‘లౌక్యం‌’కి ఆ గిఫ్ట్ ఇచ్చారు.. ‘చెక్‌’కి అంతకంటే పెద్దది: సంపత్ రాజ్

ABN , First Publish Date - 2021-02-26T03:34:23+05:30 IST

సంపత్ రాజ్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తో

‘లౌక్యం‌’కి ఆ గిఫ్ట్ ఇచ్చారు.. ‘చెక్‌’కి అంతకంటే పెద్దది: సంపత్ రాజ్

సంపత్ రాజ్... తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు. ఎన్నోవిజయవంతమైన చిత్రాల్లో నటించిన ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ భవ్య క్రియేషన్స్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. సంపత్ రాజ్ కెరీర్ ప్రారంభంలో 'లౌక్యం' చిత్రంలో మంచిపాత్ర ఇచ్చి భవ్య క్రియేషన్స్ ప్రోత్సహించింది. ఈ సంస్థలో ఆయన నటించిన తాజా చిత్రం 'చెక్'. యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (ఫిబ్రవరి 26న) విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సంపత్ రాజ్ మీడియాతో ముచ్చటించారు.


'చెక్' సినిమా ఎలా ఉండబోతుంది? సినిమా గురించి ఏం చెబుతారు?

మంచి కథతో రూపొందిన చిత్రమిది. జైలులో ఓ ఘటన జరిగిన తర్వాత ఏమైందనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సినిమాలో ఎక్కువ శాతం హీరో ఒకే కాస్ట్యూమ్‌లో కనిపిస్తారు. రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండాలో.. అంత దగ్గరగా ఉంటుందీ సినిమా.‌ చాలా చాలా బాగుంటుంది.


ఇప్పటివరకు మీరు నటించిన సినిమాల్లో 'చెక్' భిన్నమైన సినిమా అనుకోవచ్చా?

అవును. తెలుగులో నేను నటించిన సినిమాల్లో భిన్నమైనది ఇదే. సినిమాలో ఎక్కువ లోకేషన్స్ ఉండవు. ఎక్కువ సన్నివేశాలు జైలులో జరుగుతాయి. షూటింగ్ చేసేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే... నిజ జీవితంలో ఓ ఖైదీ జైలులో ఎలా ఉంటాడు? జైలుజీవితం ఎలా ఉంటుంది? అనేది చూశా. పదేళ్లు, ఇరవై ఏళ్ళు జైలులో అలా ఉండాలంటే ఎలా ఉంటుంది? ఈ సినిమా చేయడం ద్వారా ఖైదీ జీవితాన్ని చూశా. అది కాకుండా దర్శకుడు ఆ ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకువెళతారు. అది హండ్రెడ్ పర్సెంట్ పక్కా. నాకు నమ్మకం ఉంది. 


ఈ సినిమాలో కూడా పోలీస్‌గా చేశారు.. నితిన్ లాస్ట్ సినిమా 'భీష్మ'లో కూడా మీరు పోలీస్‌గా చేశారు కదా!

'భీష్మ'లో నేను పోలీస్ అయినప్పటికీ... అందులో నా క్యారెక్టర్ లో ఎక్కువ ఫన్ ఉంటుంది. దానికి, ఈ సినిమాలో నా క్యారెక్టర్ కి అసలు సంబంధం ఉండదు. రెండు డిఫరెంట్ రోల్స్. పోలిక ఏమీ ఉండదు. 


'చెక్'లో మీ పాత్ర గురించి..?

హీరో మీద పగ ఉంటుంది. ప్రతీకారంతో హీరోకి ఉరిశిక్ష పడాల్సిందే, ఉరి అమలుకావాల్సిందే అనే లక్ష్యంతో ఉంటాడు. అతని జీవితంలో మరో అంశం ఉరి పడిందా? లేదా? అన్నది సినిమా. చంద్రశేఖర్ యేలేటి గారు కథ చెప్పినప్పుడు విజువల్ గా ఆపాత్రలో నన్ను ఊహించుకున్నా. నాకు డిఫరెంట్ రోల్, డిఫరెంట్ పోలీస్ పాత్ర అని అర్థమైంది.


