సునీల్ దత్ కొడుకుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt). అభినయంతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. బాలీవుడ్‌లో హీరోగా పలు సినిమాల్లో కనిపించాడు. సౌత్‌లో మాత్రం విలన్‌గా సత్తాను చాటుతున్నాడు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ‘కేజీయఫ్: చాప్టర్-2’లో అధీరాగా కనిపించి ప్రేక్షకులను అలరించాడు. ‘కెజియఫ్’ లో అతడి పాత్రకు అభిమానుల మన్ననలతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ విజయాన్ని ఎంజాయ్ చేస్తుండగానే సంజు బాబాకు మరో సౌత్ సినిమాలో విలన్ ఆఫర్ వచ్చింది. వివరాల్లోకి వెళ్లితే..
కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు దళపతి విజయ్ (Thalapathy Vijay). అతడు తాజాగా నటించిన చిత్రం ‘బీస్ట్’ (Beast). ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో స్టార్ హీరో అభిమానులందరూ ‘దళపతి-66’ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ప్రాజెక్టును స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటుంది. ‘దళపతి-66’ చిత్రీకరణ దశలో ఉండగానే ‘దళపతి-67’ వ చిత్రానికి సంబంధించిన ఓ వార్త కోలీవుడ్‌లో షికార్లు కొడుతుంది. స్టార్ హీరో విజయ్ 67వ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే ‘దళపతి-67’ మేకర్స్ విలన్ పాత్ర కోసం సంజయ్‌ను సంప్రదించారట. అతడు తన అంగీకారం ఇంకా తెలపలేదని సమాచారం. మరి ఈ చిత్రంలో సంజయ్ దత్ నటిస్తాడో, లేదో తెలియాలంటే చిత్ర బృందం ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే. గతంలో విజయ్, లోకేష్ కనకరాజ్ కలసి ‘మాస్టర్’ సినిమాకు పనిచేశారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టింది.