నటి మీనాకు పతీవియోగం
ABN , First Publish Date - 2022-06-30T05:52:13+05:30 IST
ప్రముఖ నటి మీనాకు పతీ వియోగం కలిగింది. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో వున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి మృతి చెందారు.

ప్రముఖ నటి మీనాకు పతీ వియోగం కలిగింది. కొంత కాలంగా తీవ్ర అస్వస్థతతో వున్న ఆమె భర్త విద్యాసాగర్ (48) మంగళవారం రాత్రి మృతి చెందారు. గత ఏడాది కరోనా బారిన పడిన ఆయన.. కొవిడ్ తదనంతర సమస్యలతో సతమతమైపోయారు. ఆరు నెలలుగా నగరంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆయన ఊపిరితిత్తులతో పాటు కాలేయానికి ఇన్ఫెక్షన్ సోకింది. దీని నుంచి కోలుకుంటున్న సమయంలోనే ఆయనకు మరోమారు కరోనా వైరస్ సోకడంతో ఆస్పత్రిలోనే ఉంచి చికిత్స అందించారు. అనంతరం ఆయన దాని నుంచి కోలుకున్పప్పటికీ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ మాత్రం తగ్గలేదు. వైద్యుల సూచన మేరకు విద్యాసాగర్‌కు ఊపిరితిత్తులు, కాలేయ మార్పిడి కోసం సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందుకోసం చెన్నైతో కర్నాటక, మహారాష్ట్రలో అవయవదాతల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఈ లోపే ఆయన కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. వంతుల వారీగా అవయవమార్పిడి చేపట్టాలని వైద్యులు రకరకాలుగా ప్రయత్నించారు. అయితే ఆయన బ్లడ్‌గ్రూ్‌పకు సంబంధించిన దాత అవయవాలు దొరకలేదు. ఆఖరికి తమిళనాడు ప్రభుత్వం రంగంలోకి దిగి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. మంగళవారం రాత్రి విద్యాసాగర్ తుదిశ్వాస విడిచారు. విద్యాసాగర్ - మీనా దంపతులకు కుమార్తె నైనిక వుంది.
పావురాళ్ళ మలమూత్ర విసర్జనలు కారణమా?
బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త విద్యాసాగర్ అక్కడి తన నివాసం పక్కనే పావురాళ్ళను పెంచేవారు. అవి విసర్జించే మలమూత్రాల కారణంగా ఆయన ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువైనట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో శ్వాస పీల్చడంలో తీవ్ర ఇబ్బందిపాలైన విద్యాసాగర్.. కొన్ని రోజులుగా చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. అక్కడే ఆయనకు ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు.
తారల కన్నీటి అంజలి
నటి మీనా భర్త విద్యాసాగర్ మృతి వార్త కోలీవుడ్‌లో తీవ్ర విషాదం నింపింది. ఈ మరణవార్త తెలియగానే అనేక మంది సినీ ప్రముఖులు స్థానిక సైదాపేటలోని శ్రీనగర్ కాలనీలో ఉన్న మీనా ఇంటికి వెళ్ళి విద్యాసాగర్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ విద్యాసాగర్ భౌతికకాయంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. మీనాను, ఆమె ఏకైక కుమార్తెను ఓదార్చారు. అలాగే, హీరో శరత్ కుమార్, ఖుష్బూ, సుందర్.సి, ప్రభుదేవా, కేఎ్‌స.రవికుమార్, ప్రీతి విజయకుమార్, రంభ దంపతులు, స్నేహ, విజయకుమార్ కుటుంబ సభ్యులు, చేరన్, మన్సూర్ అలీఖాన్, సీనియర్ నటి లక్ష్మి, సంగీత వంటి అనేక మంది ప్రముఖులు అంజలి ఘటించారు. విద్యాసాగర్ భౌతికకాయానికి అంత్యక్రియలు బుధవారం స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో ముగిశాయి.
స్వయంగా భర్త అస్థికలు తీసుకెళ్లిన మీనా
తన భర్త విద్యాసాగర్ అంత్యక్రియల్లో పాల్గొన్న మీనా.. శ్మశానవాటికలో రెండు గంటలపాటు వేచివుండి, అస్థికలతో ఇంటికి పయనమయ్యారు. సిబ్బంది నుంచి అస్థికల్ని స్వయంగా అందుకున్నారు. ఆ అస్థికల బాక్సును జాగ్రత్తగా పొదివి పట్టుకుని కారులో ఇంటికి బయలుదేరివెళ్లారు. మీనా వెంట ఆమె స్నేహితులైన నటీమణులు సంఘవి, సంగీత తదితరులు ఉన్నారు.