'భీష్మ', 'చెక్' కంటే ముందు కూడా మీరు పోలీస్ రోల్స్ చేశారు. పోలీస్ అంటే సంపత్.. సంపత్ అంటే పోలీస్.. అంతేనా?

(నవ్వుతూ)... ఇప్పుడు 'ఎఫ్3'లో కూడా పోలీస్‌గా చేస్తున్నాను. నేను ఏం చేయాలి అనుకుంటున్నానంటే... తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు ఓ లెటర్ రాస్తాను. 'నాకు పెన్షన్ ఇవ్వండి' అని. ఎక్కువసార్లు పోలీస్ గా నటిస్తున్నాను కదా! అలాగే, 'పోలీస్‌ కమీషనర్, ఐజీ డ్రస్ లు నేనే కుట్టించుకుంటా' అని. పోలీస్ క్యారెక్టర్ అంటే దానికి తగ్గ డ్రస్ నేనే వేసుకుని షూటింగ్‌కి వెళ్తా. పెన్షన్ మాత్రం తప్పకుండా అడుగుతా. (నవ్వులు)


దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గురించి?

ఆయన గురించి చెక్ చేయడానికి ముందే నేను విన్నాను. నేను రామోజీ ఫిల్మ్ సిటీలో వేరే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు ఈ సినిమా కథ చెప్పడానికి ఆయన వచ్చారు. పదినిమిషాలు నా క్యారెక్టర్ గురించి వివరించారు. ఈలోపు మేం ఫ్రెండ్స్ అయ్యాం. సినిమాలు కాకుండా చాలా విషయాల గురించి డిస్కస్ చేసుకున్నాం. దర్శకుడిగా ఆయన ప్రతిభ గురించి అందరికీ తెలుసు. 


భవ్య క్రియేషన్స్, సంపత్ రాజ్... సక్సెస్ ఫుల్ కాంబినేషన్!

మా కాంబినేషన్ లో 'లౌక్యం' సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా అంత కంటే పెద్ద హిట్ అవ్వాలి. ఆనంద ప్రసాద్ గారు, అన్నే రవిగారు నా ఫ్యామిలీ. భవ్య క్రియేషన్స్ నా హోమ్‌ ప్రొడక్షన్‌ కింద భావిస్తా. ‘లౌక్యం’ హిట్ తర్వాత సక్సెస్ టూర్ లో కోన వెంకట్ గారు ఓ మాట చెప్పారు. సినిమా సక్సెస్ తర్వాత కనీసం ఒక యాపిల్ కూడా ఇవ్వరు. కానీ, ఆనందప్రసాద్ గారు యాపిల్ ఐ ఫోన్ ఇచ్చారు అని. కచ్చితంగా ఈ సినిమా ‘లౌక్యం’ కంటే పెద్దహిట్ అవుతుంది. ఐ ఫోన్ కంటే పెద్ద గిఫ్ట్ అడగాలి. 


'లౌక్యం'లో నటించిన రకుల్ కూడా ఈ సినిమాలో నటించారు. ఆమెతోనూ మీది సక్సెస్‌ఫుల్‌ కాంబినేషనేగా?

రకుల్‌కి బ్రదర్‌గా నటించాను. తనకు తండ్రిగా నటించాను. తనకు కొలీగ్‌గా చేశా. ఆ అమ్మాయితో కూడా నాది సక్సెస్ ఫుల్ కాంబినేషన్. ఈ సినిమాతో మరోసారి అది ప్రూవ్ అవుతుంది.


'చెక్' చూశారా?

లేదు. కానీ, కథంతా తెలుసు. క్లైమాక్స్ చాలా బాగుంటుంది. నాకు అది బాగా నచ్చింది. ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటుంది. ఒకటి జరుగుతుందని ఊహిస్తారు. చూస్తే... అది కాదు, మరొకటి జరుగుతుంది. విజువల్స్ షాక్ ఇస్తాయి. దర్శకుడి ఇంటిలిజెన్స్‌ క్లైమాక్స్ లో ప్రేక్షకులకు తెలుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ లో టర్న్ అండ్‌ ట్విస్ట్‌లు అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులు అందరూ సినిమాని థియేటర్‌లో చూడండి. ఒక మంచి సినిమా చూసిన అనుభూతి పొందుతారు. 

Updated Date - 2021-02-26T03:34:23+05:30 IST