‘అమ్మోరుతల్లి’ మూవీ రివ్యూ

ABN , First Publish Date - 2020-11-14T22:18:03+05:30 IST

దేవుడు అనే అంశం చుట్టూ సినిమాను తీయడమంటే చాలా కష్టమైన పని. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా.. సినిమాను తెరకెక్కించాలి.

‘అమ్మోరుతల్లి’ మూవీ రివ్యూ

బ్యానర్‌:  వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌

విడుదల:  డిస్నీ హాట్‌స్టార్‌

నటీనటులు: నయనతార, ఆర్‌.జె.బాలాజీ, అజయ్‌ ఘోష్‌, ఊర్వశి తదితరులు

సంగీతం: గిరీష్‌.జి

కెమెరా: దినేశ్‌ కృష్ణన్‌

మాటలు: కె.ఎన్‌.విజయ్‌కుమార్‌

పాటలు: దినేష్‌

ఎడిటింగ్‌: ఆర్‌.కె.సెల్వ

నిర్మాతలు: ఐరీష్‌ కె.గణేశ్‌

దర్శకత్వం: ఆర్‌.జె.బాలాజీ, ఎన్‌.జె.శరవణన్


దేవుడు అనే అంశం చుట్టూ సినిమాను తీయడమంటే చాలా కష్టమైన పని. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా.. సినిమాను తెరకెక్కించాలి. అలాగే మనం చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పాలి.  ఏ మాత్రం తేడా కొట్టిన సదరు మతానికి చెందిన సంఘాలు సినిమాపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తాయి. ఇలాంటి కష్టమైన పాయింట్‌ను సినిమాగా తెరకెక్కించడానికి ముందుకు వచ్చారు  ఆర్‌జె బాలాజీ. ఎన్‌.జె.శరవణన్‌తో కలిసి ఈయన డైరెక్ట్‌ చేసిన సినిమా మూకుత్తి అమ్మన్‌. ఈ చిత్రాన్ని తెలుగులో అమ్మోరు తల్లి పేరుతో విడుదల చేశారు. థియేటర్స్‌ విషయంలో క్లారిటీ లేకపోవడంతో అమ్మోరు తల్లి.. ఓటీటీ మాధ్యమం డిస్నీ హాట్‌ స్టార్‌లో విడుదలైన ఈ సినిమాలో అమ్మవారి పాత్రలో నయనతార కనిపించడంతో పాటు సినిమా ట్రైలర్‌.. సినిమా ఎలా ఉంటుందోనని అందరిలో ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా?  లేదా? అనే విషయం తెలియాలంటే కథేంటో చూద్దాం..


కథ:

కాశీబుగ్గ ఆకులపల్లిలో ఉండే ఎంగేల్‌ రామస్వామి(ఆర్‌.జె.బాలాజీ) దిగువ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. చిన్నప్పుడే తండ్రి ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోవడంతో.. తాతయ్య, తల్లి, ముగ్గురు చెల్లెళ్లున్న కుటుంబాన్ని ఓ లోకల్‌ ఛానెల్‌లో పనిచేస్తూ పోషిస్తుంటాడు. తన గ్రామంతో సహా చుట్టు పక్కల 118 గ్రామాలకు చెందిన 11 వేల ఎకరాల భూమిని దేవుడు పేరుతో ఆక్రమించుకోవాలని భగవతీబాబా(అజయ్ ఘోష్‌) ప్రయత్నిస్తుంటాడు. రామస్వామి తల్లికి తిరుమల వెళ్లాలనే కోరిక. ఆమె ఎప్పుడు తిరుమల వెళ్లాలని అనుకున్నా ఏదో ఒక సమస్య వస్తుంటుంది. ఆ సమయంలో వారి కులదైవం అయిన మూడు పుడకల అమ్మవారిని దర్శించుకోమని ఓ పెద్దాయన సలహా ఇస్తాడు. ఆ గుడికి వెళ్లి రామస్వామి తన కష్టాలను చెప్పుకుని సమస్యలను తీర్చమని చెబుతాడు. రామస్వామి కష్టాలను తీర్చడానికి అమ్మవారు(నయనతార) స్వయంగా భూమిపైకి దిగుతుంది. ముందు రామస్వామి, అతని కుటుంబం అమ్మవారిని నమ్మరు కానీ.. తర్వాత నమ్ముతారు. చివకు అమ్మవారు ఏం చేశారు?  తన పేరు చెప్పి భూములను ఆక్రమించుకోవాలని చూస్తున్న బాబాకు ఎలా బుద్ధి చెబుతారు? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే...


