‘అంధ‌కారం’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2020-11-24T23:40:46+05:30 IST

ఓటీటీల‌కు ప్రాధాన్య‌త పెరుగుతున్న నేప‌థ్యంలో కొత్త త‌రం ద‌ర్శ‌కులు థ్రిల్ల‌ర్‌, క్రైమ్, నెటివిటీకి ద‌గ్గ‌ర ఉన్న కాన్సెప్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

‘అంధ‌కారం’ మూవీ రివ్యూ

చిత్రం:  అంధ‌కారం

విడుద‌ల‌:  నెట్‌ఫ్లిక్స్‌

స‌మ‌ర్ప‌ణ‌: అట్లీ

బ్యాన‌ర్స్‌: ఏ ఫ‌ర్ యాపిల్‌, ప్యాస‌న్ స్టూడియోస్‌, ఓ 2 పిక్చ‌ర్స్‌

నటీన‌టులు:  అరుణ్‌దాస్, వినోద్ కిష‌న్‌, పూజా రామ‌చంద్ర‌న్ త‌దిత‌రులు

ర‌చ‌న, ద‌ర్శ‌క‌త్వం:  వి.విఘ్న‌రాజ‌న్

నిర్మాత‌లు:  ప్రియా అట్లీ, సుధ‌న్ సుంద‌రం, జ‌య‌రాం, కె.పూర్ణ చంద్ర‌

సంగీతం: ప‌్రదీప్ కుమార్

సినిమాటోగ్ర‌ఫీ: ఎ.ఎం.ఎడ్విన్ సాకే


ఓటీటీల‌కు ప్రాధాన్య‌త పెరుగుతున్న నేప‌థ్యంలో కొత్త త‌రం ద‌ర్శ‌కులు థ్రిల్ల‌ర్‌, క్రైమ్, నెటివిటీకి ద‌గ్గ‌ర ఉన్న కాన్సెప్ట్‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి కాన్సెప్టుల‌తోనే డెబ్యూ డైరెక్ట‌ర్స్ సినిమాలు కూడా రూపొందిస్తున్నారు. కోవిడ్ కార‌ణంగా డిజిట‌ల్ మాధ్య‌మాల‌కు ఆద‌ర‌ణ పెరుగుతున్న నేప‌థ్యంలో సినిమాలు కూడా స్ట్ర‌యిట్ రిలీజ్‌లు అవుతున్నాయి. అలా డిజిట‌ల్‌లో విడుద‌లైన స్ట్ర‌యిట్ మూవీ ‘అంధకారం’. డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో, డెబ్యూ డైరెక్టర్ విఘ్నరాజన్ తెరకెక్కించిన అంధకారం సినిమా ట్రైలర్ సినిమా ఎలా ఉండబోతుందోనని ఆస‌క్తిని అంద‌రిలోనూ క‌లిగించింది. మ‌రి సినిమా ప్రేక్ష‌కుల‌ను ఎలా మెప్పించింది?  అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం...


క‌థ‌:

క్రికెట్ శిక్ష‌ణ ఇప్పించే వినోద్‌(అరుణ్‌దాస్‌), క‌ళ్లు లేకున్నా కూడా లైబ్ర‌రీలో క్ల‌ర్క్‌గా ప‌నిచేసే సూర్యం(వినోద్ కిష‌న్‌), సైక్రియాటిస్ట్ ఇంద్ర‌న్ ఒకే న‌గ‌రంలో నివ‌సిస్తుంటారు. సైక్రియాటిస్ట్ ఇంద్ర‌న్‌పై ఓ వ్య‌క్తి తుపాకీతో కాల్పులు జ‌రుపుతాడు. వినోద్‌ను ఎవ‌రో ఒక‌రు ఫోన్‌లో బెదిరిస్తుంటారు. సూర్యంను ఆస్థి కోసం కొంద‌రు హ‌త్య చేస్తారు. అస‌లు వీరి ముగ్గురికీ ఇలా జ‌ర‌గ‌డానికి కార‌ణ‌మెవ‌రు?  వీరి ముగ్గురికీ సంబంధం ఏంటి?  అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..


స‌మీక్ష‌:

మూడు నాలుగు పాత్ర‌ల‌కు సంబంధించిన విష‌యాల‌ను క‌థ‌లో భాగంగా ర‌న్ చేస్తూ వాటికి సంబంధించిన ఓ పాయింట్‌ను చివ‌ర‌ల్లో మిక్స్ చేస్తూ చూపించ‌డం అనే విష‌యాన్ని మనం చాలా సినిమాల్లో చూశాం. అలాంటి ఓ కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు విఘ్న‌రాజ‌న్ రూపొందించిన చిత్రం ‘అంధకారం’. ఈ సినిమాలో ఓ సైక్రియాటిస్ట్, ఇద్దరు యువకుల పాత్రలను తీసుకుని వారికి సంబంధించిన కథలను రన్ చేస్తూ వారి జీవితాల్లో ఏం జ‌రిగింది? అనే విష‌యాన్ని చూపించాడు. అయితే సినిమా ప్రారంభ స‌న్నివేశం నుండి సినిమా ముగిసే చివ‌రి ప‌ది నిమిషాల ముందు వ‌ర‌కు ఈ మూడు పాత్ర‌ల‌కు సంబంధించిన సీక్రెట్స్‌ను ద‌ర్శ‌కుడు మెయిన్‌టెయిన్ చేస్తూ వ‌చ్చాడు. ఇది బాగానే ఉన్నా కూడా పాత్ర‌ల‌ను, స‌న్నివేశాల‌ను తీర్చిదిద్దిన విధానం క‌న్‌ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది. అస‌లు తొలి అర‌గంట‌ సినిమాలో ఏం జ‌రుగుతుందో ప్రేక్ష‌కుడికి అర్థం కాదు. ఇలాంటి స్క్రీన్‌ప్లేతో సినిమాను ర‌న్ చేస్తే సామాన్య ప్రేక్ష‌కుడికి సినిమా ఏం అర్థ‌మ‌వుతుందో చెప్ప‌డం క‌ష్ట‌మే. మూడు పాత్ర‌ల‌ను తీసుకుని వాటి మ‌ధ్య ఉన్న రిలేష‌న్‌ను లింక్ చేస్తూ వెళ్లిన తీరు ఈ క‌న్‌ఫ్యూజ‌న్‌కు కార‌ణ‌మవుతుంది. ఎందుకంటే లింక్ చేసిన తీరు అలా ఉంది. సినిమాలో నేప‌థ్య సంగీతం బావుంది. అలాగే సినిమాటోగ్ర‌ఫీ కూడా బావుంది. నిర్మాణ విలువ‌లు బావున్నాయి. ఇక న‌టీన‌టుల విష‌యానికి వ‌స్తే అరుణ్ దాస్‌, వినోద్ కిష‌న్‌, పూజా రామ‌చంద్ర‌న్ త‌దిత‌రులు వారి వారి పాత్ర‌ల‌కు చ‌క్క‌గా న్యాయం చేశారు. ఆత్మ‌లు ఉన్నాయా?  లేదా?  అనే అంశాలున్న సినిమాల‌ను చూడాల‌నుకునే ప్రేక్ష‌కుల‌కు ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. 


చివ‌ర‌గా.. అంధ‌కారం.. థ్రిల్ల‌ర్ జోన‌ర్ ప్రేక్ష‌కుల‌కు మాత్ర‌మే 

రేటింగ్‌: 2.25/5

Updated Date - 2020-11-24T23:40:46+05:30 IST