Review 2021: సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు

ABN , First Publish Date - 2021-12-25T02:54:43+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమ అనే కాదు.. యావత్ సినీ పరిశ్రమకు 2020, 2021 సంవత్సరాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో కర్ఫ్యూ, కొంతకాలం లాక్‌డౌన్, థియేటర్ల మూత వంటి విషయాలతో పాటు.. ప్రజలు కూడా భయాందోళనలో మునిగిపోవడంతో

Review 2021: సినీ ఇండస్ట్రీని వేడెక్కించిన వివాదాలు

తెలుగు చిత్ర పరిశ్రమ అనే కాదు.. యావత్ సినీ పరిశ్రమకు 2020, 2021 సంవత్సరాలు తీవ్ర నిరాశనే మిగిల్చాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో కర్ఫ్యూ, కొంతకాలం లాక్‌డౌన్, థియేటర్ల మూత వంటి విషయాలతో పాటు.. ప్రజలు కూడా భయాందోళనలో మునిగిపోవడంతో అన్ని ఇండస్ట్రీల వలే సినిమా ఇండస్ట్రీ కూడా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత తెరుచుకున్న థియేటర్లలోకి ప్రేక్షకులను రప్పించేందుకు ఇండస్ట్రీ వర్గాలు తీవ్రంగా కష్టపడుతున్నాయి. రవితేజ ‘క్రాక్’ సినిమాతో 2021 సంవత్సరానికి శుభారంభాన్ని ఇవ్వగా.. ‘ఉప్పెన’, ‘నాంది’, ‘జాతిరత్నాలు’, ‘రంగ్‌దే’, ‘వకీల్‌సాబ్’, ‘తిమ్మరుసు’, ‘రాజరాజ చోర’, ‘శ్రీదేవి సోడా సెంటర్’, ‘లవ్ స్టోరి’, ‘రిపబ్లిక్’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’, ‘వరుడు కావలెను’, ‘అనుభవించు రాజా’, ‘అఖండ’, ‘పుష్ప’, ‘శ్యామ్ సింగరాయ్’ వంటి చిత్రాలు సక్సెస్‌ఫుల్ టాక్‌తో టాలీవుడ్‌కి ఊపిరిపోశాయి. అయితే కరోనా ప్రభావం తగ్గి కాస్త తేరుకుంటున్న టాలీవుడ్ ఇండస్ట్రీని ఈ సంవత్సరం కొన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ‘బాహుబలి’ చిత్రంతో ప్రపంచమంతా టాలీవుడ్ అంటే వాహ్..! అనుకునే స్థాయికి చేరితే.. కొన్ని వివాదాలు టాలీవుడ్ ఇండస్ట్రీ పరువుని పతన స్థాయికి చేర్చాయి. మరికొన్ని వివాదాలు టాలీవుడ్‌‌లో హీట్ పెంచాయి. అంతలా ఈ సంవత్సరం (2021) టాలీవుడ్‌ని దిగజార్చిన, హీటెక్కించిన ఆ వివాదాలు ఏంటో ఒకసారి చూద్దాం.


‘వకీల్ సాబ్’: బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ల రేట్లు పెంచడానికి వీల్లేదు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రం ఏప్రిల్ 09న విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా విడుదలైన ఈ చిత్రం.. ఏపీలో మాత్రం రాజకీయ దుమారం రేపింది. ఏపీ ప్రభుత్వం ఈ చిత్రానికి బెనిఫిట్ షోలను, టికెట్ రేట్లను పెంచుకునే అవకాశాన్ని లేకుండా చేసి.. పవన్ కల్యాణ్‌పై ఉన్న రాజకీయ కక్షను ప్రదర్శించింది. ఈ చిత్రం విడుదలైనప్పటి నుండి టాలీవుడ్‌ని ఏపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతూనే ఉంది. అంతకుముందు పెద్ద చిత్రాలు విడుదలైనప్పుడు, పండగ సమయాల్లో వారం పాటు అధిక షోలు, టికెట్ల రేట్లను పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం.. పవన్ కల్యాణ్‌‌ను రాజకీయంగా ఎదుర్కొలేక.. ఆయన నటించిన సినిమాని, తద్వారా సినిమా ఇండస్ట్రీని కోలుకోలేని విధంగా దెబ్బతీసింది.. తీస్తోంది. అప్పటి నుండి ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో టాలీవుడ్ పెద్దలు కొందరు.. ఏపీ ప్రభుత్వ నాయకులతో సంప్రదింపులు జరిపినా సమస్య పరిష్కారం కాలేదు. రాష్ట్రంలో ఏ సమస్యా లేనట్లు.. ప్రభుత్వం ఈ విషయాన్నే భూతద్ధంలో చూడటం ఏమటని అక్కడి ప్రజలు సైతం మాట్లాడుకునేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.


సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్

హీరో సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారిగా హీట్ పెంచింది. టికెట్ల ధరల సమస్య, చిత్రాల విడుదల విషయంలో తనమునకలై ఉన్న ఇండస్ట్రీని ఒక్కసారిగా సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్ భయానికి గురిచేసింది. ఆయనకి యాక్సిడెంట్ జరిగిన విధానం, తర్వాత కోమాలోకి వెళ్లిపోవడం, నెల రోజుల వరకు ఆయన కోలుకోలేక పోవడం వంటివి మెగా ఫ్యామిలీనే కాక టాలీవుడ్ మొత్తాన్ని బాధించాయి. ఈ యాక్సిడెంట్ యంగ్ హీరోలందరినీ అలెర్ట్ చేసేలా చేసింది. అయితే ఈ యాక్సిడెంట్‌పై ఇండస్ట్రీలోని కొందరు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడటం.. అప్పట్లో పెద్ద వివాదమే అయింది. ప్రస్తుతం సాయితేజ్ కోలుకుని, తన తదుపరి చిత్ర షూటింగ్‌కి రెడీ అవుతున్నారు.  


‘రిపబ్లిక్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ స్పీచ్

ఏపీ ప్రభుత్వం సినిమా పరిశ్రమపై వ్యవహరిస్తున్న తీరుపై ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కల్యాణ్ బాహాటంగా ఫైర్ అయ్యారు. సాయిధరమ్ తేజ్ యాక్సిడెంట్‌తో ‘రిపబ్లిక్’ ప్రమోషన్ బాధ్యతలు తీసుకున్న పవన్ కల్యాణ్.. చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో.. చిత్ర పరిశ్రమ పట్ల ఏపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ‘‘టికెట్ల రేట్లు పెంచడానికి, తగ్గించడానికి మీరెవరు? నా పేరు చెప్పి సినిమా పరిశ్రమను ఇబ్బంది పెడుతున్నారు. ప్రైవేటు పెట్టుబడితో సినిమా తీస్తే ప్రభుత్వ పెత్తనమేంటి? చిత్రపరిశ్రమపై కన్నెత్తి చూస్తే వైసీపీ నేతలు కాలిపోతారు. సినిమా పరిశ్రమపై కన్నెత్తి చూస్తే ఊరుకునేది లేదని’’ హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ ప్రభుత్వాన్నే కాకుండా.. ఇండస్ట్రీలో మేమే పెద్దలం, మేమే బలవంతులం అని చెప్పుకునే వారందరికీ చురకలు అంటించేలా పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం.. టాలీవుడ్‌ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఆ ఊపులో ఇండస్ట్రీ అంతా ఒక్కటైతే.. ఏపీ ప్రభుత్వం తీరులో మార్పు వచ్చేదే కానీ.. నాని వంటి ఒకరిద్దరు హీరోలు తప్ప ఇండస్ట్రీకి చెందిన ఎవరూ పవన్ కల్యాణ్‌కి సపోర్ట్ ఇవ్వలేదు. దీంతో ఈ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే ముదిరి పాకాన పడింది అని అనవచ్చు.


పవన్ కల్యాణ్‌పై పోసాని వ్యాఖ్యలు

‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగంపై ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కొందరు ఎవరికి వారు వారి అభిప్రాయాలు చెప్పగా.. వైఎస్‌ఆర్‌సీపీకి వీరవిధేయుడిని అని చెప్పుకునే నటుడు పోసాని కృష్ణమురళి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత దూషణలు చేయడం పెద్ద వివాదం అవడమే కాకుండా.. ఇండస్ట్రీ పరువుని దిగజార్చింది. ఈ ఇష్యూకి సంబంధమే లేని ఓ నటిని లింక్ చేసి ఆయన మాట్లాడటం, పవన్ కల్యాణ్‌ని తీవ్రంగా బూతులు తిట్టడం వంటివాటితో పవన్ కల్యాణ్ అభిమానులు కొందరు దాడి చేసే పరిస్థితి వరకు వ్యవహారం వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. నా భార్యను తిట్టారంటూ.. పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేస్తూ పోసాని చేసిన దూషణలు.. ఛీ చ్ఛి.. ఇండస్ట్రీ ఇలా ఉంటుందా! అనే విధంగా మాట్లాడుకునేలా చేశాయి. ఈ మీడియా సమావేశం తర్వాత పోసాని కొన్నాళ్లు అజ్ఞాతవాసం చేసి.. మళ్లీ ‘మా’ ