ఒక కసి, ఒక పిచ్చి ఉండాలి: ‘అదిరింది’ ఫేమ్‌ వేణు

ABN , First Publish Date - 2020-04-15T04:53:59+05:30 IST

కొలిమిలో ఇనుములా కాలి, ఎన్నో అనుభవాలు కూడగట్టుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకున్న సినీ నటుడు, కమెడియన్‌ వేణు. సుమారు 200 చిత్రాల్లో నటించారాయన

ఒక కసి, ఒక పిచ్చి ఉండాలి: ‘అదిరింది’ ఫేమ్‌ వేణు

కొలిమిలో ఇనుములా కాలి, ఎన్నో అనుభవాలు కూడగట్టుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకున్న సినీ నటుడు, కమెడియన్‌ వేణు. సుమారు 200 చిత్రాల్లో నటించారాయన. జీ తెలుగు ఛానల్‌లో ‘అదిరింది’ లాఫ్టర్‌ షోతో ప్రేక్షకులను అలరిస్తున్నారు వేణు. ‘నటుడవ్వాలనే బలమైన కోరిక మనలో ఉండాలి. ఒక కసితో, ఒక జీల్‌తో ఈ రంగంలోకి రావాలి, ఆ పిచ్చితో ఈ రంగంలోకి రావాలి. అప్పుడే గెలుపు మనదవుతుంది, ఎట్రాక్షన్‌తో ఈ రంగంలోకి వస్తేమాత్రం జీవితం పాడవుతుంది’ అంటున్న వేణు అంతరంగం మీకోసం.. 


కమెడియన్‌ వేణు తెలంగాణ బిడ్డ. 

అతడి తండ్రి ఎల్దండి వెంకయ్య. తల్లి మల్లవ్వ. సిరిసిల్ల పట్టణంలో ఒక రైతు కుటుంబంలో పుట్టాడు వేణు. నలుగురు కొడుకులు, ఐదుగురు కూతుళ్ళున్న సంతానంలో చివరివాడు. సిరిసిల్లా టౌన్‌లో వేణు తల్లిదండ్రులు కూరగాయల వ్యాపారం చేసేవారు.


సెపరేట్‌ ఐడెంటిటీ అంటేనే ఇష్టం

చిన్నప్పటినుంచీ (1994–95) చదువుకుంటూనే, మరోవైపు వ్యాపారం చేస్తూ రోజుకి 50–100 రూపాయలు సంపాదించేవారు వేణు. చిన్న వయసులోనే సంపాదన అలవడటంతో, చదువుమీద పెద్దగా ఆయన దృష్టి పోలేదు. సాధారణంగా రోడ్డుపక్కన వ్యాపారం చేసేవారంటే ఎవరికైనా చిన్నచూపే. కానీ ఆయన అలా వ్యాపారం చేస్తూ మూడువేల రూపాయలు సంపాదించేవారంటే ఎవరైనా నమ్ముతారా! ‘‘ఇలాంటి వ్యాపారాల్లో మనకు మనమే యజమాని. ఒకళ్ళ దగ్గర జీతగాడిగా పనిచేయడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు. ఇండివిడ్యువల్‌గా నా కాళ్ళపై నిలబడి నేను బతుకుతూ ఇతరుల్ని బతికించాలనే తత్వం నాది. అలా బాల్యం నుంచీ నాకు సెపరేట్‌ ఐడెంటిటీని ఇష్టపడేవాణ్ణి. అప్పటికీ, ఇప్పటికీ అదే నా తత్వం’’ అంటారు వేణు.


చలాకీ చిచ్చరపిడుగు వేణు

సిరిసిల్లలో పదవతరగతి వరకు చదువుకున్నారు వేణు. సహజసిద్ధ నైపుణ్యాలు జీర్ణించుకున్నవాడు. వేణు పొట్టనిండా కబుర్లే. చేతినిండా చిలిపి చేష్టలే. నోరు విప్పాడంటే, వేణు హావభావాలు, ఫేస్‌ ఫీలింగ్స్‌ చూసి ఎలాంటి వాళ్ళైనా భళ్ళున నవ్వాల్సిందే. అందుకే వేణు ఎక్కడ ఉంటే సందడి అక్కడే ఉండేది. తమ కూరగాయల మార్కెట్‌లో చిన్నప్పుడే వేణుకి ఎంతోమంది ఫ్యాన్స్‌ ఉండేవారట. అతడి కబుర్లుకోసం అందరూ సరదాగా ఎదురుచూసేవారు. ‘పుల్లూరి కిష్టయ్యసేటు, బొబ్బిలిపులి, తాండ్రపాపారాయుడు....’ ఇలా రకరకాల నిక్‌ నేమ్స్‌తో నచ్చినవిధంగా వేణుని ముద్దుగా పిలుచుకునేవారట. అలా తనకు తెలియకుండా నిత్యం తన చేష్టలతో హాస్యం పండిస్తూ, అందరినీ సంతోషంలో ముంచెత్తేవాడు. వేణు ఎక్కడ ఉంటే అక్కడ పదిమంది అతని చుట్టూ చేరేవారు అతని కబుర్లు వినడానికి. 


