కష్టాల నుంచి గట్టెక్కించిన ‘అల్లుడుగారు’

ఏనాడు వెనుకడుగు వేసేవారు కాదు..

నష్టపోయిన సందర్భాలు ఎక్కువే..

ఆ నిర్ణయంతో మంచే జరిగింది.. 

హీరో ఇమేజ్‌ను, క్రేజ్‌ను క్రియేట్‌ చేశారు 

ప్రారంభంలో ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నా స్వయంకృషితో పైకి వచ్చిన వ్యక్తి డాక్టర్‌ మోహన్‌ బాబు.  విలక్షణమైన తన నటనతో, డైలాగ్‌ డెలీవరీతో ఆడియన్స్‌ను ఆకట్టుకొన్నారు. ఒకసారి హీరో పాత్రలు పోషించడం మొదలుపెట్టిన తర్వాత ఇక విలన్‌ వేషాల జోలికి సాధారణంగా ఎవరూ వెళ్లరు. కానీ ‘నా రూటే వేరు’ అనిపించుకొన్న మోహన్‌బాబు ఒకవైపు హీరోగా నటిస్తూనే, మరోవైపు విలన్‌గా నటించడానికి ఏనాడు వెనుకడుగు వేసేవారు కాదు.  కాకపోతే ప్రారంభంలో మోహన్‌ బాబు హీరోగా నటించి ఆర్థికంగా నష్టపోయిన సందర్భాలు ఎక్కువే. అయినప్పటికీ హీరో పాత్రలపై తనకున్న మక్కువను ఆయన వదిలిపెట్టలేదు. నిజం చెప్పాలంటే ఒక సినిమా హీరో పాత్ర కోసం కేటాయించే డేట్స్‌తో ఈజీగా అయిదారు సినిమాల్లో విలన్‌గా చేేసయొచ్చు. అయినా సరే తన సొంత బ్యానర్‌పై తీసే సినిమాల్లో మాత్రమే హీరోగా నటిస్తూ, బయట చిత్రాల్లో విలన్‌గా నటించాలని ఆ రోజుల్లో మోహన్‌బాబు తీసుకున్న నిర్ణయం వల్ల ఆయనకు మంచే జరిగింది. 

ఎన్నో సినిమాల్లో విభిన్నమైన తన నటనతో ఆడియన్స్‌ని ఎట్రాక్ట్‌ చేసిన మోహన్‌బాబు తన గురువు దాసరి నారాయణరావు ప్రోత్సాహంతో ‘కేటుగాడు’ చిత్రంతో కథానాయకుడిగా కొత్త అవతారం ఎత్తినప్పుడు మోహన్‌బాబుకు ఇది అవసరమా... అనుకున్నారు పరిశ్రమలో చాలామంది. అదృష్టవశాత్తు తన తొలి సినిమాతోనే హీరోగా సక్సెస్‌ సాధించారు మోహన్‌ బాబు. ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో హీరోగా నటించినా వాటిలో ఎక్కువ శాతం సక్సెస్‌ కాలేదు. మళ్లీ ఆయన్ని హీరోగా నిలబెట్టిన సొంత చిత్రం ‘అల్లుడుగారు’. ఈ సినిమాతో మోహన్‌బాబు మద్రాసు వదిలి వెళ్ళి పోవడం ఖాయమని ఆరోజు పరిశ్రమలో చాలామంది అనుకున్నారు. అయితే మోహన్‌బాబు కాన్ఫిడెన్స్‌ నిజమైంది. చాలామంది అంచనాలను తారుమారు చేస్తూ ‘అల్లుడుగారు’ ఘన విజయం సాధించింది. ఈ సినిమాతో మోహన్‌ బాబుకు విభిన్నమైన హీరో ఇమేజ్‌ను, క్రేజ్‌ను క్రియేట్‌ చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు. అంతకుముందు సొంత సినిమాలు తీసి ఆర్థికంగా నష్టపోయిన మోహన్‌ బాబు ‘అల్లుడుగారు’ ఘనవిజయంతో నిర్మాతగా నిలబడ్డారు. మరిన్ని సినిమాలు తీయడానికి ధైర్యాన్ని, డబ్బును సంపాదించుకోగలిగారు. మలయాళంలో విజయం సాధించిన మోహన్‌లాల్‌ సినిమా ‘చిత్రమ్‌’ కు రీమేక్‌ ఇది. శోభన కథానాయికగా నటించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ అతిధి పాత్రను పోషించారు. కె.వి..మహదేవన్‌ స్వరపరిచిన ఈ సినిమాలో పాటలన్నీ అప్పటి ప్రేక్షకుల్ని ఎంతో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఏసుదాసు పాడిన ‘ముద్దబంతి పువ్వులో మూగ బాసలు..’ పాట  ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది.

–వినాయకరావు 


అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.