తన హావభావాలు, చురుకైన చూపులతోనే సున్నిత భావోద్వేగాలు పలికించడంలో దిట్ట ప్రియమణి. ఆమె ఏ పాత్ర పోషించినా తాజాదనంతో తొణికిసలాడుతుంది. దేశవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్న వెబ్‌సిరీస్ ఫ్యామిలీమ్యాన్లో మనోజ్ బాజ్‌పాయి సతీమణిగా నటించి, తన ప్రత్యేకముద్రను చాటుకుంది. ఆమె అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు... ఎంతో ప్రత్యేకం..
ఫ్యామిలీమ్యాన్ వెబ్ సిరీస్ నా కెరీర్‌ను మలుపు తిప్పింది. మధ్యతరగతి నడివయసు మహిళ భావోద్వేగాలు, ఆలోచనలు, ఆశలు, ఒత్తిడి, పిల్లలు, భర్త... కెరీర్ ఆందోళన... ఇవన్నీ కలగలిపిన పాత్ర నాకు సవాలు విసిరింది. మిడిల్‌క్లాస్ ఆంటీల ప్రేరణతోనే ఆ పాత్రను అంత బాగా చేయగలిగాను.
నా పాత్రలకు నేనే డబ్బింగ్ చెప్పడానికి ఆసక్తి చూపిస్తా. నాకు మళయాలం, తమిళం, తెలుగు వచ్చు. బెంగళూరులో పుట్టి పెరిగాను కాబట్టి కన్నడ కూడా మాట్లాడతాను. ఒక్క మళయాలం సినిమాలకు తప్పిస్తే మిగిలిన వాటికి డబ్బింగ్ చెబుతుంటాను. ప్రతి భాషకు ఒక భిన్నమైన సొగసు ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని సంభాషణలు చెబితే పాత్రలకు సహజత్వం అద్దవచ్చు.
కష్టపడి పనిచేయడం కూడా ఒక అభిరుచే!. ఇప్పుడంతా పోటీ ప్రపంచం. అందులో సినిమా రంగం కూడా. అయితే నేను కొత్తగా కెరీర్లోకి అడుగుపెట్టినప్పుడు ఎవరితోనూ పోటీ పడలేదు. ఏమాత్రం ఒత్తిడికి గురవ్వలేదు. హార్డ్‌వర్క్ చేస్తూనే.. నెమ్మదిగా, పరిశీలించుకుంటూ వెళ్లేదాన్ని. నిజాయితీగా కష్టపడితే ఏదో ఒక రోజు సక్సెస్ తప్పక వస్తుంది. ఈ సూత్రం ప్రతి రంగానికీ వర్తిస్తుంది. ఏ రంగంలో అయినా ఎవరితోనూ పోటీ అవసరం లేదు. నీ పని నీవు చేసుకుంటూ వెళ్లు... అనే చెబుతాను.
డ్యాన్స్ దాహం తీరనిది, చిన్నప్పటి నుంచి నృత్యం అంటే చాలా ఇష్టం. తీరిక దొరికినప్పుడల్లా డిస్కోథెక్‌లకు వెళుతుండేదాన్ని. అక్కడికి వెళ్లినప్పుడు నాలో లేని ఉత్సాహం బయటికి వస్తుంది. ఎంత ఆనందిస్తానో చెప్పలేను. ఒత్తిడి మొత్తం ఉఫ్‌మని పోతుంది. నన్ను నేను నిత్యం మెరుగు పరుచుకోవడానికి డిస్కోథెక్‌లు ఎంతో ఉపకరిస్తాయి. షూటింగ్‌ల కోసం సెట్లోకి వెళ్లినప్పుడు కూడా సులువుగా నృత్యాలు చేయడానికి వీలవుతుంది.
నాకు మసాలా దోసెలు అంటే చాలా ఇష్టం. కరకరలాడే దోసెలను చూస్తే ఉండలేను. ఒకప్పుడు బాగా తినేదాన్ని. కానీ, మా డైటీషియన్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. దాంతో తగ్గించేశాను. అయితే అప్పుడప్పుడు తింటూనే ఉంటా. ఒకేసారి మానలేం కదా!. అయితే తక్కువ నూనెతో కాల్చిన దోసెల్ని తింటున్నాను. డైట్ మీద ప్రభావం పడకుండా మితంగా తినడం అలవాటు అయ్యింది. బెంగళూరులోని ఒక హోటల్ దోసెలంటే నోరూరుతుంది.
- సామాజిక మాధ్యమాల్లో పిచ్చి పిచ్చి కామెంట్లు చేస్తుంటారు. బాడీషేమింగ్ పైన ఎవరు మాట్లాడినా కోపం వస్తుంది. సోషల్ మీడియాలో కొందరు నన్ను ఆంటీ అని, మీరు బాగా ఓల్డ్ అయ్యారనీ కామెంట్లు పెడుతుంటారు. మహిళలను గౌరవించడం తెలియదు.
- నాకు బాగా నచ్చిన వాక్యం - ప్రతి రోజూ ఎలా ఉంటే అలా జీవించండి.
- నేను సొంతంగా పైకి వచ్చాను. ఎవరి అండా లేదు. విద్యాబాలన్ వాళ్ల నాన్న, మా నాన్న కజిన్స్ అవుతారు. అయితే వాళ్లను ఎప్పుడూ కలవలేదు.
- ప్రతి ఉదయాన్నీ సంతృప్తిగా ఆస్వాదిస్తాను. చాలా ఉత్సాహాన్ని నింపుకుంటా. దక్షిణ భారతీయ ఫిల్టర్ కాఫీతో నా ఉదయం ప్రారంభమవుతుంది.
- ఒకప్పుడు మా అమ్మ భారత్ తరఫున బ్యాడ్మింటన్ ఆడింది. అందుకే నాకు కూడా ఆ క్రీడతో అనుబంధం ఏర్పడింది. లాక్డౌన్ సమయంలో ఆడాను. నెట్‌ఫ్లిక్స్‌తో కూడా కాలక్షేపం చేస్తుంటా.