ఆ నమ్మకం... గౌరవమే పెద్ద ప్రశంస -అనన్య

‘30 వెడ్స్‌ 21’... యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్న కొత్త వెబ్‌ సిరీస్‌. ఓ 21 ఏళ్ల అమ్మాయిని 30 ఏళ్ల యువకుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఏమైందనేది కథాంశం. ఇందులో మేఘనగా వీక్షకుల మనసు దోచేస్తున్న తెలుగమ్మాయి అనన్య. చెన్నైలోని వీఐటీ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నారు. ఇప్పుడు సెకండ్‌ సెమిస్టర్‌లో ఉన్నారు. తన గురించి, చదువు, నటన గురించి ‘చిత్రజ్యోతి’తో అనన్య చెప్పిన విశేషాలివీ...


‘‘నేను పుట్టింది వరంగల్‌లో.! బాల్యంలో ఆరేళ్లు కరీంనగర్‌లో ఉన్నాను. ఆ తర్వాత ఇంటర్‌కు హైదరాబాద్‌ వచ్చాను. మా అమ్మ పేరు ప్రగతి. నాన్న రమేశ్‌. ఇద్దరూ లెక్చరర్లే. ఇప్పుడు తెలంగాణ సంక్షేమ కళాశాలలో పాఠాలు చెబుతున్నారు. అమ్మ బయాలజీ ఫ్యాకల్టీ, నాన్న కెమిస్ట్రీ లెక్చరర్‌. నాకు పదమూడేళ్లు ఉన్నప్పుడు నటనపై ఇష్టం, ప్రేమ కలిగాయి. క్రమక్రమంగా నటి కావాలనే ఆసక్తి పెరిగింది. కానీ, పూర్తిస్థాయిలో కెరీర్‌గా ఎంచుకోవడానికి ఐదేళ్లు పట్టింది. నటిగా ప్రయాణం ప్రారంభించే సమయానికి నాకు 18ఏళ్లు. ఇంట్లో నటనను కెరీర్‌గా ఎంచుకోవాలని అనుకుంటున్నట్టు చెప్పినప్పుడు అమ్మానాన్న నాకు మద్దతుగా నిలిచారు. ‘జాగ్రత్తగా ఉండు. నువ్వు హ్యాపీ అయితే.. మాకు హ్యాపీనే’ అన్నారు.


కాలేజీలో ఉన్నప్పుడు సరదాగా కొన్ని లఘు చిత్రాలు చేశా. స్నేహితులతో కలిసి నటించా. అయితే, ఎక్కువేం చేయలేదు. గత ఏడాది కరోనా కారణంగా చెన్నై నుంచి హైదరాబాద్‌ వచ్చాను. అప్పట్నుంచీ ఫ్రొఫెషనల్‌గా స్టార్ట్‌ చేశా. లాక్‌డౌన్‌ వల్ల నాకు మంచే జరిగింది. నేనిక్కడ, హైదరాబాద్‌లో ఉండటంతో ఆడిషన్స్‌కు వెళుతూ, అవకాశాల కోసం ప్రయత్నాలు చేశా. నేను నటించిన ‘బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ టేల్స్‌’ నాకు మంచి పేరు తీసుకొచ్చింది. ‘ఛాయ్‌ బిస్కట్‌’కు చెందిన ‘బాయ్‌ ఫార్ములా’ యూట్యూబ్‌ ఛానల్‌లో విడుదలైంది. ‘గాళ్‌ ఫార్ములా’ యూట్యూబ్‌ ఛానల్‌లో ‘జాతిరత్నాలు అమ్మాయిలు అయితే’, ‘ఫ్లాట్‌మేట్‌ - ఎవ్రీ రూమ్మేట్‌ ఎవర్‌’, ‘కరోనా ఫైనల్‌ ఇయర్‌ బ్యాచ్‌’ - ఇలా ఇంకొన్ని చేశా. అయితే... ‘30 వెడ్స్‌ 21’ ఎక్కువ పేరు తీసుకొచ్చింది. ఇప్పటి వరకూ విడుదలైనవి మూడు ఎపిసోడ్లే అయినా... ఎంతో పేరొచ్చింది.


ఈ సిరీస్‌ కోసం ముందు ఆడిషన్‌ తీసుకున్నారు. అప్పటికి నాకు కథ తెలియదు. మేఘన పాత్ర కోసం ఆడిషన్‌ చేస్తున్నారనీ తెలియదు. టైటిల్‌ విని, 21 ఏళ్ల అమ్మాయిని బలవంతంగా 31 ఏళ్ల వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే... అమ్మాయి జీవితం ఎలా మారుతుందో చూపిస్తారని అనుకున్నా. ‘రొటీనే కదా’ అనిపించింది. మేఘన పాత్రకు ఎంపిక చేశాక కథ చెప్పారు. ‘అమ్మాయిది కాదు... అబ్బాయి జర్నీ చూపిస్తున్నారు’ అని అప్పుడు అర్థమైంది. చాలా కొత్తగా, ఎవరూ చూపించని కథాంశం అనిపించింది.


