భానుమతి అహం దెబ్బతింటే?

హీరో కృష్ణ నిర్మించిన ‘పండంటి కాపురం’ చిత్రంలో రాణీ మాలినీదేవి పాత్ర చాలా కీలకమైనది. అహంభావం కలిగిన ధనిక యువతిగా ఆ పాత్రలో జమున అద్భుతంగా నటించారు. నిజం చెప్పాలంటే మొదట ఈ పాత్రకు అనుకొన్నది జమునను కాదు.. భానుమతిని. ఆవిడతో కృష్ణ మాట్లాడితే ఒప్పుకొన్నారు కూడా. కొన్ని రోజులు కథా చర్చల్లోనూ భానుమతి పాల్గొన్నారు. అయితే  ఆవిడతో కృష్ణ సినిమా తీస్తున్నారనే విషయం తెలియగానే నిర్మాత ఎస్‌.భావనారాయణ హడావిడిగా వచ్చి ‘భానుమతి అంటే ఎవరనుకున్నావు? ఆటంబాంబు. ఆవిడతో షూటింగ్‌ అంటే మాటలుకాదు. విజయావారి వల్లే కాలేదు. కొన్ని రోజులు షూటింగ్‌ చేశాక, ఆమెను భరించలేక ‘మిస్సమ్మ’ నుంచి తీసేశారు. నువ్వు ఆమెతో సినిమా తీస్తే ఇబ్బంది పడతావు’ అని హెచ్చరించారు. ఆ సమయంలోనే హీరో కృష్ణ భానుమతి సొంత చిత్రం ‘అంతా మనమంచికే’లో నటిస్తున్నారు. అందుకే తన సినిమాకు ఆమె ఇబ్బంది పెట్టరని కృష్ణ అనుకొన్నారు. ఆ మాటే భావనారాయణతో చెప్పారు. 


‘అది వేరే.. ఇది వేరే. నా మాట విను. లేకపోతే ఇబ్బంది పడతావు’ అని బతిమాలారు భావ నారాయణ. ఆయన తన శ్రేయోభిలాషి కనుక అంతలా పదేపదే చెబుతుండటంతో మనసు మార్చుకుని, భానుమతికి బదులు జమునను ఎంపిక చేశారు కృష్ణ. ‘పండంటి కాపురం’ చిత్రంలో రాణీ మాలినీదేవి పాత్ర జమున పోషిస్తున్నట్లు పత్రికా ప్రకటన ఇచ్చారు. అది చూడగానే భానుమతికి విపరీతమైన కోపం వచ్చింది. తనను ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తొలగించి, వేరే హీరోయిన్‌ను పెట్టుకోవడాన్ని ఆమె సహించలేకపోయారు. ఆ కోపంలో ‘పండంటి కాపురం’ చిత్రానికి పోటీగా అదే కథతో తనూ ఓ చిత్రం తీయాలని నిర్ణయించుకొన్నారు.


‘ద విజిట్‌’ అనే ఆంగ్ల చిత్రంలో కథానాయిక ప్రేరణతో ‘రాణీ మాలినీదేవి’ పాత్రను కథకుడు ప్రభాకరరెడ్డి తీర్చిదిద్దారు. ఆ విషయం భానుమతికి తెలుసు కనుక ‘ద విజిట్‌’ చిత్రకథను యథాతఽథంగా తీసుకొని ‘పండంటి కాపురం’ చిత్రానికి పోటీగా ఓ సినిమా తీయాలనుకొన్నారు. నటుడు గుమ్మడిని కలిసి, ఈ కథ గురించి చెప్పి అందులో వేషం వెయ్యమని అడిగారు భానుమతి. ఆమెకు ఏం చెప్పాలో తోచక ‘నేను ఇలాంటి వేషాన్నే ‘పండంటి కాపురం’ చిత్రంలో చేస్తున్నాను. మళ్లీ అదే వేషం మీ సినిమాలో చేస్తే వాళ్లేమైనా అనుకుంటారు. నాకు కొంచెం టైమ్‌ ఇవ్వండి. ఆలోచించుకుని చెబుతా’ అన్నారు. ఆ మర్నాడు ‘పండంటి కాపురం’ షూటింగ్‌ స్పాట్‌లో ఆర్టిస్టులందరూ కూర్చుని కబుర్లు చెప్పుకొంటున్నప్పుడు గుమ్మడి ఈ విషయం ప్రస్తావించారు. అది వినగానే ఎస్వీ రంగారావుకు కోపం వచ్చింది. ‘ఏమిటయ్యా ఆలోచించుకుని చెప్పేది? హేమాహేమీలైన నటీనటులు ఇంతమందిని పెట్టుకుని చేస్తున్న సినిమాను భానుమతి మళ్లీ తీస్తుందా? ఆ షూటింగ్‌ ఎలా సాగుతుందో చూద్దాం’ అన్నారాయన ఆవేశంగా. అలా అనడమే  కాదు ‘పండంటి కాపురం’ షూటింగ్‌కు ఎటువంటి ఆటంకాలు లేకుండా వేగంగా పూర్తి అయ్యేందుకు ఎస్వీఆర్‌ తన వంతు సహకారాన్ని అందించారు. ఆ రోజుల్లో ఆయన మందు తాగడం మొదలుపెడితే షూటింగ్‌ స్పాట్‌కు కూడా వచ్చేవారు కాదు. అయినా 15 రోజుల పాటుమందు జోలికి వెళ్లకుండా నటన మీదే దృష్టిని కేంద్రీకరించారు. మిగిలిన నటీనటులు కూడా సహకరించడంతో ‘పండంటి కాపురం’ చిత్రాన్ని 90 రోజుల్లో పూర్తి చేయగలిగారు. దాంతో భానుమతి తన ప్రయత్నాన్ని విరమించుకోకతప్పలేదు.

- వినాయకరావు

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
| For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.