అభిషేక్‌ ‘బ్రీత్‌’... ఆరాధ్యే

ABN , First Publish Date - 2020-08-16T19:25:42+05:30 IST

అభిషేక్‌ బచ్చన్‌... సినిమాలు తగ్గించి, ‘బ్రీత్‌’ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి తన అభిమానులను అలరిస్తున్నాడు.

అభిషేక్‌ ‘బ్రీత్‌’... ఆరాధ్యే

అభిషేక్‌ బచ్చన్‌... సినిమాలు తగ్గించి, ‘బ్రీత్‌’ సిరీస్‌తో ఓటీటీలో ఎంట్రీ ఇచ్చి తన అభిమానులను అలరిస్తున్నాడు. తన ముద్దుల కూతురుతో పాటూ కుటుంబమంతా కరోనా బారిన పడినా ఆత్మస్థైర్యంతో కోవిడ్‌ 19ను జయించాడు. అసలు అభిషేక్‌ సినిమాలు ఎందుకు తగ్గించాడు? ఓటీటీలో ఎందుకు ఎంట్రీ ఇచ్చాడు? వంటి అంశాలతో పాటూ అతని గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాల సమాహారం...



బిగ్‌ బీ కొడుకే అయినా...

అమితాబ్‌ బచ్చన్‌ వంటి లెజెండరీ నటుడి కొడుకే అయినా అభిషేక్‌ కెరీర్‌ ఇప్పటికీ ఎగుడుదిగుడుల రహదారే! 2000లో ‘రెఫ్యూజీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పటివరకు ఓ యాభై సినిమాలలో నటించాడు. చివరగా 2018లో అతని సినిమా విడుదలైంది. ఆ యాభై సినిమాలలో మంచి టాక్‌ వచ్చినవి 12 సినిమాలు మాత్రమే. 



చదువు మధ్యలో వదిలేసి...

ముంబైలో చదువు పూర్తయ్యాక ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. అక్కడ బిజినెస్‌ కోర్సులో చేరి నటుడవ్వాలన్న కోరికతో ఆ చదువును మధ్యలోనే వదిలేసి వచ్చాడు. కానీ విజయాలను అందుకోవడంలో తడబడ్డాడు. 


ఫ్లాపుల వీరుడు

రెఫ్యూజీతో మొదలు పెట్టి నాలుగేళ్లలో 17 సినిమాలు చేశాడు అభిషేక్‌. వీటిలో 16 

సినిమాలు ఫ్లాపులే. 17వ సినిమా ధూమ్‌తో తొలి కమర్షియల్‌ హిట్‌ను అందుకున్నాడు అభిషేక్‌. బిగ్‌ బీ కొడుకు కాబట్టి వరుసగా 16 సినిమాలు ఫ్లాపులే అయినా ఇంకా ఇండస్ట్రీలో ఉన్నాడన్న వార్తలు బాగానే చక్కర్లు కొట్టాయి. 


ధూమ్‌ సెట్‌లో ప్రేమ

‘దూమ్‌’ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఐశ్వర్యతో ప్రేమలో పడ్డాడు. అంతకుముందు కరిష్మా కపూర్‌తో జరిగిన ఎంగేజ్మెంట్‌ను రద్దు చేసుకున్నాడు. అందమైన ఉంగరంతో ఐష్‌కు ప్రపోజ్‌ చేశాడు. 


వింత హాబీ

అభిషేక్‌ కు ఒక వింత అలవాటు ఉంది. తాను ఎప్పుడు విమాన ప్రయాణం చేసినా.. విమానాశ్రయంలో ఇచ్చే బోర్డింగ్‌ పాస్‌ను జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇప్పటివరకు కొన్ని వేల పాస్‌లను సేకరించాడు. 


కూతురే సర్వస్వం

అభిషేక్‌ కూతురు పుట్టాక చెవిపోగుతో కనిపించసాగాడు. ఆరాధ్యకు చెవులు కుట్టించేటప్పుడు ముందుగా తాను కుట్టించుకుని ఎంత నొప్పి కలుగుతుందో తెలుసుకుని, ఆ తరువాత కూతురికి కుట్టించాడు. అంతే కాదు అసభ్య సన్నివేశాలు చేయాల్సివస్తుందేమోనని సినిమాలనే తగ్గించుకున్నాడు. తన కూతురు ఏనాడూ తలదించుకునే పని తాను చేయనని చెప్పాడు. 




ఓటీటీలోకి ఎంట్రీ...

గత రెండేళ్లుగా సినిమాలలో కనిపించని ‘స్మాల్‌ బి’ హఠాత్తుగా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమయ్యే బ్రీత్‌ రెండో సిరీస్‌లో తానే హీరోగా, విలన్‌గా నటిస్తూ ఆకట్టుకుంటున్నాడు. భవిష్యత్తులో ఓటీటీలదే ప్రధాన పాత్ర అని అందులో నటించడంలో తనమేమీ కాదని తెలిపాడు అభిషేక్‌. అందులోను బ్రీత్‌ మొదటి పార్ట్‌లో మాధవన్‌ కీలకపాత్ర పోషించాడు. అది సూపర్‌ హిట్‌ కొట్టడంతో... రెండో సిరీస్‌లో నటించేందుకు అభిషేక్‌ ముందుకొచ్చాడు. కూతురిని కాపాడుకునే తండ్రిగా కొత్తగా కనిపించాడు. 


డిస్లెక్సియా బాధితుడు

2007లో విడుదలైన తారేజమీన్‌ పర్‌ సినిమాలో పిల్లాడి తరహా క్యారెక్టర్‌ అభిషేక్‌ ది. తొమ్మిదేళ్ల వయసులో డిస్లెక్సియా అనే మానసిక వ్యాధి అభికి ఉన్నట్టు బయటపడింది. ఇదొక లెర్నింగ్‌ డిజేబులిటీ. ఈ సమస్య ఉన్నవారికి క్లాసులోని పాఠాలు త్వరగా అర్థం కావు. దీన్ని త్వరగానే అధిగమించాడు అభిషేక్‌. 

Updated Date - 2020-08-16T19:25:42+05:30 IST