‘30 వెడ్స్‌ 21’ చిత్రీకరణ కరోనా ఫస్ట్‌ వేవ్‌, సెంకడ్‌ వేవ్‌ మధ్యలో జరిగింది. అప్పుడు కరోనా కేసులు ఎక్కువ లేవు. అయినా... సెట్‌లో నటీనటులు మినహా మిగతా బృందమంతా మాస్క్‌లు ధరించే ఉండేవారు. ఎవరి మంచినీళ్ల బాటిళ్లు వాళ్లు తెచ్చుకోవడం, ఎంత వీలైతే అంత దూరం పాటిస్తూ... చిత్రీకరణ పూర్తి చేశాం. మావరకూ మేం సేఫ్‌గా ఉండి పని చేశాం. లాక్‌డౌన్‌ వల్ల ఆన్‌లైన్‌ క్లాసులు జరిగాయి. వ్యక్తిగతంగా నాకు అది హెల్ప్‌ అయ్యింది. అందువల్లే, సిరీస్‌ చేయగలిగా. క్లాస్‌ ఉంటే... షూటింగ్‌లో పక్కకు వెళ్లి వినేదాన్ని. పరీక్షలు ఉంటే... రెండు రోజుల ముందే చిత్రీకరణకు రాలేనని చెప్పేదాన్ని. ఆ విధంగా, చదువు-షూటింగ్‌ బ్యాలెన్స్‌ చేసుకున్నా.


మా కుటుంబంలో అందరికీ ఈ వెబ్‌ సిరీస్‌ నచ్చింది. యాక్చువల్లీ... కుటుంబంతో కలిసి కూర్చుని చూసే సిరీస్‌ కాబట్టి! అందరూ అదే మాట చెబుతున్నారు. చాలామంది ‘మా తల్లితండ్రులకు ఈ సిరీస్‌ చూడమని చెప్పాం’ అని చెబుతుంటే... మా అమ్మానాన్నలకు సిరీస్‌ బావుందని చాలామంది చెబుతుంటే... గర్వంగా, సంతోషంగా ఉంది. ఆ నమ్మకం, గౌరవం పెద్ద ప్రశంస.


‘30 వెడ్స్‌ 21’లో మేఘనకు, నిజ జీవితంలో అనన్యకు చాలా వ్యత్యాసం ఉంది. ఒకవేళ నిజజీవితంలో మేఘన వంటి అమ్మాయి కలిస్తే స్నేహితులుగా కూడా ఉండమేమో!? ఒకే ఒక్క కామన్‌ క్వాలిటీ ఏంటంటే... మేఘన చాలా బ్రాండ్‌ మైండెడ్‌!


నటనలో నేనెప్పుడూ శిక్షణ తీసుకోలేదు. స్కూల్‌లో ఉన్నప్పుడు స్టేజి మీద ప్రదర్శనలు ఇచ్చా. కానీ, అప్పుడు నటన గురించి ఏమీ తెలియదు. వీఐటీలో థియేటర్‌ (డ్రామా) క్లబ్‌ అని ఉంటుంది. కాలేజీకి వెళ్లాక... అందులో చేరాను. నేను ఫుల్‌టైమ్‌ మెంబర్‌. మా టీమ్‌ అంతా కలసి చాలా పర్ఫార్మెన్స్‌లు ఇచ్చాం. నేను నటన నేర్చుకున్నది అక్కడే. హైదరాబాద్‌లో ఆడిషన్స్‌ ఇస్తూ, ఆరు నెలల్లో ఒక సిరీస్‌ చేయగలిగానంటే కారణం మా థియేటర్‌ క్లబ్‌.


నటనలో నాకు స్ఫూర్తి అంటూ ఎవరూ లేరు. ఒక్కో సినిమాలో ఒకొక్కరి నటన నచ్చుతుంది. కమల్‌హాసన్‌గారి ‘స్వాతిముత్యం’ అంటే చాలా ఇష్టం. అందులో కమల్‌తో పాటు అందరి నటన ఇష్టం. మంచి కథ, దర్శకుడితో పని చేసే అవకాశం వస్తే... సినిమాల్లోనూ నటించాలని ఉంది.ఇప్పటివరకూ నటించిన యూట్యూబ్‌ ఫిల్మ్స్‌


‘బ్రదర్‌ అండ్‌ సిస్టర్‌ టేల్స్‌’ - 6.39 లక్షల వ్యూస్‌

‘జాతిరత్నాలు అమ్మాయిలు అయితే’ - 6.53 లక్షల వ్యూస్‌

‘ఫ్లాట్‌మేట్‌ - ఎవ్రీ రూమ్మేట్‌ ఎవర్‌’ - 1.6 మిలియన్‌ వ్యూస్‌

‘కరోనా ఫైనల్‌ ఇయర్‌ బ్యాచ్‌’ - 3.55 లక్షల వ్యూస్‌

‘30 వెడ్స్‌ 21’ వెబ్‌ సిరీస్‌ - 13.5 మిలియన్‌ వ్యూస్‌ (మూడు ఎపిసోడ్లకు... మంగళవారం సాయంత్రానికి)


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.