ఎంత ఏడిస్తే... అంత బాగా నవ్విస్తారు!

Twitter IconWatsapp IconFacebook Icon
ఎంత ఏడిస్తే... అంత బాగా నవ్విస్తారు!

పంచ్‌ని పతంగులా ఎగరేసినవాడు సునీల్‌. నవ్వుల్ని నయాగరాలా కురిపించిన వాడు సునీల్‌. ఒకప్పుడు వెండి తెరపై కామెడీ రైట్స్‌ అన్నీ తన పేరుమీదే రాయించేసుకున్నాడు. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నప్పుడే.. హీరోగా ‘టర్న్‌’ ఇచ్చుకున్నాడు. అక్కడ కూడా హిట్లు  కొట్టి, సక్సెస్‌ రుచి చూశాడు. ఇప్పుడు మళ్లీ తన పాత రూటులోకి వచ్చేసి నవ్వించడమే పనిగా పెట్టుకొన్నాడు. ‘పుష్ప’లో విలనిజం చూపించి ‘నాలో ఇంకా చాలా కోణాలు బాకీ ఉన్నాయ్‌..’ అనే సంకేతాలు పంపాడు. ఇప్పుడు ‘ఎఫ్‌ 3’లో వింటేజ్‌ సునీల్‌ని చూస్తారు అని ధీమాగా చెబుతున్నాడు సునీల్‌. తనని ‘నవ్య’ మాటల్లో దింపితే..


మీ సొంతూరు భీమవరం అంటే చాలా ఇష్టం కదా..? ఎప్పుడైనా ఓ అర్థరాత్రి... భీమవరం గుర్తొచ్చి.. వెంటనే వెళ్లిపోవాలనిపించిందా?


చాలాసార్లు అనిపించిందండీ. ఎవరికైనా వాళ్ల సొంతూరంటే మమకారం ఎక్కువగా ఉంటుంది. నాకు ఇంకాస్త ఎక్కువ. నా సొంతూర్ని బాగా పాపులర్‌ చేయాలన్న ఉద్దేశ్యంతోనే నా సినిమాకి ‘భీమవరం బుల్లోడు’ అనే పేరు పెట్టుకొన్నా.  ‘అమెరికాలో కూడా ‘భీమవరం బుల్లోడు’ పోస్టర్‌.. పడాలి.. నా ఊరి గురించి మాట్లాడుకోవాలి..’ అనుకుని పెట్టిన టైటిల్‌ అది. అంతకంటే ఏం కావాలి..? నా అదృష్టం ఏమిటంటే... భీమవరం గుర్తొచ్చినప్పుడల్లా.. ఏ రాజమండ్రిలోనో, కడియంలోనో షూటింగ్‌ పడేది. అక్కడకు వెళ్లాక ఆగుతామేంటి? వెంటనే భీమవరం వెళ్లిపోయి ఓ రౌండ్‌ వేసి వచ్చేవాడ్ని.


భీమవరంలో అడుగుపెట్టగానే ఏం గుర్తొస్తాయి?

ఒకటా, రెండా..? నా బాల్యం, యవ్వనం అంతా గుర్తొచ్చేస్తుంది. ఈ థియేటర్‌ముందే కదా నిలబడి.. ఖైది నెం.786 టికెట్ల కోసం ఎదురు చూసేవాడ్ని. ఇక్కడే కదా.. ‘బాబాయ్‌.. కలర్‌ సోడా.. కొట్టు.. డబ్బులు రేపిస్తా..’ అనేవాడ్ని.. ఇక్కడే కదా.. ఫ్రెండ్స్‌తో బాతాఖానీ కొట్టేవాడ్ని...అనుకుంటుంటా. భీమవరంలోని ప్రతీ సందులోనూ.. నాకంటూ కొన్ని వందల కథలుంటాయి. అక్కడ మాకు కొన్ని పొలాలు, ఆస్తులు ఉన్నాయి. అవన్నీ నా చిననాటి జ్ఞాపకాల కోసం దాచుకున్న అపురూపమైన సంపద అనిపిస్తుంది.


