కోలీవుడ్: కాలం మారుతున్న కొద్ది ట్రెండ్ కూడా మారుతోంది. అందుకే అనేక మంది బుల్లితెర నటీమణులు బిగ్‌స్ర్కీన్ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేకమంది యువ నటీమణులు బిగ్‌స్ర్కీన్‌పై హీరోయిన్లుగా రాణిస్తున్నారు. ఇలాంటి వారిలో ప్రియా భవానీ శంకర్, ఐశ్వర్య రాజేష్, వాణీభోజన్, పవిత్ర తదితరులు ఉన్నారు. వీరంతా ఇపుడు వెండితెర హీరోయిన్లుగా రాణిస్తున్నారు.
ఈ మారుతున్న ట్రెండ్‌పై నటి వాణీభోజన్ స్పందిస్తూ.. ‘‘ఇది ఓ మంచి ట్రెండ్ సెట్. మాలాంటి అనేక మంది ప్రతిభ కలిగిన నటీనటులు బుల్లితెర నుంచి బిగ్స్ర్కీన్కు రావాలి. నిజానికి సీరియల్స్ నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టే సమయంలో అనేక సవాళ్ళు ఎదురయ్యాయి. కొన్ని చిత్రాల్లో నటించేందుకు ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆగిపోయాయి. అయితే, నన్ను ప్రోత్సహించి, మంచి కథా పాత్రలు ఇచ్చిన వారిలో అశ్వత్ మారిముత్తు ఒకరు. ‘ఓ మై కడవులే’ చిత్రం నాకు మంచి గుర్తింపుతో పాటు పేరును తెచ్చిపెట్టింది. నేను నేరుగా సినీ పరిశ్రమలోకి వచ్చివున్నప్పటికీ ఈ గుర్తింపు లభించివుండేదని చెప్పలేను. బుల్లితెర ద్వారా ప్రతి ఒక్క కుటుంబంలోకి వెళ్ళాను. సత్య అనే పేరుతోనే ప్రతి ఒక్కరూ పిలుస్తున్నారు. సినిమాలు వదిలేసి మళ్ళీ టీవీ సీరియల్స్‌కు రమ్మని ఆహ్వానిస్తున్నారు’’ అని వివరించారు.