అందరికీ నచ్చే పార్టీ
ABN , First Publish Date - 2022-12-06T07:02:46+05:30 IST
నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొన్న చిత్రం ‘వీకెండ్ పార్టీ’. డాక్టర్ బోయ జంగయ్య రాసిన నవల ఆధారంగా...

నాగార్జున సాగర్ ఏరియాలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపుదిద్దుకొన్న చిత్రం ‘వీకెండ్ పార్టీ’. డాక్టర్ బోయ జంగయ్య రాసిన నవల ఆధారంగా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. అమరేందర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బోయ జంగయ్య కుమారుడు చేతన్ బాబు నిర్మించారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం ఉదయం నిర్మాతలమండలి కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. ఈ కార్యక్రమానికి గీత రచయితలు చంద్రబోస్, కాసర్ల శ్యామ్, సుచిత్రా చంద్రబోస్, ఫిల్మ్ జర్నలిస్టులు వినాయకరావు, ప్రభు, సురేశ్ కొండేటి ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చంద్రబోస్ మాట్లాడుతూ ‘ఇందులో పల్లెటూరి గురించి ఓ పాట రాసే అవకాశం కలిగింది. నా శ్రీమతి అన్ని పాటలకూ నృత్య దర్శకత్వం వహించారు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అన్నారు. దర్శకుడు అమరేందర్ మాట్లాడుతూ ‘ 90వ దశకంలో నాగార్జునసాగర్‌లో ఓ సంఘటన జరిగింది. అటువంటిదే ఈ మధ్య పంజాబ్‌లోనూ జరిగింది. నలుగురు అమ్మాయిలు ఓ అబ్బాయిని రేప్ చేస్తారు. ఈ సంఘటన ఆధారంగా బోయ జంగయ్యగారు ‘అడ్డదారులు’ అనే నవల రాశారు. నేటి పరిస్థితులకు అద్దం పట్టే సన్నివేశాలతో ‘వీకెండ్ పార్టీ’ తయారైంది. మంచి పాటలు ఇచ్చిన చంద్రబోస్, కాసర్ల శ్యామ్, సంగీత దర్శకుడు సదా చంద్రలకు ధన్యావాదాలు’ అన్నారు. ఈ సినిమాకు పనిచేసిన వారందరికీ నిర్మాత చేతన్ కృతజ్ఞతలు తెలిపారు.