నాకు చేతబడి చేశారు.. అలా బయటపడ్డాను: ‘ఆదిత్య 369’ హీరోయిన్

ABN , First Publish Date - 2021-08-01T06:32:12+05:30 IST

ఏదో తెలియని వేదన వెంటాడుతూ ఉండేది. కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నానో నాకే తెలిసేది కాదు. రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశా! దీనితో ఒక జ్యోతిష్కుడికి చూపించాం. ఆయన నాకు కొందరు చేతబడి చేశారని చెప్పారు. చేతబడి చేసి ఐదేళ్లు అయిపోయిందని

నాకు చేతబడి చేశారు.. అలా బయటపడ్డాను: ‘ఆదిత్య 369’ హీరోయిన్

‘ఆదిత్య 369’, ‘డిటెక్టివ్‌ నారద’ వంటి దాదాపు 100పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మోహిని, తన జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికర విషయాలను తెలియజేశారు. తనకు చేతబడి చేశారని చెప్పినట్లుగా, తనను దేవుడు కాపాడినట్లుగా చెప్పుకొచ్చారు. ఆ విషయాలేంటో ఆమె మాటల్లోనే..


అలా.. బయటపడ్డాను!

నాకు పెళ్లి అయిన ఐదేళ్లకు అనేక మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. మంచి భర్త, కుటుంబం, హోదా, ఆస్తిపాస్తులు- అన్నీ ఉన్నాయి. కానీ ఏదో తెలియని వేదన వెంటాడుతూ ఉండేది. కొన్ని సమయాల్లో ఏం చేస్తున్నానో నాకే తెలిసేది కాదు. రెండుసార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు కూడా చేశా! దీనితో ఒక జ్యోతిష్కుడికి చూపించాం. ఆయన నాకు కొందరు చేతబడి చేశారని చెప్పారు. చేతబడి చేసి ఐదేళ్లు అయిపోయిందని.. తామేమి చేయలేమన్నారు. దేవుడే కాపాడాలన్నారు. దేవుడంటే ఎవరు? శివుడా? కేశవుడా? ఆంజనేయుడా? అమ్మవారా? - ఈ ఆలోచనతో అనేక గ్రంథాలు చదివాను. కానీ నాకు స్పష్టత రాలేదు. నాకు ఈ సమస్య రాకముందు ప్రతి రోజు అమ్మవారి పూజలు చేసేదాన్ని. వచ్చిన తర్వాత పూజలు మానేశాను. ఆలయానికి వెళ్లటం కూడా మానేశాను. దైవాన్వేషణలో తీవ్రంగా ధ్యానం చేయటం మొదలుపెట్టాను. ‘‘దేవుడంటే ఎవరు? ఆడా.. మగా? నేను దేవుడు సృష్టించిన బిడ్డను.. అలాంటి నాకు దేవుడు ఎందుకు కనబడటం లేదు?’’ లాంటి ప్రశ్నలకు సమాధానాల కోసం ధ్యానం చేసేదాన్ని. ఆ సమయంలో ఒక రోజు ధ్యానంలో క్రీస్తు కనిపించారు. 


ఒక పెద్ద ప్రళయంలో నేను కొట్టుకుపోతుంటే- ఆయన నాకేసి చూసి చిరునవ్వు నవ్వుతున్నారు. ‘నన్ను కాపాడతాడా? లేదా?’ అని ఆలోచిస్తుంటే- ఆయన ‘నిన్ను కాపాడతాను’ అన్నట్లు నవ్వారు. ఆ తర్వాత నేను నా సమస్యల నుంచి బయటపడ్డాను. ఏసుస్వామే నా దేవుడని అప్పుడే తెలిసింది. ఆ తర్వాత ఒక పాస్టర్‌ ఇంటికి వచ్చి ప్రార్థనలు చేశారు. ఆ సమయంలో నేను 13 యాసలతో మాట్లాడాను. చిత్రమేమంటే నేను మాట్లాడిన మాటలు నాకు కూడా వినిపిస్తున్నాయి.. అయినా నేను వాటిని ఆపలేకపోయాను. ఆ తర్వాత-  ‘ఈ అమ్మాయి అటువైపు వెళ్లిపోయింది. ఇక ఈ అమ్మాయిని ఏమీ చేయలేము. మాకు నిప్పులపై ఉన్నట్లుంది. ఆయన పేరు చెప్పి మమ్మల్ని పంపించేయండి’ అనే మాటలు వినిపించాయి. ‘ఆయన’ అంటే ఏసుస్వామి. ఆయన పేరు కూడా ఆ దుష్టశక్తి పలకలేకపోయింది. ఇదంతా నేను విన్నాను. అప్పుడు నాకు ‘దేవుడు ఎవరు?’ అనే విషయంపై స్పష్టత వచ్చింది. అందుకే నాకు తెలిసిన సత్యాన్ని అందరికీ పంచుతున్నాను. ప్రచారమంటే మైకు పట్టుకొని రోడ్లపై తిరగటం కాదు. మాకు తెలిసిన వారికి.. దగ్గరలో ఉన్నవారికి మాకు తెలిసిన విషయాలను వివరిస్తాం. 

Updated Date - 2021-08-01T06:32:12+05:30 IST