బన్నీ సినిమా విడుదలను వాయిదా వేసిన నిర్మాతలు
ABN , First Publish Date - 2022-01-21T22:08:46+05:30 IST
టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ హిట్‌గా ఆ చిత్రం నిలిచింది

టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన సినిమా ‘అల వైకుంఠపురంలో’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లోనే భారీ హిట్‌గా ఆ చిత్రం నిలిచింది. పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. బన్నీ హీరోగా తెరకెక్కిన ‘పుష్ప’ సినిమా బాలీవుడ్‌లో ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించింది. హిందీ సినిమాలకు ధీటుగా అక్కడ వసూళ్లను రాబట్టింది. దీంతో నిర్మాతలు బన్నీ క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకున్నారు. ‘అల వైకుంఠపురంలో’ సినిమాని డబ్ చేసి జనవరి 26న విడుదల చేస్తామన్నారు. ఈ సినిమా డబ్బింగ్ హక్కులు ‘గోల్డ్ మైన్స్ టెలీఫిలింస్’ అధినేత మనీశ్ షా వద్ద ఉన్నాయి. ఆయనే ‘పుష్ప’ ని హిందీలో విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ‘అల వైకుంఠపురంలో’ చిత్రాన్ని దాదాపుగా 200 స్క్రీన్స్‌లో విడుదల చేస్తామని మనీశ్ తెలిపారు.
‘అల వైకుంఠపురంలో’ సినిమాని హిందీలో ఇప్పటికే ‘షెహజాదా’ పేరుతో రీమేక్ చేశారు. రీమేక్ వెర్షన్‌కు అల్లు అరవింద్, అమన్ గిల్, భూషణ్ కుమార్ నిర్మాతలుగా వ్యవహరించారు. కార్తిక్ ఆర్యన్, కృతి సనన్, పరేశ్ రావల్ ఆ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. డబ్బింగ్ వెర్షన్ విడుదలైతే, రీమేక్‌కు నష్టం చేకూరుతుందని ‘షెహజాదా’ నిర్మాతలు భావించారు. దీంతో మనీశ్ షాతో వారు చర్చలు జరిపారు. డబ్బింగ్ వెర్షన్‌ను విడుదల చేయొద్దని కోరారు. అందుకు మనీశ్ షా ఒప్పుకున్నారు. ఆ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు అధికారికంగా ప్రకటన జారీ చేశారు.