సమీక్ష:

దేవుడు.. ఆయనకు సంబంధించిన అంశాల చుట్టూ సినిమాను తెరకెక్కించడం అంటే ఇతరుల మనోభావాలను దెబ్బ తీయకుండా జాగ్రత్తలు తీసుకుంటూ తెరకెక్కించాలి. ఈ సినిమా చూస్తే దర్శకుడు, నటుడు ఆర్‌జె.బాలాజీ ఈ విషయంలో వందశాతం సక్సెస్‌ను సాధించాడు. దేవుడు అనేవాడు మనలోనే ఉంటాడు. బయట వెతక్కండి.. మనలో ఉండే దేవుడే బెటర్‌ వెర్షన్‌ అని చెప్పడమే ఈ సినిమా ప్రధాన ఉద్దేశంగా సినిమాను తెరకెక్కించినట్లు కనిపించింది. అంతే కాకుండా దొంగ బాబాలు మాయ మాటలతో భక్తులన ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని కూడా ఇందులో చూపించారు. ఓ మతానికి సంబంధించి తప్పును ప్రశ్నించినప్పుడు నువ్వు ఏ మతానికి చెందినవాడవు.. వేరే మతాల నుండి ఎంత డబ్బులు తీసుకున్నావు అనే ప్రశ్నలు వస్తుంటాయనే విషయాన్ని కూడా ఇందులో సంధించారు. బాబాలు భక్తిని ప్రచారం చేయాలి. కానీ కొందరు వ్యాపారం చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? అని కూడా ఈ సినిమా ద్వారా బాలాజీ ప్రశ్నించినట్లు అనిపించింది. గాడ్‌ వెర్సస్‌ గాడ్‌మేన్‌ మధ్య పోటీ.. మధ్యలో ఓ యువకుడు సాధనంగా ఉంటే ఆ పోరాటం ఎలా సాగుతుంది? అనే అంశాలను చూపించారు. అలాగే దిగువ మధ్య తరగతివారికి దేవుడు కనిపిస్తే.. ఎలాంటి వరాలు కోరుకుంటారు అనే విషయాలను కూడా ఎంటర్‌టైనింగ్‌గా చూపించారు. దినేశ్‌ కృష్ణన్‌ సినిమాటోగ్రఫీ బావుంది. గిరీష్‌ గోపాలకృష్ణన్‌ సంగీతంలో పాటలు బాగోలేవు. కానీ నేపథ్య సంగీతం బావుంది. ట్రైలర్‌లోనే అసలు కథ ఏంటనే విషయాన్ని చెప్పేశారు. అయితే ఎంత ఆసక్తికరంగా మలిచారనేది మాత్రమే చూడాలి. ఇక అమ్మవారి పాత్రలో నయనతార చక్కగా నటించారు. ఇక దర్శకుడిగానే కాదు.. దిగువ మధ్య తరగతి యువకుడిగా ఆర్‌జె బాలాజీ తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. ఇక ఊర్వశి ఎంటర్‌టైన్‌మెంతో నవ్వించడమే కాదు.. ఎమోషనల్‌గానూ ఆకట్టుకున్నారు. దొంగబాబాగా అజయ్‌ ఘోష్‌ తన పాత్రలో ఒదిగిపోయారు. మిగిలిన పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు న్యాయం చేశారు. కుటుంబంతో కలిసి సినిమాను ఎంజాయ్‌ చేసేలా  ఉంది. 


చివరగా.. ఎంటర్‌టైనింగ్‌గా ఉంటూనే మనం చేస్తున్న తప్పును ప్రశ్నించిన ‘అమ్మోరుతల్లి’
రేటింగ్‌: 2.5/5

Updated Date - 2020-11-14T22:18:03+05:30 IST