యాంకర్‌గా అనసూయ (Anasuya) టాలెంట్ అందరికీ తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్ళ క్రితం ప్రారంభమైన ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షోకి అనసూయ ఆభరణమై నిలిచింది. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆషోలో ఆమె చేసే యాంకరింగ్ వీక్షకుల్ని విపరీతంగా ఆకర్షించింది. ముఖ్యంగా షో ప్రారంభంలో ఆమె చేసే డ్యాన్స్ కు, ఆమె ధరించే దుస్తులకు ఫిదా అయిన వారు చాలా మంది ఉన్నారు. మధ్యమధ్యలో హైపర్ ఆది (Hyper Adi) లాంటి వారి టీమ్‌లో పాత్రధారిగానూ ఆమె మెరుస్తూ ప్రేక్షకుల్ని మైమరిపిస్తూంటుంది. హైయస్ట్ టీర్పీ సాధించడమే కాకుండా.. యూ ట్యూబ్ లో సైతం విపరీతమైన ఆదరణ దక్కించుకుంది జబర్దస్త్ షో. ఒక రకంగా చెప్పాలంటే.. ఈ షో వల్ల టీవీ ప్రసారం వల్ల వచ్చే ఆదాయం కన్నా.. యూట్యూబ్ ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువ.
రాను రాను బజర్దస్త్ షోకు ఆదరణ కరువవుతోంది. ఇప్పటికే జడ్జెస్ నాగబాబు (Nagababu), రోజా (Roja), హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), గెటప్ శ్రీను (Getup Srinu) లాంటి వారు కూడా తప్పుకోవడంతో.. జబర్దస్త్ కళ తప్పుతోందని అర్ధమవుతోంది. ఇప్పటి వరకూ వీరెవరూ కనిపించకపోయినా.. యాంకర్ గా అనసూయ కనిపిస్తుండడంతో .. కాస్తైనా జనం అడ్జెస్ట్ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ షో నుంచి అనసూయ కూడా తప్పుకోనుండడం ప్రేక్షకులకు షాకింగ్ గా మారింది. ప్రస్తుతం అనసూయకి సినిమా ఆఫర్స్ భారీగా వస్తూండడం వల్లే షోనుంచి తప్పుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని అనసూయ ఇన్ డైరెక్ట్ గా సోషల్ మీడియాలో తెలిపింది.
‘నా జీవితంలో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నాను. దాన్ని ఈ రోజు నుంచే అమలు చేస్తున్నాను. నాతో ఎన్నో జ్ఞాపకాల్ని తీసుకెళ్తున్నాను. అందులో ఎక్కువ మంచి జ్ఞాపకాలే ఉన్నాయి. కొన్ని చెడ్డవి కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మీ ఆదరణ నాకు ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఈ పోస్ట్ ఖచ్చితంగా జబర్దస్త్ గురించే అయి ఉంటుందని అందరూ అనుకుంటున్నారు.ఒక వేళ అనసూయ జబర్దస్త్ నుంచి తప్పుకుంటే.. ఆమె ప్లేస్ లో ఏ యాంకర్ ను దింపుతారనేది ఆసక్తిగా మారింది. మరి అనసూయ లేని జబర్దస్త్ ఎలా ఉంటుందో చూడాలి.