కోలీవుడ్‌లో ఉన్న యువ హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. ఈమె గ్లామర్ ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ తన నటనతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ‘గనా’, ‘క.పె.రణసింగం’, ‘కాక్కా ముట్టై’ వంటి చిత్రాల్లో తన నటనతో ప్రతి ఒక్కరినీ అబ్బురపరిచింది. అదేసమయంలో తాను సినీ పరిశ్రమలోకి వచ్చేందుకు పడిన కష్టాలను తాజాగా వెల్లడించింది.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ... ‘‘నాకు 8 సంవత్సరాలు ఉన్న సమయంలో నాన్న చనిపోయారు. అమ్మ చిన్న వ్యాపారం చేస్తూ, ఎల్ఐసీ ఏజెంటుగా ఉంటూ తమను పెంచి పెద్దచేశారు. మా కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉంటాడని భావించిన పెద్దన్న పదేళ్ళ వయసులో చనిపోయాడు. ఆ తర్వాత ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండో అన్న కూడా ఒక రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో 15 యేళ్ళ వయసులోనే కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత నామీద పడింది. ఇందులో భాగంగా ఓ సూపర్ మార్కెట్లో పనికివెళ్లాను. అపుడు 250 రూపాయలు వేతనం. స్నేహితులు, తెలిసినవారి శుభకార్యాలకు యాంకరింగ్ చేసేదాన్ని. ఒక్కో ఈవెంట్‌కు రూ.500 ఇచ్చేవారు. అక్కడ నుంచి బుల్లితెరకు వెళ్ళాను. సీరియళ్ళలో చిన్నచిన్న పాత్రల్లో నటించినందుకు రూ.1500 ఇచ్చేవారు. అదేసీరియల్లో నటించే పెద్దపెద్ద నటీనటులకు భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చేవారు. దీంతో నేను కూడా గొప్పనటిని కావాలన్న సంకల్పం మనసులో పడింది. అందుకే సినిమాల్లో అవకాశాల కోసం శ్రమించాను. ఫలితంగా ‘అవర్గళ్ ఇవర్గళ్’ అనే చిత్రంలో తొలిసారి నటించారు. అయితే, ‘అట్టకత్తి’ చిత్రంలో నేను పోషించిన అముద అనే పాత్ర నాకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత అనేక మంది హేళనగా మాట్లాడారు. హీరోయిన్గా అస్సలు సరిపోవని కామెంట్స్ చేశారు. కానీ, ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ఈ క్రమంలో ఎదురైన లైంగిక వేధింపులను ధైర్యంగా ఎదుర్కొన్నా’’ అని వివరించింది.