బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ రీసెంట్‌గానే శ్రీమతి కిరణ్‌రావ్‌తో కలసి 15వ వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే శనివారం వీరిద్దరూ వారి వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొంతకాలంగా విడిపోవాలనుకుంటున్నట్లు ఈ ప్రకటనలో ఆమిర్, కిరణ్‌రావు తెలియజేశారు. విడిపోయినప్పటికీ కొడుకు అజాద్ పెంపకం విషయంలో తాము కలిసే నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. అలాగే వీరిద్దరూ స్టార్ట్ చేసిన పానీ ఫౌండేషన్ కోసం ఇద్దరూ కలిసి పనిచేస్తామని తెలియజేశారు మరి.
"ఈ పదిహేనేళ్ల సినీ ప్రయాణంలో జీవితానికి సరిపడా ఆనందాలను, అనుభవాలను, నవ్వులను పంచుకున్నాం. మా మధ్య బంధం అనేది నమ్మకం, గౌరం, ప్రేమల నుంచి పుట్టింది. ఇప్పుడు ఓ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం. ఇకపై భార్య భర్తలుగా కొనసాగలేం. అయితే కుటుంబం కోసం సహ తల్లిదండ్రులుగా బాధ్యతను తీసుకుంటాం. కొంతకాలం నుంచి విడి విడిగానే ఉంటూ వస్తున్నాం. వేర్వేరుగా మా జీవితాలను, కుటుంబాలను విస్తరించుకోవడానికి ముందుకెళతాం. మా కొడుకు అజాద్ పెంపెకంలో ఇద్దరం కలిసే ఉంటాం. అలాగే మేం చేస్తున్న, చేయబోయే సినిమాలు, పానీ ఫౌండేషన్ వ్యవహారాల్లోనూ కలిసే ముందుకెళతాం. మమ్మల్ని అర్థం చేసుకుని మాకు నిరంతర మద్దతుని తెలియజేసిన మా కుటుంబాలకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలను తెలియజేస్తున్నాం. మీ సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తారని భావిస్తున్నాం. విడిపోవాలనుకోవడం అనేది ముగింపు కాదని, కొత్త ప్రయాణానికి ప్రారంభమని భావిస్తున్నాం" అంటూ తమ లేఖలో ఆమిర్‌ఖాన్, కిరణ్‌రావు పేర్కొన్నారు.