మార్షల్‌ ఆర్ట్స్‌ ఛాంపియన్‌

వేణు ఐదారేళ్ళపాటు మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా నేర్చుకున్నారు. 1996లో జరిగిన ఈ పోటీల్లో కామారెడ్డి ఛాంపియన్‌గా, 1997లో కరీంనగర్‌ ఛాంపియన్‌గా పోటీల్లో గెలిచారు వేణు. చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి 70–80మంది విద్యార్థులకు మార్షల్‌ ఆర్ట్స్‌ క్లాసులు కూడా చెప్పి డబ్బు సంపాదించేవారు.


బాబూమోహన్‌లా ఉంటావ్‌ అనేవారు

స్నేహితులంతా వేణులోని నటనా కౌశల్యాన్ని బాల్యంలోనే గుర్తించారు. ‘‘నువ్వు అచ్చం బాబూ మోహన్‌లా ఉంటావు, సినిమాల్లో మంచి భవిష్యత్‌ ఉంటుంది, మంచి కమెడియన్‌ అవుతావు’’ అంటూ స్నేహితులు అతడిని, అతడి టాలంట్‌ని ప్రశంసించేవారు. అలా వేణు ఆలోచనల్లో ఒక నటుడుగా జీవితాన్ని కొనసాగించాలనే దృక్పథం క్రమంగా ఊపిరిపోసుకుంది. అదే అతడిని హైదరాబాద్‌ వరకు తీసుకువెళ్ళింది. 


ఇంట్లోంచి పారిపోయాడు!

వేణూదంతా వానాకాలం చదువే. టెన్త్‌ పాసైన వేణు ఇంటర్మీడియట్‌ చదివాడుగానీ ఫెయిలయ్యాడు. మళ్ళీ పరీక్షలకు హాజరవ్వొచ్చనే విషయాన్ని కూడా వేణు పట్టించుకోలేదు. సొంత వ్యక్తిత్వంతో ఉన్నతస్థానానికి ఎదగాలనేదే ఎప్పుడూ వేణు తపన. ఇంట్లో చెబితే వెళ్ళనివ్వరనే భయంతో, సినిమాల్లో చేరి నటుడవ్వాలనే లక్ష్యంతో, సొంత నిర్ణయం తీసుకుని పారిపోయి హైదరాబాద్‌ ఇమ్లీబన్‌ బస్టాండ్‌ (ఎంజిబిఎస్‌)కు వచ్చారట వేణు. నాలుగురోజులపాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే తిరుగుతూ చేతిలో డబ్బు ఖర్చుపెట్టుకుంటూ చివరకు అన్నపూర్ణ స్టూడియోస్‌ గేటు దగ్గరకు చేరుకున్నారట. అలా నాలుగేళ్ళపాటు ఢక్కాముక్కీలు తింటూ సినిమా కష్టాలన్నీ పడ్డారు వేణు.


కలలు–ఊహలే కడుపు నింపేవి

అన్నపూర్ణ స్టూడియోస్‌ పరిసరాల్లోనే గుట్టలు, రాళ్ళమీదే కూర్చుంటూ ఆ గేటు దగ్గరే కాలక్షేపం చేసేవారట వేణు. తన భవిష్యత్‌ సినిమా జీవితంపై ఊహలతో కలలు కంటూ ఊరంతా చక్కెర్లు కొట్టేవారట. తిండి ధ్యాసే ఉండేదికాదట. ‘‘నా పిచ్చి కలలే నా కడుపు నింపేవి’’ అన్నారు వేణు. అన్నపూర్ణా స్టూడియోస్‌లో అప్పుడే పెళ్ళిపీటలు, పండగ, ఆటోడ్రైవర్‌, చూడాలని ఉంది సినిమా షూటింగులు జరిగేవి. అనధికారికంగా ఏదైనా సెట్‌లో వర్క్‌ ఉంటే వేణును పిలిచి పని ఇచ్చేవారట. అలా ఆరునెలలకు వేణు ఆలోచనలు రాటుదేలడంతో, ‘సినిమా ఇండస్ట్రీలోఉన్నవారి దగ్గర మనం పనిచేస్తే పైకి వస్తాం’ అని ఆలోచించి, కృష్ణానగర్‌లో ఒక రచయిత దగ్గర పనిచేయడం ప్రారంభించారు. ఆ రచయిత ఆడియో క్యాసెట్లు విని, అందులో ఆడియోను కాగితాలమీద అక్షరాలుగా రాయడమే ఆయన పని. అలా సినిమా కథల్ని కాగితాలపైకి ఎక్కించడం అప్పుడే అలవాటు చేసుకున్నారు వేణు. ఆ తర్వాత ఒక అసిస్టెంట్‌ డైరెక్టర్‌ దగ్గర పనిచేశారు. 


