విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకునే అవకాశముందా..?

ABN , First Publish Date - 2022-03-31T21:31:20+05:30 IST

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే

విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకునే అవకాశముందా..?

సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డ్స్‌ను మార్చి 27న ప్రదానం చేశారు. అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ అకాడమీ అవార్డుల వేడుకకు హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ నటుడు విల్‌స్మిత్, వ్యాఖ్యాత క్రిస్ చెంప పగలగొట్టడంతో తీవ్ర దుమారం రేగింది. దీంతో స్మిత్‌ను వేడుక నుంచి వెళ్లిపోవాలని అకాడమీ కోరగా, అతడు నిరాకరించినట్టు సమాచారం. కాగా.. ప్రస్తుతం అతడికి అందజేసిన పురస్కారాన్ని వెనక్కి తీసుకునేందుకు ఇప్పటికే ప్రక్రియ మొదలైనట్టు తెలుస్తోంది.


ఆస్కార్ వేడుకలో జరిగన ఘటనపై అకాడమీ గవర్నర్ల బోర్డు బుధవారం సమావేశమై చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘‘భౌతిక దాడికి దిగడం, దూషణాలను పాల్పడటం, బెదిరింపుతో కూడిన ప్రవర్తన వంటి చర్యలకు విల్ స్మిత్ పాల్పడ్డాడు. అతడిపై క్రమశిక్షణ చర్యలు, సస్పన్షన్, ఆంక్షలు విధించే అవకాశముంది. ఏప్రిల్ 18న జరిగే బోర్డు సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అకాడమీ నిబంధనలకు వ్యతిరేకంగా విల్ స్మిత్ ప్రవర్తించాడు. అందువల్ల ఈ ఘటనపై 15రోజుల్లోగా అతడు లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలి’’ అని అకాడమీ తెలిపింది. ఈ ఘటన అనంతరం  క్రిస్ రాక్ బోస్టన్‌లో జరిగిన స్టాండ్ అప్ షోలో పాల్గొన్నాడు. అతడికి అక్కడ ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ‘‘నేను జోక్‌లను చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. ఆ ఘటనపై తర్వాత మాట్లాడతాను’’ అని పేర్కొన్నాడు. 


ఆస్కార్ వేడుకలో  క్రిస్ రాక్ వేసిన జోక్ ఏంటంటే..

ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డుని ప్రకటించడానికి ముందు ప్రముఖ కమెడియన్, షో హోస్ట్ క్రిస్ రాక్ స్టేజ్ పైకి వచ్చాడు. విల్‌స్మిత్‌ భార్య జాడా పింకెట్ ప్రస్తావనను తీసుకొచ్చాడు. ‘జీ.ఐ.జెన్’ చిత్రంలో ‘డెమి‌మూర్’ పోషించిన పాత్రలో జాడాను పోల్చాడు. దీంతో భరించలేకపోయిన విల్ స్మిత్ ఆగ్రహానికి గురయ్యాడు. స్టేజ్ పైకి వెళ్లి క్రిస్ చెంప పగలకొట్టాడు. జాడా పింకెట్‌ ఆస్కార్ పురస్కారాల ప్రదానోత్సవానికీ పూర్తిగా గుండుతో హాజరయింది. ఆమెకు ‘అలోపెసియా’ అనే సమస్య ఉంది. ఈ సమస్య ఉన్నవారికి జుట్టు పూర్తిగా ఊడిపోతుంటుంది. ఈ విషయాన్ని ఆమె బహిరంగంగా కూడా తెలిపింది.



Updated Date - 2022-03-31T21:31:20+05:30 IST