విగ్గు లేకుండా అక్కినేని నటించిన ఏకైక చిత్రం

ABN , First Publish Date - 2022-08-07T05:30:00+05:30 IST

తెలుగు సినిమాతో కలసి అడుగులు వేస్తూ నడిచిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తొలి తరం నటుల్లో ఆయన ఓ అగ్ర తారగా ఎదిగారు. ఎన్నో అపురూపమైన పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి..

విగ్గు లేకుండా అక్కినేని నటించిన ఏకైక చిత్రం

తెలుగు సినిమాతో కలసి అడుగులు వేస్తూ నడిచిన  నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తొలి తరం నటుల్లో ఆయన  ఓ అగ్ర తారగా ఎదిగారు. ఎన్నో అపురూపమైన పాత్రలు పోషించారు. ఒక వ్యక్తి తలచుకుంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనే మాటకు నిలువెత్తు నిదర్శనం అక్కినేని. ఆయన జీవితమే ఒక చరిత్ర. ఎంతోమందికి స్ఫూర్తిదాయకం అక్కినేని జీవన విధానం. కోట్లాదిమంది కి ఆయన ఆరాధ్యదైవం అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. 250కి పైగా చిత్రాల్లో  ఎన్నో విభిన్న పాత్రలు ఆయన పోషించారు. అయితే  ఒక్క సినిమా లో తప్ప  మిగిలిన అన్నింటిలో అక్కినేని విగ్గు పెట్టుకొని నటించారు. ఆ చిత్రం... సీతారామయ్య గారి మనవరాలు. ఆయన గెటప్‌ విభిన్నంగా ఉంటే బాగుంటుందని  విగ్గు పెట్టుకోవద్దన్నారు దర్శకుడు క్రాంతికుమార్‌. ఇంతవరకూ లేనిది ఇప్పుడెందుకని  మొదట ఒప్పుకోలేదు అక్కినేని. ఆయన్ని ఒప్పించడానికి చాలా కష్టపడ్డారు  క్రాంతికుమార్‌. విగ్గుతో, విగ్గు లేకుండా గెటప్‌ స్టిల్స్‌ తీసి, ఫైనలైజ్‌ చేద్దామని అంటే సరేనన్నారు అక్కినేని. ఇలా రెండు రకాలు స్టిల్స్‌ తీశారు. విగ్గు లేకుండానే అక్కినేని బాగున్నారని అందరూ అన్నారు. అక్కినేని అన్నపూర్ణ, నాగార్జున తదితరులు కూడా విగ్గు లేకుండానే నటించమని సలహా ఇవ్వడంతో అప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అక్కినేని. 


మీనాకు మంచి అవకాశం

మానస రాసిన ‘నవ్వినా కన్నీళ్లే’ నవల ఆధారంగా తయారైన ‘సీతారామయ్య గారి మనవరాలు’ చిత్రం లో అక్కినేని సరసన రోహిణీ హట్టంగడి నటించారు. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. ‘గాంధీ’ చిత్రంలో ఆమె అంతకుముందు కస్తూరి బా పాత్ర పోషించారు. బాలనటిగా చాలా చిత్రాల్లో  నటించి, హీరోయిన్‌ గా ఎదిగిన మీనా నట జీవితాన్ని మలుపు తిప్పిన సినిమా ‘సీతారామయ్య గారి మనవరాలు’. మొదట గౌతమిని కథానాయికగా అనుకున్నా చివరికి మీనాకు ఆ వేషం దక్కింది. పంపిణీ రంగంలో అనుభవం కలిగిన వి. దొర స్వామిరాజుకు  నిర్మాతగా రెండో సినిమా ‘సీతారామయ్య గారి మనవరాలు’ . షూటింగ్‌ ప్రారంభమైన 73వ రోజున అంటే 1991 జనవరి 11న ఈ చిత్రం విడుదల కావడం విశేషం. ఫస్ట్‌ కాపీ రాగానే అక్కినేని సినిమా చూశారు. ఫస్ట్‌ హాఫ్‌లో కొన్ని అనవసర సన్నివేశాలు ఉన్నాయనీ, 900 అడుగులు కట్‌ చేస్తే బాగుంటుందని తన అనుభవంతో సూచించారు అక్కినేని. అలాగేనంటూ ఆయన మాట మన్నించారు క్రాంతికుమార్‌. తన ఇంట్లో పిల్లలకు, మనవలు, మనవరాళ్లకు ఈ సినిమా చూపించారు అక్కినేని. విభిన్న మనస్తత్వాలు కలిగిన వారందరికీ ఈ చిత్రం నచ్చింది. అయితే విడుదలైన మొదటి వారం ‘సీతారామయ్యగారి మనవరాలు’ చిత్రానికి కలెక్షన్లు లేవు. ఆడడం కష్టం అన్నారు. కానీ అనూహ్యంగా రెండో వారం నుంచి వసూళ్లు పెరిగి, వంద రోజుల వరకూ తగ్గలేదు. 



Updated Date - 2022-08-07T05:30:00+05:30 IST