2002లో కమెడియన్‌ ‘చిత్రం శ్రీను’ దగ్గర అసిస్టెంట్‌గా చేరారు. అప్పటినుంచీ స్టూడియోల్లో, షూటింగ్‌ వాతావరణంలో తిరుగుతూ, తెరవెనుక సినిమా అంటే ఎలా ఉంటుందో, అందులో ఎన్ని విభాగాలుంటాయో గ్రహించి, ఆ తీరు తెన్నులను బాగా స్టడీ చేశారు వేణు. ఒకటో నెంబరు కుర్రోడు సినిమా దగ్గర నుంచి విష్ణు సినిమా వరకు 14 సినిమాలకు ఆయనకు అసిస్టెంటుగా పనిచేశారు. పెద్ద పెద్ద హీరోలు సహా అలీ, బ్రహ్మానందం లాంటి కమెడియన్ల హావభావాలు, నటనలో వారి వర్క్‌స్టైల్‌ బాగా గమనించేవారు. అలా రెండేళ్ళపాటు సినిమారంగంపై సంపూర్ణమైన అవగాహన పెంపొందించుకుని, తనదైన కామెడీ స్టైల్‌ నటుడయ్యారు వేణు.



తేజ ‘జై’ చిత్రంతో బోణీ కొట్టి...  

ప్రముఖ దర్శకుడు తేజ ‘జై’ చిత్రం ఆడిషన్‌కు వెళ్ళి సెలక్ట్‌ కావడంతో 2003లో వేణు నటజీవితం ప్రారంభమైంది. ఆ సినిమాలో సునీల్‌శెట్టి పాత్రలో కమెడియన్‌గా ఫేమస్‌ అయ్యారు వేణు. ఇక ఆ తర్వాత వేణు వెనుదిరిగి చూడలేదు. జై నుంచి ఇప్పటివరకు 200 సినిమాల్లో నటించారు. ఔనన్నా కాదన్నా, రణం, మున్నా, సిద్ధూ ఫ్రం సికాకుళం, పిల్ల జమిందారు, అత్తారింటికి దారేది...ఇలా ఎన్నో చిత్రాల్లో నటించి కమెడియన్‌గా తనకంటూ ఒక మంచి గుర్తింపు సంపాదించుకున్నారు వేణు. ‘మున్నా’లో టిల్లుగా, పిల్లజమిందారులో ‘బ్యాంకాక్‌’ పాత్ర ఆయనకు బాగా గుర్తింపునిచ్చాయి. ‘‘కృషి, పట్టుదల ఉంటే జీవితంలో గెలుపు మనదే, పక్కదారి పట్టకుండా లక్ష్యం దిశగా ఆలోచిస్తూ దూసుకుపోవాలి’’ అంటారు వేణు.


పాపులర్‌ కమెడియన్‌గా

ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే, మల్లెమాలగారి ‘జబర్దస్త్‌’లో నటిస్తూ బుల్లితెర ప్రేక్షకులను తన కామెడీ స్కిట్లతో నవ్వించేవారు వేణు. ‘‘చెప్పాలటే, జబర్దస్త్‌ ఒక స్వర్ణయుగం, ఏడాదిన్నరపాటు చేశాం’’ అన్నారాయన. అయితే, దానికి ముందే 2009లోనే స్నేహితుడు వెంకీతో కలిసి ప్రైవేట్ షోలు చేస్తూ సెటైరికల్‌ కామెడీ, స్టాండప్‌ కామెడీ స్కిట్లు చేసేవారు. ఈ స్కిట్లు బాగా వైరల్‌ కావడంతో ఆయనకు కమెడియన్‌గా మంచి పేరు వచ్చింది. 2011లో దాసరి హయాంలో కర్నూలు వరద బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కోసం ‘స్మోక్‌ టీవీ’ అనే కామెడీ సెటైర్లు చేశారు వేణు. అవి బాగా పేలి వైరల్ కావడంతోపాటు, ‘బృందావనం’ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌లో వేణు చేసిన కామెడీ స్కిట్లు వేలాదిమంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. అలా దశలవారీగా మంచి కమెడియన్‌గా పాపులర్‌ అయ్యారు. 