సునీల్‌ బాగా నవ్వుతాడు.. బాగా నవ్విస్తాడు.. మరి సునీల్‌కి కన్నీటి గురించి తెలుసా?

నాకంటే ఎవడికీ ఎక్కువ తెలీదండీ. అవన్నీ లోలోపల దాచేసుకునే కమెడియన్‌ని అయ్యా. నేననేంటి? చార్లి చాప్లిన్‌ నుంచి బ్రహ్మానందం వరకూ ప్రతి హాస్య నటుడి జీవితంలోనూ ఎన్నో విషాదాలుంటాయి. వాళ్లు ఎంత ఏడిస్తే.. అంత బాగా నవ్విస్తారు. దేవుడు ప్రతి మనిషికీ బాధనీ, కన్నీళ్లనీ ఇస్తాడు. వాటిని మర్చిపోవడానికి జనం థియేటర్లకు వస్తారు. మేం.. నవ్విస్తూ, వాటిని మర్చిపోయేలా చేస్తాం.. ‘నేను వాడ్ని  ఏడిపిస్తే.. నువ్వు మరిపిస్తావా..’ అని దేవుడికి కోపం వస్తుండొచ్చు. అందుకే మాకంటూ కొన్ని కన్నీళ్లని ఇవ్వకుండా పోడు.


కెమెరా ముందు నవ్విస్తూనే ఉంటారు కదా.. ఇంట్లో ఏంటి పరిస్థితి? ప్రపంచం కోసం కామెడీ చేస్తారు... మా దగ్గరెందుకు సీరియస్‌గా ఉంటారు? అని కంప్లైంట్లు చేస్తుంటారా?


సెట్లో స్ర్కిప్టు ప్రకారం కామెడీ చేయాల్సిందేనండీ. లేదంటే పాత్రకు న్యాయం చేయలేం. లోపల ఎంత బాధ ఉన్నా.. అవన్నీ మర్చిపోయి తెల్లకాగితంలా మారిపోవాలి. బయటకొచ్చాక... ఎవరెవరో ఎదురవుతారు. వాళ్లందరి ముందూ మన ఫస్ర్టేషన్‌ని బయటపెట్టలేం. అక్కడ కూడా నవ్వు పూసుకోవాలి. ఒక్క ఇంట్లోనే మనం మనలా ఉంటాం. అక్కడ కూడా పంచ్‌లేయాలంటే మన వల్లకాదండీ బాబూ. సాధారణంగా ఇంట్లో కూడా జోవియల్‌గా ఉండడానికే ప్రయత్నిస్తా. ప్రతీసారీ అది సాధ్యం కాదు కదా..? ఒకటి చెప్పనా... ‘మనం ఎలా ఉన్నా.. ఈ బంధం విడిపోదు..’ అనే నమ్మకం ఉన్న చోట మాత్రమే మనం మనలా ఉంటామండీ. అందుకే ఇంట్లో మాత్రం నాకు నచ్చినట్టు, ఆ పూట ఎమోషన్‌కి తగ్గట్టుగా ఉంటా. అప్పట్లో బంతిలా గుండ్రంగా ఉండేవారు. ఆ తరవాత సిక్స్‌ప్యాక్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. శరీరాన్ని కొవ్వొత్తిలా కరిగించారు. ఇంత కష్టపడ్డాక కూడా.. ‘లావుగా ఉన్నప్పుడే సునీల్‌ బాగుండేవాడు..’ అనే కామెంట్లు కొన్ని వినిపించాయి. అలాంటప్పుడు ఏమనిపించింది?

