గత 2017లో వచ్చిన ‘అరువి’ చిత్రంలో నటించిన హీరోయిన్ అదితి బాలన్.. ఆ చిత్రంలో తన నటన ద్వారా సినీలోకాన్ని మొత్తం ఒక్కసారిగా తనవైపునకు తిప్పుకుంది. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమెను ఎన్నో అవార్డులు రివార్డులు వరించాయి. అయితే, ఈ మూవీ తర్వాత ఆమె ఎలాంటి ప్రాజెక్టులకు కమిట్ కాలేదు. కానీ, ఒక ఆంథాలజీ చిత్రంలో మాత్రం నటించింది. మధ్యలో పృథ్విరాజ్ హీరోగా వచ్చిన ఓ మలయాళ చిత్రంలో ఆమె నటించగా, ఆ మూవీ ఓటీటీలో రిలీజైంది. అంటే దాదాపు నాలుగేళ్ళ నుంచి ఆమె కోలీవుడ్‌కు దూరంగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో గత నాలుగేళ్ళుగా సినీపరిశ్రమకు దూరంగా ఉండటానికి గల కారణాలు ఏమిటని ఆమెను ప్రశ్నిస్తే.. ‘‘అరువి చిత్రం తర్వాత నేను సినీపరిశ్రమకు దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయం ఎంతోమందికి కొత్త జీవితాన్ని ప్రసాదించినట్టు. కానీ, నా వరకు ఈ గ్యాప్ అనేది చిత్ర పరిశ్రమను అర్థం చేసుకునేందుకు లభించిన ఓ మంచి అవకాశం. ఒక మార్గం కూడా. ఈ నాలుగేళ్ళ సమయంలో సినీపరిశ్రమను బాగా అర్థం చేసుకున్నా. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో కొనసాగితే నేను ఏం చేయాలో గ్రహించాను. అలాగే, సినిమాకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆకళింపు చేసుకునేందుకు ఈ సమయం ఎంతగానో దోహదపడింది’’ అని అదితి బాలన్ పేర్కొంది. ఇదిలావుంటే, ప్రస్తుతం ఈమె నవరస అనే వెబ్‌సిరీస్‌లో నటించగా, అది ఇటీవలే విడుదలైంది. దీనిని 9 మంది దర్శకులు డైరెక్ట్ చేయగా, కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు వీలుగా ప్రముఖ దర్శకనిర్మాత మణిరత్నం ఈ చిత్రాన్ని నిర్మించారు.