హిందీ కథానాయిక విద్యా బాలన్, నిర్మాతలు ఏక్తా కపూర్, శోభా కపూర్‌కు ‘అకాడెమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెన్స్’ (ఏఎంపీఏఎస్ - ఆస్కార్ అకాడెమీ) నుంచి ఆహ్వానం అందింది. ‘‘కొత్త సభ్యులను ప్రకటించే సమయం వచ్చింది. క్లాస్ ఆఫ్ 2021ను చూడండి’’ అని శుక్రవారం ‘అకాడెమీ’ ట్వీట్ చేసింది. అందులో ఈ ముగ్గురి పేర్లూ ఉన్నాయి. ‘తుమ్హారీ సులు’, ‘కహానీ’ చిత్రాల్లో నటనకు గాను విద్యా బాలన్‌ను... ‘డ్రీమ్ గాళ్’, ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై’ చిత్రాలు నిర్మించినందుకు ఏక్తా కపూర్‌ను, ‘ద డర్టీ పిక్చర్’, ‘ఉడ్తా పంజాబ్’ చిత్రాలు నిర్మించినందుకు శోభా కపూర్‌ను అకాడెమీ ఆహ్వానించింది. ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా వివిధ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖుల్ని ఆహ్వానించి, ఆస్కార్ విజేతల్ని ఎంపిక చేసే ప్రక్రియలో భాగం చేస్తుంది.
నామినేట్ అయిన చిత్రాల్లో తమకు నచ్చిన వాటికి ఈ సభ్యులు ఓటు వేయవచ్చు. 94వ ఆస్కార్ విజేతల ఎంపికలో విద్యా బాలన్, ఏక్తా కపూర్, శోభా కపూర్లు ఓటు వేయనున్నారు. గతేడాది 819మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఎంపిక చేసిన ఆస్కార్స్, ఈ ఏడాది సభ్యుల సంఖ్యను 395మందికి మాత్రమే పరిమితం చేసింది. గతేడాది హృతిక్ రోషన్, ఆలియా భట్, నీతా లుల్లా... అంతకు ముందు ఏడాది జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, అనుపమ్ ఖేర్ తదితరులకు ఆహ్వానాలు అందిన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి 27న ఆస్కార్ వేడుక నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారు. కరోనా వల్ల ఈ ఏడాది వేడుక నిర్వహణ ఆలస్యమైన సంగతి తెలిసిందే.