ఈ దర్శకులకు అగ్రహీరోలు సై!

స్టార్‌ హీరోలతో పనిచేయాలనేది పరిశ్రమలో చాలా మంది దర్శకుల కల. అలాంటి స్టార్‌ హీరోలు కూడా ఒక్క ఛాన్స్‌ అంటూ ఎదురుచూసే దర్శకులు పరిశ్రమలో కొందరు ఉన్నారు.  వారు సినిమా చేస్తామంటే చాలు ఓ యస్‌ అంటూ ముందుకు వచ్చే హీరోలు ఎందరో! అలా ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో ఆ స్థాయిని అందుకున్న కొద్దిమంది దర్శకులు వీరే. 


శంకర్‌... మాస్టర్‌ ఫార్మూలా 

రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలకు భిన్నంగా తమదైన టేకింగ్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకె ళ్లగల సత్తా ఉన్న దర్శకుడు శంకర్‌. పెద్ద హీరో సినిమా కోసం ప్రేక్షకులు ఎలా ఎదురుచూస్తారో శంకర్‌ సినిమా కోసం కూడా  ప్రేక్షకులు  అలా ఎదురుచూస్తారు. హీరో పేరుతో సంబంధం లేకుండా శంకర్‌ అనే పేరే ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తుంది. కెరీర్‌ ప్రారంభంలో మీడియం హీరోలతోనే కథను, టేకింగ్‌ను నమ్ముకొని ఆయన చేసిన ప్రయోగాలు ఫలించి, బాక్సాఫీసు దగ్గర వసూళ్ల వర్షం కురిసింది. ఆయన చిత్రాలతో కొందరు హీరోలు స్టార్‌ ఇమేజ్‌ను అందుకున్నారు. శంకర్‌తో ఒక్క చిత్రం చేసినా హీరోలకు అది కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం అవుతుంది. అందుకే అగ్ర హీరోలు ఆయనతో సినిమా చేయటానికి ఆసక్తి చూపుతున్నారు. ఆయన అవకాశమివ్వాలే గానీ వద్దనే హీరోలు దక్షిణాదినా, బాలీవుడ్‌లో దాదాపు లేరనే చెప్పాలి. శంకర్‌ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో ఓ చిత్రం చేస్తున్నారు. ‘అపరిచితుడు’ చిత్రాన్ని రణ్‌వీర్‌సింగ్‌ కథానాయకుడుగా హిందీలో  రీమేక్‌ చేస్తున్నారు. 


రాజమౌళి.... మ్యాజిక్‌

దర్శకుడిగా రాజమౌళి  కెరీర్‌ను మాత్రమే కాదు భారతీయ సినిమా గొప్పతనాన్ని అమాంతం పెంచిన చిత్రం ‘బాహుబలి’. ఆ తర్వాత ఇటు దక్షిణాదిన అటు బాలీవుడ్‌లో పాన్‌ ఇండియా చిత్రాల నిర్మాణం వేగం పుంజుకుంది. రాజమౌళి ‘బాహుబలి’ పాన్‌ ఇండియా చిత్రాల రూపకర్తలకు స్ఫూర్తి. ఇప్పుడు దాదాపు దక్షిణాదిన అగ్రహీరోలు తమ సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో ఉండేలా  చూసుకుంటున్నారంటే కారణం  రాజమౌళి కల్పించిన మార్కెట్‌ భరోసానే.


అవకాశం దొరకాలే కానీ రాజమౌళి దర్శకత్వంలో నటించాలనుకోని హీరో ఉండరంటే అతిశయోక్తి కాదు. తమ కెరీర్‌ను మలుపు తిప్పే అలాంటి అవకాశం ఇతర హీరోలకు దక్కటం ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి చారిత్రక కాల్పనిక చిత్రం ‘రణం రౌద్రం రుధిరం’ (ఆర్‌ఆర్‌ఆర్‌) చేస్తున్నారు. ఈ చిత్రం విడుదలయ్యాక కొన్ని నెలల విరామం తీసుకొని తర్వాత మహేశ్‌ బాబు చిత్రం కోసం పనిచేయనున్నారు. అంటే దాదాపు రెండేళ్లకు ఓ చిత్రం చేస్తున్నారు రాజమౌళి.  ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో హీరోకు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయటం కష్టమే అని చెప్పాలి. 


ప్రశాంత్‌ బ్రాండ్‌

సైలెంట్‌గా వచ్చి వసూళ్ల సునామిని సృష్టించింది ‘కేజీఎఫ్‌’ చిత్రం. కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌తో ఓ కొత్త ప్రపంచాన్ని, రాఖీబాయ్‌గా యశ్‌ హీరోయిజాన్నీ ప్రేక్షకుల ముందు ఓ రేంజ్‌లో ఎలివేట్‌ చేసి శభాష్‌ అనిపించుకున్నారు ప్రశాంత్‌ నీల్‌. ఆ ఒక్క చిత్రంతో యశ్‌ ఏకంగా పాన్‌ ఇండియా హీరోగా గుర్తింపు దక్కించుకున్నారు. ఆ సినిమాతో ప్రేక్షకులకే కాదు చాలామంది హీరోలకూ ప్రశాంత్‌ అభిమాన దర్శకుడు అయ్యారు. పలువురు అగ్రతారలు ప్రశాంత్‌తో సినిమా చేయాలని సంప్రదింపులు జరిపారు. ఆయన మాత్రం ‘కేజీఎఫ్‌ 2’ పూర్తికాగానే ప్రభాస్‌తో ‘సలార్‌’ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కించారు. ఆ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌తో ఓ చిత్రం ప్రకటించారు. చేతిలో ఉన్న రెండు ప్రాజెక్ట్‌లు పూర్తయ్యాకనే ప్రశాంత్‌ తన కొత్త చిత్రంపై దృష్టిసారించే అవకాశం ఉంది. అప్పటిదాకా మిగిలిన అగ్రహీరోలంతా వేచిచూడాల్సిందే. 


తెరపై ఓం రౌత్‌ ముద్ర

ఓం రౌత్‌ దర్శకత్వం వహించిన తొలి హిందీ చిత్రం ‘తానాజీ’. చారిత్రక వీరుడు తానాజీ జీవిత కథను, ఆయన వీరత్వాన్ని వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. గతేడాది థియేటర్లలో విడుదలైన చిత్రాల్లో అత్యధిక వసూళ్లు సాఽధించిన చిత్రంగా ‘తానాజీ’ నిలిచింది. ముఖ్యంగా పోరాట సన్నివేశాలను ఓంరౌత్‌ తెరకెక్కించిన తీరు యువ హీరోలను ఆకట్టుకుంది. చారిత్రకం నుంచి పౌరాణికానికి రూటు మార్చిన రౌత్‌ ప్రభాస్‌తో ‘ఆదిపురుష్‌’ను తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో విజువల్‌ గ్రాండియర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఫోకస్‌ అంతా ఈ చిత్రంపైనే. ఆయన దర్శకత్వంలో సినిమా చేసేందుకు దాదాపు బాలీవుడ్‌ అగ్రహీరోలందరూ సిద్ధమే అయినా ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో వేచిచూడాలి. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.