తన గంభీరమైన వాయిస్, భయానక గెటప్పులతో సినీ ప్రేమికుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ విలన్ అమ్రీష్ పురి మొదట హీరో కావాలనుకుని సినిమాల్లో కాలుమొపారు. ఈరోజు(జూన్ 22) అమ్రీష్ పురి జన్మదినం. నేడు ఆయన మన మధ్య లేకపోయినప్పటికీ అతని నటన ఈనాటికీ మనకు గుర్తుకు వస్తుంటుంది. అమ్రీష్ పురి 30 ఏళ్ళకుపైగా సినీ పరిశ్రమలో కొనసాగారు. విభిన్న రకాల విలన్ పాత్రలలో అలరించారు.
బాలీవుడ్లో విలన్ పాత్ర అంటే ముందుగా అమ్రీష్ పురి పేరు వినిపిస్తుంది. అందుకే అమ్రీష్ పురికి సూపర్ విలన్ అనే ట్యాగ్ వచ్చింది. మిస్టర్ ఇండియా చిత్రంలో ఆయన పోషించిన మొగాంబో పాత్ర అందరికీ గుర్తుకువస్తుంది. 1987లో విడుదలైన మిస్టర్ ఇండియాలో అమ్రీష్ పురి పాత్రను గుర్తు చేసుకుంటూ అతని అభిమానులు మొగాంబో ఖుష్ హువా అనే డైలాగ్ ఈనాటికీ చెబుతుంటారు. ఈ సినిమాలో హీరోగా నటించిన అనిల్‌కపూర్ కన్నా విలన్‌గా నటించిన అమ్రీష్ పురికి అధిక ప్రశంసలు దక్కాయి. అమ్రీష్ పురి తెలుగులో మేజర్ చంద్రకాంత్, ఆదిత్య 369, జగదేకవీరుడు అతిలోకసుందరి, కొండవీటి దొంగ, అశ్వమేధం, ఆఖరి పోరాటం, దళపతి తదితర చిత్రాల్లో నటించారు.