Aishwarya Rajesh Success Story: పేరులోనే ‘ఐశ్వర్య’

ABN , First Publish Date - 2022-07-31T17:07:20+05:30 IST

ఒక్క చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం. కానీ జీవితమే దెబ్బ కొడితే? ఐశ్వర్య రాజేష్‌ కథ(Aishwarya Rajesh Success Story) అలాంటిదే. చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాల్ని చూసింది. చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూర

Aishwarya Rajesh Success Story: పేరులోనే ‘ఐశ్వర్య’

ఒక్క చిన్న దెబ్బ తగిలితేనే అల్లాడిపోతాం. కానీ జీవితమే దెబ్బ కొడితే? ఐశ్వర్య రాజేష్‌ కథ(Aishwarya Rajesh Success Story) అలాంటిదే. చిన్నప్పటి నుంచీ ఎన్నో కష్టాల్ని చూసింది. చిన్నప్పుడే తండ్రి ప్రేమకు దూరమైంది. ఓ రోడ్డు ప్రమాదం సోదరుల్ని పొట్టన పెట్టుకొంది. అప్పులు వెంటాడాయి. ‘నీకు సినిమాలేంటి?’ అనే విమర్శల్ని భరించింది. కానీ చివరికి గెలిచింది.. 


సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలోనే పుట్టింది ఐశ్వర్య. తండ్రి రాజేష్‌ తెలుగు ప్రేక్షకులకు(Telugu audience) పరిచయమైన నటుడే. ‘మల్లెమొగ్గలు’, ‘రెండు జెళ్ల సీత’, ‘ఆనందభైరవి’ లాంటి సినిమాల్లో నటించారు. హాస్య నటి శ్రీలక్ష్మి ఐశ్వర్యకు మేనత్త అవుతారు. అలా సినిమాతో మమేకమైన కుటుంబం నుంచి వచ్చింది ఐశ్వర్య. అందుకే తనక్కూడా చిన్నప్పటి నుంచి నటన అంటే ఇష్టం ఏర్పడింది.


అప్పుల భారం...

బాల్యంలోనే ఐశ్వర్యకు కష్టాలు పరిచయమయ్యాయి. ఎనిమిదో ఏటే తండ్రిని(Aishwarya Rajesh Father) కోల్పోయింది. రాజేష్‌ బాగానే సంపాదించారు. కానీ గొప్పలకు పోయి, స్నేహితుల్ని నమ్మి సంపాదించిందంతా హారతి కర్పూరంలా కరగబెట్టారు. ఆయన చేసిన అప్పులు, అందుకు వడ్డీలూ అన్నీ కలిపి ఇంటిపై పడ్డాయి. ఆ భారం తల్లి మోసింది. ఆమె ఎల్‌ఐసీ ఏజెంట్‌(LIC Agent)గా పనిచేస్తూనే తన నలుగురు పిల్లల్నీ చదివించింది. ఒకానొక దశలో అప్పుల్ని తీర్చలేక ఉన్న ఒకే ఒక్క ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. అలా.. తొలిసారి ఓ అద్దె ఇంట్లోకి మారాల్సి వచ్చింది. ఐశ్వర్య పెద్దన్నయ్య ఎంబీఏ పూర్తి చేశారు. ఉద్యోగం కూడా వచ్చింది. రెండో అన్నయ్య కూడా స్థిరపడుతున్నాడని అనుకుంటున్న దశలో... ఓ ప్రమాదం ఆ ఇంటిని కబళించింది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నలూ చనిపోవడంతో ఆ కుటుంబం తేరుకోలేకపోయింది. ఆ బెంగతో తల్లి కూడా మంచం ఎక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో చదువు మానేసి ఉద్యోగ ప్రయత్నాలు మొదలెట్టింది ఐశ్వర్య.  


బుల్లితెర నుంచి...

ఐశ్వర్యకు చిన్నప్పటి నుంచీ డాన్స్‌ అంటే ఇష్టం. తల్లి డాన్సర్‌ కావడంతో.. ఆమెను చూసి ఐశ్వర్య డాన్స్‌ నేర్చుకొంది. స్కూల్లో జరిగే పోటీల్లో పాల్గొని కప్పులు గెలిచింది. ఇప్పుడు దాన్నే జీవనాధారం చేసుకోవాలన్న నిర్ణయం తీసుకొంది. ఓ టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డాన్స్‌ రియాలిటీ షోలో పాల్గొంది. బుల్లితెరపై అది తన తొలి ఎంట్రీ. ఆ రియాలిటీ షోలో తానే విన్నర్‌. ఆ విజయం తనపై తనకు నమ్మకాన్ని పెంచింది. క్రమంగా టీవీ సీరియల్స్‌లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. రోజుకి రూ.1000 పారితోషికం అందుకుంటూ, నటిగా కాస్త సంపాదించడం మొదలెట్టింది.