నిజమేనండీ. నా దగ్గర కూడా చాలామంది ఈ విషయమే చెప్పారు. ఇందులో నేను వాళ్లని తప్పుబట్టను. ఎందుకంటే... నన్ను వాళ్లు అలా ఉన్నప్పుడు ఇష్టపడ్డారు కాబట్టి, నా అవతారం మారేసరికి ఎడ్జస్ట్‌ అవ్వలేకపోయారేమో..? కానీ ఒక్కటి మాత్రం నిజం. సిక్స్‌ ప్యాక్‌ చేసి, సన్నబడడం వల్ల నాలో కాన్ఫిడెన్స్‌ చాలా పెరిగింది. ఇప్పటికీ నేను పాత్రకు తగ్గట్టుగా మారిపోగలను. ‘ఎఫ్‌ 3’లాంటి పాత్ర వచ్చిందనుకోండి. అప్పటి బంతిలా గుండ్రంగా కనిపిస్తాను. ‘పుష్ప’లో విలన్‌ పాత్ర ఇచ్చారనుకోండి.. బొజ్జ పెంచుకుని నటించగలను. పోలీస్‌ ఆఫీసర్‌ అనుకోండి.. మళ్లీ బాడీ పెంచి, కండలు చూపించగలను.


మీలో రచయిత కూడా ఉన్నాడా?

అబ్బే లేదండీ. స్పాట్‌లో ఏమైనా మార్పులూ చేర్పులూ చెబుతా. అది కూడా పాత్రకు సూటవుతుంది అనిపిస్తేనే. అంతేగానీ.. ‘ఇప్పుడో కావ్యం రాద్దాం..’ అని కూర్చుంటే అక్షరం కూడా ముందుకు కదలదు. 

నిజానికి సినిమాల్లో కంటే బయటే ఎక్కువ కామెడీ ఉంటుంది. గోదారి జిల్లాలకు వెళ్లి, కాసేపు మనుషుల మధ్య తిరిగామనుకోండి. ‘మనుషులు ఇంత ఎటకారం చేసుకుంటారా’ అనిపిస్తుంది. అందులో కొంచెమైనా తెరపైకి తీసుకొస్తే చాలు.


కామెడీలో మార్పులేమైనా వచ్చాయా?

ఇప్పుడంతా సెటిల్డ్‌ కామెడీ, నేచురల్‌ కామెడీ అంటున్నారు కానీ... కామెడీ ఎప్పుడూ ఒకేలా ఉంటుందండీ. అది ప్రాంతాన్ని బట్టి మారిపోతుంది. కామెడీ అనే కాదు. ఏ ఎమోషన్‌ అయినా అంతే. మన సినిమాల్లో ఎవరైనా చనిపోతే.. ఓవర్‌  ఎమోషన్‌ అయిపోయి.. కుళ్లి కుళ్లి ఏడుస్తాం. ఇవే సినిమాలు హాలీవుడ్‌ వాళ్లు చూశారనుకోండి. ‘ఏంటీళ్లు ఓవరాక్షన్‌ చేస్తున్నారు.. వాళ్లకేమైనా సైకలాజికల్‌ ప్రాబ్లమ్‌ ఉందా..’ అన్నట్టు చూస్తారు. కానీ అది మనకు నేచురల్‌గా అనిపిస్తుంది. కామెడీ కూడా అంతే.


‘ఎఫ్‌ 3’ ఎలా ఉండబోతోంది?

పేరుకి తగ్గట్టుగా ‘ఫన్‌’ మూడు రెట్లు ఉండబోతోంది. ఇంతమంది హాస్యనటుల్ని తెరపై చూడడం ఈమధ్య కాలంలో ఇదే మొదటిసారి. అనిల్‌ రావిపూడి చాలా బాగా హ్యాండిల్‌ చేశాడు. తన దర్శకత్వంలో నటించాలని ఎప్పటి నుంచో అనుకునేవాడ్ని. ఈ మాటే తనతో చెప్పా. ‘భలేవారండీ.. ‘సొంతం’ సినిమాలో మీ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. బయట కూడా మీ బాడీ లాంగ్వేజ్‌లోనే మాట్లాడేవాడ్ని. మనం చేద్దాం’ అన్నాడు. అన్నట్టుగానే... ‘ఎఫ్‌ 3’లో మంచి పాత్ర ఇచ్చాడు. ఈ సినిమాలో వింటేజ్‌ సునీల్‌ని చూస్తారంతా.