టాలెంట్‌ ఉంటే లక్షదార్లున్నాయి

‘‘మనలో నటించాలనీ, నటుడవ్వాలనీ కోరిక చాలా బలంగా ఉండాలి, ఆ లక్ష్యంతో ఒక కసితో, నటించాలనే పిచ్చితో ఈ రంగంలోకి రావాలి. అలాంటివారికి ఈ రంగంలో ఎదగడానికి ఇప్పుడు లక్షదారులు ఉన్నాయి. స్టార్‌ అవ్వాలంటే కష్టపడక్కర్లేదు. టాలెంట్‌ ఉంటే ఏ అడవిలో కూర్చున్నా, ఏ మూల కూర్చున్నా, స్మార్ట్‌ ఫోన్లో ఒక్క వీడియో పోస్టింగ్‌ చేస్తే చాలు, అది వైరల్ అయితే చాలు, కొత్తదనంతో మనదైన టాలెంట్‌ని చూపించగలిగితే చాలు, అద్భుతమైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అలా కాకుండా సినిమా మీద ఒక ఎట్రాక్షన్‌తో వస్తే మాత్రం జీవితం పాడైపోతుంది. ఒక కసితో, ఒక జీల్‌తో ఈ రంగంలోకి రావాలి. అలాంటి కసితోనే నేనూ వచ్చాను’’ అన్నారాయన. 


జీ తెలుగులో ‘అదిరింది’షో ఇంటింటికీ చేరుస్తాం 

జీ తెలుగు ఛానల్‌లో ‘అదిరింది’ లాఫ్టర్‌ షోలో కామెడీ స్కిట్లు చేస్తూ ఎంతో పాపులర్‌ అయ్యారు వేణు. ‘‘ఈ లాఫ్టర్‌ షో ద్వారా ప్రేక్షకులకు మంచి కామెడీ ఇస్తున్నాం. మా శాయశక్తులా కష్టపడుతున్నాం. ‘అదిరింది’ షో ఇంటింటికీ తీసుకువెళ్ళేందుకు కృషి చేస్తున్నాం’’ అన్నారు వేణు. ఇందులో ఉన్న ఐదు టీముల్లో ‘వేణు వారియర్స్‌’ టీమ్‌కి వేణు లీడర్‌. 


నా స్కిట్‌ చూసి పది నిమిషాలు నవ్వుకుంటే చాలు

‘‘బిజీ షెడ్యూలు జీవితం, ఒత్తిడి సమాజంలో ఉన్న మనుషుల్ని ఫ్రస్ట్రేషన్‌లోంచి బయట పడేసి, వారిని పది నిమిషాలు హాయిగా నవ్వుకునేట్టే చేస్తే చాలు, నా స్కిట్లు జనంలోకి వెళ్ళినట్టే’’ అన్నారు వేణు. నా చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలిస్తూ, వ్యక్తుల్ని పరిశీలిస్తూ, ఒక పాయింట్‌ అనుకుని, మా టీమ్‌ అంతా కూర్చుని ఎంతవరకు జనాన్ని నవ్వించగలమో, ఎంతవరకు కనెక్టు కాగలమో హావభావాలతో రిహార్సల్‌ చేసిన తర్వాతే స్కిట్లు తయారు చేస్తాను’’ అన్నారు వేణు. ఆ దేవుడి కృపవల్ల స్కిట్లకు మంచి స్పందన వస్తోంది, జడ్జీలు నాగబాబు–నవదీప్‌ల నుంచి మాకు మంచి మద్దతు లభిస్తోంది’’ అన్నారు వేణు. 


అన్నట్టు, వేణులో ఒక రచయిత కూడా ఉన్నాడు. ఆయన కామెడీ స్కిట్లు ఆయనే రాసుకుంటారు. కొన్ని సినిమాల్లో జరిగిన టీమ్‌ వర్కులో కూడా కొన్ని భాగాలకు ఆయన రచయితగా కంట్రిబ్యూట్‌ చేశారు. జైలవకుశ సినిమాలో ఒక ఫైట్‌–యాక్షన్‌ ఎపిసోడ్‌ను ఆయనే రాశారు. రుద్రమదేవి చిత్రంలో బన్ని పాత్రకు కొన్ని డైలాగ్స్‌ ఆయన రాశారు. 


కుటుంబం

2009 అక్టోబరు 26న వివాహం చేసుకున్నారు వేణు. ఆయన భార్య పేరు శ్రీలత. వారికి ఒక అబ్బాయి రేవంత్‌బాబు. మూడో తరగతి చదువుతున్నాడు. వేణు జీవితంలో ఇప్పుడు ఎంతో హ్యాపీగా సెటిల్‌ అయ్యారు. హైదరాబాద్‌ మణికొండ పంచవటి కాలనీలో సొంత ఇల్లు కూడా కట్టుకున్నారు. ఆయన తల్లిని తన దగ్గరే ఉంచుకుని ఎంతో బాగా చూసుకుంటున్నారు.

Updated Date - 2020-04-15T04:53:59+05:30 IST