మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త నిర్మాణంలో చిత్రం తెరకెక్కింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే కథానాయికలుగా నటిస్తున్నారు. ఇది వరకు విడుదలైన చిత్రం టీజర్స్, సింగిల్స్, భారీ అంచనాలు నెలకొల్పాయి. దేవాలయ భూముల కుంభకోణం నేపథ్యంలో సందేశాత్మక కథాంశంతో చిత్రం తెరకెక్కింది. వచ్చే నెల 29న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాపై ఇండస్ట్రీలో పాజిటివ్ బజ్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రానికి షాకింగ్ రన్ టైమ్ ను ఫిక్స్ చేశారని టాక్.
తాజా సమాచారం ప్రకారం ‘ఆచార్య’ రన్ టైమ్ దాదాపు 3గంటలుగా ఖాయం చేశారట. ఈ మూడు గంటలూ అభిమానుల్ని థ్రిల్ చేస్తుందని నిర్మాతలు చెబుతున్నారు. చిత్రం కోసం భారీ టెంపుల్ సిటీ సెట్ వేసిన సంగతి తెలిసిందే. సినిమా అత్యధిక శాతం ఇక్కడే చిత్రీకరణ జరుపుకుంది. ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం తర్వాత చిరు నటించిన సినిమా కావడంతో మరింతగా అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఆయన డ్యాన్స్ చేసి దాదాపు ఐదేళ్ళు అవడంతో అభిమానులు ఆయన్నుంచి వెరైటీ స్టె్ప్స్ ఆశిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఇందులో చిరు ఓ రేంజ్ లో డ్యాన్స్ చేశారని ఆ మధ్య విడుదలైన సింగిల్స్ తో అర్ధమైంది. మరి ‘ఆచార్య’ చిత్రం మెగా అభిమానుల్ని ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.