నాకు జలుబు చేస్తే ఎన్టీఆర్‌గారు ఏం చేసేవారంటే..: జయప్రద

జయప్రద, జయసుధ, జయచిత్ర.. ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమను ఏలిన జయత్రయం. అందంలోనూ, అభినయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. వీళ్లలో జయప్రదకు ఆ రోజుల్లో ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండేది. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన జయప్రద హిందీ ఫీల్డ్‌కు వెళ్లి అక్కడ కూడా అగ్రకథానాయికగా వెలిగారు. అయితే అప్పటి స్టార్‌ హీరోలతో తనకు ఎటువంటి అనుబంధం ఉండేదో.. తన విషయంలో వారు ఎలా కేర్‌ తీసుకునేవారో జయప్రద చెప్పుకొచ్చారు.

‘‘నేను స్కూలు నుంచి 9వ తరగతిలోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చా. నన్ను చూసిన తిలక్‌గారు ‘భూమికోసం’ అడిగారు. అప్పట్లో ఎన్టీఆర్‌ అంటే పిచ్చి ప్రేమ ఉండేది. కానీ నేను ఎప్పుడూ ఎవరి ఆటోగ్రాఫ్‌లూ తీసుకోలేదు. చిన్నతనం నుంచి నాకు చాలా సిగ్గు ఉండేది. డాక్టర్‌ కావాలనుకున్నా. కానీ ఆర్టిస్ట్‌ అయ్యా. అనర్గళంగా సినిమాలో ఏ డైలాగ్‌ అయినా చెప్పాలి. ఎలాంటి వారితోనైనా అనర్గళంగా మాట్లాడాలి. నాకు అవన్నీ కుదిరేవి కావు. ప్రతిదీ నాకు విరుద్ధంగా ఉండే అట్మాస్ఫియర్‌. భగవంతుడు నా పట్ల చాలా దయతో వ్యవహరించేవాడు. నా లెర్నింగ్‌ ప్రాసెస్‌ చాలా ఇంటెన్సివ్‌గా ఉండేది. బాలచందర్‌గారుగానీ, విశ్వనాథ్‌గారుగానీ, బాపుగారు, దాసరిగారు, రాఘవేంద్రరావుగారుగానీ అందరూ నన్ను అర్థం చేసుకున్నవారే. వాళ్లు నన్ను ట్రైన్‌ చేశారు. చంటిబిడ్డకు నడక ఎలా నేర్పుతారో అలా నేర్పారు. నేను ప్రతిదీ వాళ్ల దగ్గర నేర్చుకున్నా. ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకోవడం కన్నా, అంతకు మించిన అనుభవం ఉన్నవారితో నేను పనిచేయడం చాలా గొప్ప. నాగేశ్వరరావుగారుగానీ, ఎన్టీఆర్‌గానీ, రాజ్‌కుమార్‌గారుగానీ.. అందరూ నాకు తండ్రి సమానులు. నాకు 14 ఏళ్లప్పుడు వాళ్లకు 50 ఏళ్లుండేవి. వాళ్లు నన్ను అంత చిన్నపిల్లలాగానే చూసేవారు. నాకు ఎప్పుడైనా జలుబు వస్తే ఎన్టీఆర్‌గారి ఇంటినుంచి తారకంగారు నాకు శొంఠి పాలు పంపేది. ఎన్టీఆర్‌గారు ఎప్పుడూ సెట్లో యాపిల్‌ జ్యూస్‌ తాగేవారు. తప్పకుండా నా చేత తాగించేవారు. చాలా తక్కువ తినేదాన్ని. అయినా నా మీద ఎంతో కేర్‌ తీసుకునేవారు. అమితాబ్‌గారు పెద్ద ఇన్‌స్టిట్యూషన్‌. ఆయన నన్ను పక్కన కూర్చోపెట్టుకుని హిందీ డైలాగులు నేర్పేవారు. ఆయన స్టూడెంటా? నేను స్టూడెంటా? అన్నట్టుండేది. అలా నేను ‘షరాబ్‌’ చేశాను. తమిళ్‌, కన్నడ, మలయాళం చేసినప్పుడు కూడా మమ్మట్టి, లాల్‌, రాజ్‌కుమార్‌గారు... ఇలా అందరూ సన్నిహితంగా ఉండేవారు. శోభన్‌బాబుగారు నన్ను అత్తా, అత్తా అనేవారు. అల్లుడికీ, అత్తకూ ఉన్న ఇంటిమసీ మా మధ్య ఉందని అర్థం చేసుకోవాలి మీరు. నాకు ఎప్పుడూ హీరోలంటే భయం ఉండేది కాదు. అంతులేని కథ చేసినప్పటి నుంచి బాలచందర్‌గారంటే నాకు, కమల్‌, రజనీకాంత్‌గారికి గానీ చాలా భయం. ఆయన్ని పులిలా చూసేవాళ్లం. ఆయన చాలా సీరియస్‌గా ఉండేవారు. ఆయన ఎప్పుడు సెట్లో ఉన్నా మేం చాలా గౌరవించేవాళ్లం. ఆయన ఎప్పుడు కనిపించినా మేం ఆయన కాళ్లకు దణ్ణం పెట్టేవాళ్లం. ఆయన సెట్లో ఉన్నప్పుడు మేం నిలుచునే ఉండేవాళ్లం. ఇప్పుడు యంగర్‌ జనరేషన్‌లో అది ఉండటం లేదు..’’ అని జయప్రద తెలిపారు. 

-వినాయకరావు 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.