థానానికి ఎంతటి క్రేజ్ ఉంటుంది? అనే విషయాన్ని కూడా దర్శకుడు ఆసక్తికరంగా చెప్పడానికి ప్రయత్నించారు. మొత్తానికి కథని పక్కదారి పట్టించకుండా.. సినిమాని నడిపించాడు దర్శకుడు శ్రీను గవిరెడ్డి. 

బంగారంగా రాజ్ తరుణ్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్‌తో మెప్పిస్తాడు. ఇదివరకటి స్థాయిలో, అంతటి మోతాదులో గోదావరి యాసను పలికించకుండా.. అవసరానికి తగ్గట్టే డైలాగ్స్ పలుకుతూ ఆకట్టుకున్నాడు. ఫస్టాఫ్ అంతా.. సిటీ వాతావరణంలో మంచి కామెడీ టైమింగ్ తో మెప్పించిన ఆయన సెకండాఫ్ లో చక్కటి ఎమోషన్స్ ను పలికించారు. ఇక కథానాయికగా కొత్తమ్మాయి కశిష్ ఖాన్ తన గ్లామర్ తో మెప్పిస్తుంది. ఆమె స్నేహితురాలిగా నటించిన అమ్మాయి కూడా బాగా చేసింది. ఇక కమెడియన్ గా సుదర్శన్ ఆకట్టుకుంటాడు. ప్రెసిడెంట్ గా ఆడుకళాం నరేన్, మరో ముఖ్యపాత్రలో బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణ మెప్పించారు. ఇంకా బిగ్ బాస్ ఫేమ్ అరియానా కూడా ఒకటి రెండు సీన్స్ లో మెరిసింది. ఇంకా రాజమౌళితో పాటు మరికొందరు జబర్దస్త్ కమెడియన్స్ కూడా ఆకట్టుకున్నారు.  ఇక క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది. గోపీసుందర్ సంగీతం, నగేశ్ బనేల్ కెమేరా మెప్పిస్తాయి. చక్కటి నిర్మాణ విలువలతో ఈ సినిమాను నిర్మించారు మేకర్స్. మొత్తానికి రాజ్ తరుణ్ ఇదివరకటిలాగానే రొటీన్ కామెడీతో కాకుండా.. డిఫరెంట్ గా ప్రేక్షకుల్ని నవ్వించడానికి ప్రయత్నించడం అభినందించదగ్గ విషయమే. 

ట్యాగ్ లైన్: కొత్తగా ఉంది రాజా 

Updated Date - 2021-11-26T20:07:18+05:30 IST