అనిల్‌ రావిపూడిలో మీకు బాగా నచ్చిన అంశం ఏమిటి?

తను ఆల్‌రౌండర్‌ అండీ. తనకు అన్నీ వచ్చు. స్కూలు రోజుల్లో స్టేజీపై డాన్సులు చేసి వచ్చిన బ్యాచ్‌. ‘ఇలా చేయండి చాలు..’ అని చేసి చూపించగలడు. తనతో పని చేయడం ఎవ్వరికైనా చాలా కంఫర్ట్‌. ఇంతమంది హాస్య నటుల్ని మేనేజ్‌ చేయడం అంటే మాటలు కాదు. సెట్లో ఎంత ఒత్తిడి ఉన్నా, అది తానొక్కడే నెత్తిమీద వేసుకుని అందరినీ కంఫర్ట్‌ జోన్‌లో ఉంచేవాడు.


డబ్బు లెక్కలు నాకస్సలు తెలీవు. ఈ విషయంలో నన్ను చాలా ఈజీగా మోసం చేసేయొచ్చు. బాత్‌రూమ్‌ కట్టించడానికి దిగాననుకోండి. ఈజీగా కోటి రూపాయలు బిల్లేసి ఇచ్చేస్తారు. నా వాలకం అలా ఉంటుంది. నాకు హ్యూమన్‌ ఎమోషన్స్‌ అంటే ఇష్టం. వాటికే తేలిగ్గా లొంగిపోతా.


‘‘నేనిప్పుడు నా కెరీర్‌ని ప్లాన్‌ చేయడం మానేశాను. ఎందుకంటే నేనేం ప్లాన్‌ చేసినా ఫ్లాపే. కెరీర్‌ నాకోసం ఏం ప్లాన్‌ చేసిందన్నదే గమనిస్తున్నా. నా దగ్గరకు వచ్చిన పాత్రని చేస్తున్నా. ఆ పాత్రకు ఎంత వరకూ న్యాయం చేయగలను అనేది మాత్రమే ఆలోచిస్తున్నా. హీరోగా చేయమన్నా ఓకే. హీరోకి బాబాయ్‌గా, మావయ్యగా నటించమన్నా ఓకే. హీరోయిన్‌కి తండ్రిగా వేస్తావా? అని అడిగినా నేను రెడీనే. నేనొక తెల్లకాగితంలా మారిపోయాను. ఎవరికి ఇష్టమొచ్చిన పాత్రని వాళ్లు రాసుకోవచ్చు’’.


‘‘ఎన్ని జోనర్లయినా రానివ్వండి.. ఎన్ని రకాల సినిమాలైనా తీయనివ్వండి. కానీ వాటిలో కామెడీ సినిమాల వాటా ఎక్కువ ఉండాలని కోరుకుంటా. ఓ హాస్య నటుడిగా ఇది నా స్వార్థం అనుకోవచ్చు. కానీ... మనిషిగా ఆలోచిస్తే, నవ్వుకు మించిన మందులేదు. అదో సర్వరోగ నివారిణి. కాసేపు హాయిగా నవ్వుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని డాక్టర్లు అంటారు. అది నిజం కూడా. దైనందిన జీవితంలో ప్రతి మనిషీ ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నాడు. వాళ్లకు ఊరటనిచ్చేవి వినోదాత్మక సినిమాలే’’


అన్వర్‌

AJ Youtube channels bg ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

మీకు తెలుసా !..Latest Telugu Cinema Newsమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.