అలా అనుకుంటారనే.. కొన్ని సినిమాలు చేయడం లేదు: అలీ (Ali)
ABN , First Publish Date - 2022-05-19T03:33:41+05:30 IST
విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), అనిల్ రావిపూడి (Anil Ravipudi) సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం..

విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej), అనిల్ రావిపూడి (Anil Ravipudi) సూపర్ హిట్ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 3’ (F 3). దిల్ రాజు (Dil Raju) సమర్పణలో శిరీష్ (Sirish) నిర్మిస్తున్న ఈ చిత్రం మే 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన అలీ (Ali) మీడియాకు ‘ఎఫ్ 3’ విశేషాలను వివరించారు. ఆయన చెప్పిన విశేషాలివే..
43 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు? ఈ మధ్య కాలంలో మీ స్పీడ్ తగ్గింది. ఎందుకు?
బుల్లితెరపై ఒకే ఒక షో చేస్తున్నాను. అలాగే యమలీల సీరియల్ చేశా. ఎస్వీ కృష్ణారెడ్డి (SV Krishna Reddy)గారి కోసమే ఆ సీరియల్ చేశా. ఎందుకంటే ఆయన నన్ను హీరోని చేశాడు. స్టార్ దర్శకుడిగా ఉన్న ఆయన.. అందరిని ఒప్పించి నాతో సినిమా చేశాడు. అందుకే ఆయన ఏం చెప్పినా.. వెనకా ముందు ఆలోచించకుండా చేసేస్తా. ఇక ఈ మధ్యకాలంలో చిన్న చిన్న సినిమాల్లో మాకు క్యారెక్టర్ ఇస్తున్నారు. సినిమా కథ ఏంటో మాకు చెప్పరు. తీరా సినిమా చూస్తుంటే.. అలీగారు ఎందుకు ఈ సినిమాలో నటించాడు? అని అందరూ అనుకుంటారు. అభిమానులతో ఆ మాట అనిపించుకోవద్దనే కొన్ని సినిమాలు చేయడంలేదు. కథ విని నా క్యారెక్టర్ బాగుంటేనే సినిమా చేస్తా. కొత్త వాళ్లకు అయితే ఏదైనా పర్లేదు అని చేస్తారు. నాకు ఇప్పుడు ఆ అవసరం లేదు.
‘ఎఫ్ 3’లో పూర్వ అలీని చూడగలమా?
తప్పకుండా చూస్తారు. నా క్యారెక్టర్‌లో అంత సత్తా ఉంది. లొకేషన్‌లో కూడా టెక్నీషియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. శిరీష్ గారు అయితే 35 సార్లు చూసి కిందపడి మరీ నవ్వారని అనిల్ చెప్పారు. నా పాత్రను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు.
ఈ సినిమాలో మీ క్యారెక్టర్ పేరు?
పాల బేబీ (Pala Baby). వడ్డీకి తిప్పే క్యారెక్టర్ నాది. ఆడవాళ్లు అంటే అపారమైన గౌరవం. సినిమా ఎండింగ్‌లో మీకు ఆ విషయం తెలుస్తుంది. సినిమా మొత్తంలో 45 నిమిషాలకు పైగా నా పాత్ర ఉంటుంది.
సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. చాలా మంది ఆరిస్టులు నటించారు. ఎవరెలా చేశారు?
ఒకరిని మించి ఒకరు నటించారు. ఎవ్వరిని తగ్గించలేం. చిన్న క్యారెక్టర్ కూడా సినిమాలో కీలకం. ‘కొన్ని సీన్స్ మిస్ అయిపోయామే.. మళ్లీ వెళ్లాలిరా’ అనేలా ఆడియన్స్ థియేటర్లకు వస్తారు.
వెంకటేశ్, వరుణ్‌తేజ్ కామెడీ టైమింగ్ గురించి?
వాళ్లు పుట్టిందే ఇండస్ట్రీలో. ఇద్దరూ బాగా చేశారు. వారితో పాటు మిగతా నటీనటులు కూడా చక్కగా నటించారు.