కానీ ఎంత సంపాదించినా సరిపోయేది కాదు. అద్దెలూ, అప్పులు, మందులూ, ఇంటి అవసరాలూ.. ఇలా ఖర్చు పెరిగిపోతూనే ఉండేది. అందుకే ‘సీరియల్స్‌ వల్ల లాభం లేదు.. సినిమాల్లోకి వెళ్లాల్సిందే అనుకొంది. కానీ.. అక్కడ ఎంట్రీ అంత తేలిగ్గా దొరకలేదు. ‘నల్లగా ఉన్నావ్‌. నీకెందుకు సినిమాలూ’ అని తన రంగుని హేళన చేశారంతా. చెల్లెలు, స్నేహితురాలు.. ఇలాంటి చిన్న చిన్న పాత్రలు దక్కాయి. వచ్చిన ప్రతీ అవకాశాన్నీ ఒప్పుకుంది.



ఓటమి బాధ లేదు...

తమిళంలో ‘కనా’ అనే సినిమా ఐశ్వర్యకు మంచి పేరు తీసుకొచ్చింది. ఇందులో క్రికెటర్‌గా నటించింది. ఈ సినిమానే తెలుగులో ‘కౌశల్య కృష్ణమూర్తి’ పేరుతో రీమేక్‌ చేశారు. అందులో కూడా ఐశ్వర్యనే కథానాయిక. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ(Vijay Devarakonda) ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’లో ఓ కథానాయికగా మెరిసింది. ‘‘జీవితం నాకు చాలా నేర్పింది. ఇంకా కొత్త కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. తొలి దశలోనే చాలా దెబ్బలు తిన్నాను. అందుకే ఇప్పుడు ఓటమి నన్ను అంతగా బాధ పెట్టదు. గెలుపు - ఓటమి రెండూ నన్ను ఏమాత్రం మార్చలేవు’’ అని ఆత్మవిశ్వాసంతో చెబుతోంది ఐశ్వర్య.


డేరింగ్‌ నిర్ణయం

‘కాకా ముట్టై’ ఐశ్వర్య జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్యకు(Heroine Aishwarya Rajesh) అవకాశం వచ్చింది. కాకపోతే.. ఒక్కటే సమస్య. ఇద్దరు పిల్లల తల్లిగా కనిపించాలి. అప్పటికి తన వయసు ఇరవై ఏళ్లు. అంత చిన్న వయసులో తల్లిగా అంటే..? ఏ నటికైనా కంగారొస్తుంది. అప్పట్లో విజయ్‌ సేతుపతితో ఐశ్వర్యకు కాస్త సాన్నిహిత్యం ఉండేది. ఆయన్ని కలిసి సలహా అడిగితే... ‘నువ్వు ఈ అవకాశం వదులుకోవద్దు. నీలో నటిని ఈ సినిమాతోనే గుర్తించడం మొదలెడతారు’ అని సలహా ఇచ్చారు. దాంతో.. ఇంకేం ఆలోచించకుండా ఆ సినిమా పూర్తి చేసింది. ‘కాకా ముట్టై’ హిట్టయ్యింది. ఐశ్వర్యకు మంచి పేరొచ్చింది.  దర్శకుడు మణిరత్నం ‘నవాబ్‌’లో ఐశ్వర్యకు ఓ కీలక పాత్ర ఇచ్చారు. గౌతమ్‌ మీనన్‌ ‘ధృవనక్షత్రం’లోనూ ఐశ్వర్యకు అవకాశం వచ్చిందంటే కారణం.. ‘కాకా ముట్టై’నే. ఈ సినిమానే.. అర్జున్‌ రాంపాల్‌ హిందీ చిత్రం ‘డాడీ’లో ఐశ్వర్యని హీరోయిన్‌ని చేసింది. తన సంపాదనతో చెన్నైలో ఓ ఇల్లు కొనుగోలు చేసి తల్లికి బహుమతిగా ఇచ్చింది.


Updated Date - 2022-07-31T17:07:20+05:30 IST