ప్రస్తుతం కోలీవుడ్లో అత్యంత బిజీగా ఉన్న యువ హీరోయిన్లలో ఐశ్వర్యా రాజేష్ ఒకరు. ఈమె చేతిలో ‘ధృవనక్షత్రం’, ‘దిట్టమ్ ఇరండు’, ‘భూమిక’, ‘డ్రైవర్ జమున’, ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్ రీమేక్’, ‘మోహన్ దాస్’ వంటి చిత్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను ఎంతో నమ్మకంపెట్టుకుని ఉన్న ఒకరు తనకు వ్యతిరేకంగా నడుచుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది ఐశ్వర్య. ఈ విషయాన్ని ఆమె తాజాగా బహిర్గతం చేసింది. ‘అభిమానుల నుంచి డబ్బులు తీసుకుని, నా గురించి నావ్యక్తిగత వివరాలను వెల్లడించడం వంటి పనులను నా వెంట ఉన్న ఒక వ్యక్తే చేస్తున్నారనే విషయం తెలిసి జీర్ణించుకోలేకపోయాను. నావెంట వుంటూనే నాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని అనేక మంది నాకు సలహా ఇచ్చారు. కానీ తప్పు జరిగిపోయింది. ఇకపై మనమే జాగ్రత్తగా వుండాలని గ్రహించాను. అదేసమయంలో నన్ను మోసం చేసిన వ్యక్తికి ఒక్క విషయం సూటిగా చెబుతున్నాను. ఇలాంటి నమ్మకద్రోహం మరో వ్యక్తికి చేయొద్దు. ఇలాంటి విషయాల వల్ల ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదో నాకు అర్థంకావడం లేదు. ఏదిఏమైనా ఇకపై జాగ్రత్తగా ఉండాలన్నది మాత్రం గ్రహించాను’ అని ఐశ్వర్య వాపోయింది.