నేటి నుంచి అజిత్‌ఖాన్‌ శతజయంతి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-01-27T05:40:30+05:30 IST

హిందీ చిత్రసీమలో దిగ ్గజ నటుడిగా ఖ్యాతి గడించిన హైదరాబాద్‌ ముద్దుబిడ్డ దివంగత అజిత్‌ ఖాన్‌ శత జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి....

నేటి నుంచి అజిత్‌ఖాన్‌ శతజయంతి ఉత్సవాలు

హిందీ చిత్రసీమలో దిగ ్గజ నటుడిగా ఖ్యాతి గడించిన హైదరాబాద్‌ ముద్దుబిడ్డ దివంగత అజిత్‌ ఖాన్‌ శత జయంతి ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ద దక్కన్‌ హెరిటేజ్‌ ట్రస్ట్‌- హైదరాబాద్‌ ఈ కార్యక్రమాలకు నేతృత్వం వహిస్తున్నట్టు ఆ సంస్థ ట్రస్టీ మహమ్మద్‌ సైఫుల్లా తెలిపారు. అజిత్‌ఖాన్‌ తనయుడు షహీద్‌ అలీఖాన్‌, ఐఏఎస్‌ జయేష్‌ రంజన్‌, దక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ అధ్యక్షుడు ఎం. వేదకుమార్‌ తదితరులు ఈ శత జయంతి ఉత్సవ కమిటీలో ఉన్నారు. నేటి మధ్యాహ్నం గోల్కొండ కోట, జమాలి కుంటలోని అజిత్‌ ఖాన్‌ సమాధి వద్ద కుటుంబ సభ్యులు, అభిమానులు నివాళులర్పించనున్నారు. త్వరలో ఆయన జీవిత విశేషాలతో రూపొందించిన కాఫీ టేబుల్‌ బుక్‌ను విడుదల చేయనున్నారు. అజిత్‌ ఖాన్‌ నటించిన చిత్రాలను దేశవ్యాప్తంగా పలు చోట్ల ప్రదర్శించడంతో పాటు వెబినార్‌ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అజిత్‌ఖాన్‌ గౌరవార్థం ఏదైనా రహదారికి ఆయన పేరు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, అలాగే ఆయన చిత్రంతో స్టాంపును విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి శతజయంతి కమిటీ విజ్ఞప్తి చేసింది. 


స్టార్‌ హీరోగా ఎదిగి విలన్‌గా మెప్పించి 

హమీద్‌ అలీఖాన్‌ 1922 జనవరి 27న హైదరాబాద్‌ గోల్కొండలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం హైదరాబాద్‌, వరంగల్‌లో జరిగింది. నటుడు కావాలనే లక్ష్యంతో 1940ల్లో బాంబే వెళ్లారు. 1946లో వచ్చిన ‘షా హే మిశ్రా’ హీరోగా ఆయనకు బ్రేక్‌ ఇచ్చింది. హమీద్‌ అలీఖాన్‌ పేరు మార్చుకొని అజిత్‌ఖాన్‌గా ప్రేక్షకులను అలరించారు. మొత్తం 200కు పైగా చిత్రాల్లో నటించారు. ‘మొఘల్‌ ఈ అజమ్‌’, ‘నయాదౌర్‌’, ‘నాస్తిక్‌’, ‘గెస్ట్‌హౌస్‌’, ‘మెరైన్‌ డ్రైవ్‌’ ఆయనకు నటుడిగా గొప్ప పేరు తెచ్చాయి. 1970 దశకంలో ‘సూరజ్‌’చిత్రంతో ఆయన విలన్‌ పాత్రలకు మళ్లారు. ‘జంజీర్‌’, ‘కాళీచరణ్‌’, ‘యాదోం కి బరాత్‌’ తదితర చిత్రాల్లో ప్రతి నాయక పాత్రల్లోనూ మెప్పించారు. అప్పట్లో అజిత్‌ఖాన్‌ను ముద్దుగా ‘మోనా డార్లింగ్‌’, ‘స్మార్ట్‌ బాయ్‌’ అని అభిమానులు పిలిచేవారు. 1998 అక్టోబరు 22న తన స్వస్థలం హైదరాబాద్‌లో ఆయన కన్నుమూశారు.


Updated Date - 2022-01-27T05:40:30+05:30 IST