జన్యుమార్పిడి పదార్థాల వ్యతిరేక ఉద్యమానికి ఆ హీరో మద్దతు

జన్యుమార్పిడి ఆహార పదార్థాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఆన్‌లైన్‌ ప్రచార ఉద్యమానికి హీరో కార్తీ మద్దతు ప్రకటించారు. ఈ ఉద్యమానికి అనుకూలంగా కార్తీ ఆన్‌లైన్‌ సిగ్నేచర్‌ చేశారు. ఈ సందర్భంగా జన్యు మార్పిడి, జన్యుమార్పిడి ఆహార పదార్థాల వల్ల కలిగే నష్టాలను ఆయన వివరిస్తూ ఓ ట్వీట్‌ చేశారు. ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతివ్వాలని ఆయన కోరారు. 


‘‘ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ జన్యుపరంగా మార్పు చేసి, జన్యుపరంగా అభివృద్ధి చేసిన ఆహారపదార్థాలపై ఉన్న నియంత్రణతో పాటు నిబంధనలను మార్చబోతుంది. ఈ నిర్ణయం వల్ల అలాంటి ఆహార పదార్థాలు మన జీవితాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జన్యుపరంగా అభివృద్ధి చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల అలెర్జీ, రోగనిరోధక శక్తి లోపించడం, పెరుగుదల మందగించడం, అవయవ లోపం, పునరుత్పత్తిపై తీవ్ర ప్రభావం, కేన్సర్‌ వంటి అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని గుర్తించారు. ప్రపంచంలోని అనేక ప్రపంచ దేశాలు ఈ జన్యుమార్పిడి ఆహార పదార్థాలను తీవ్రంగా వ్యతరేకిస్తున్నాయి. అయితే పలు బహుళజాతి సంస్థలకు తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ పర్యావరణం, ఆరోగ్యం సురక్షితంకాదని భావిస్తున్నందున జన్యు మార్పిడి పంటలకు మన దేశంలో అనుమతించ లేదు. గతంలో జన్యుమార్పిడి చేసిన బీటీ వంకాయ, జీఎం ఆవాలు వంటివి ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో ఫుడ్‌ సేఫ్టీ నిబంధనలను సడలించి జన్యు మార్పిడి ఆహార పదార్థాలను మన దేశంలోకి ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావడం లేదు. ఇలాంటి పదార్థాలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలి. ఇందుకోసం సాగుతున్న ఆన్‌లైన్‌ సిగ్నేచర్‌ ప్రచారానికి ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలి’’ అని హీరో కార్తీ కోరారు. 

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.