సినిమాల్లో హీరోలిద్దరికి ఓ లోపం ఉంది. వెంకటేశ్‌కు రేచీకటి అయితే.. వరుణ్‌కు నత్తి.. మరి మీకేముంది?
నాకు గన్ ఉందిగా(నవ్వుతూ..)
అనిల్‌తో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
సినిమాలో ఇంత మంది ఆర్టిస్టులు ఉంటే కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ అనిల్‌లో అది కొంచెం కూడా కనిపించదు. అందరు వచ్చారా? టిఫిన్ చేశారా? ఓకే షూటింగ్ స్టార్ట్ చేద్దాం అని సింపుల్‌గా అనేస్తాడు. అతి తక్కువ వయసులో ఇంతమంది ఆర్టిస్టులను మ్యానేజ్ చేయడం అనేది గొప్ప విషయం. ఒకప్పుడు రాఘవేంద్రరావు (Raghavendra Rao), దాసరి నారాయణరావు (Dasari Narayana Rao), ఈవీవీ సత్యనారాయణ (EVV Satyanarayana) సినిమాల్లో ఇలాంటి వాతావరణం ఉండేది. అనిల్‌లో అంత సత్తా ఉంది కాబట్టే.. దిల్ రాజుగారు కూడా ఎంత మంది ఆర్టిస్టులు కావాలంటే.. అంతమందిని తీసుకొచ్చి ఇచ్చాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అనిల్ అదృష్టం.
వెంకటేశ్‌తో మీ కామెడీ టైమింగ్ ఎలా ఉండబోతుంది?
ఆయనతో నేను చేసిన సినిమాలు అన్ని కామెడీ చిత్రాలే. కామెడీ చేయడంలో చిరంజీవి (Chiranjeevi), వెంకటేశ్, మోహన్‌బాబు(Mohan Babu), పవన్ కల్యాణ్ (Pawan Kalyan), మహేశ్‌బాబు (Mahesh Babu), ఎన్టీఆర్ (NTR) ఎక్స్‌ఫర్ట్స్.
పొలిటికల్ కెరీర్ గురించి?
నన్ను హీరోగా క్రియేట్ చేసింది ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. పొలిటికల్ లీడర్‌గా క్రియేట్ చేయబోతున్నది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan Mohan Reddy)గారే. ఆయన నాకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. నామీద నమ్మకం పెట్టుకోండి అన్నారు అంతే. ఏదో ఒకరోజు కాల్ వస్తే వెళ్తా.. మీ సమక్షంలోనే(మీడియా) ఆ విషయాన్ని పంచుకుంటా.
ఫైనల్‌గా ఎఫ్3 గురించి ఏం చెప్తారు?
ఇది ఒక అద్భుతమైన సినిమా. పైసా వసూల్ మూవీ. వంద రూపాయలు పెట్టి సినిమా చూస్తే.. మూడు వందల రూపాయల ఆనందం వస్తుంది.
కొత్త సినిమాల గురించి?
‘అంటే సుందరానికి’ (Ante Sundaraniki), ‘లైగర్’ (Liger), ‘ఖుషి’ (Kushi), ‘ఒకే ఒక జీవితం’ (Oke Oka Jeevitham) సినిమాలతో పాటు తమిళ వెబ్ సిరీస్ చేస్తున్నా. కన్నడలో ధృవ సర్జా (dhruva sarja) మూవీలో నటిస్తున్నాను. ఓ నేపాలి సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నా. ఒకప్పుడు మనం సినిమాల్లో అవకాశం కోసం వెళ్లేవాళ్లం. ఇప్పుడు వాళ్లే మన దగ్గరకు వస్తున్నారు. ఒకప్పుడు నార్త్‌వాళ్లను మనం తెచ్చుకునేవాళ్లం. మనం యాక్టింగ్ నేర్పించి, డబ్బింగ్ చెప్పించి డబ్బులు ఇచ్చేవాళ్లం. ఇప్పుడు సౌత్ వాళ్ల సత్తా ఏంటో తెలిసింది. అక్కడి సినిమాల కోసం మమ్మల్ని పిలుస్తున్నారు.
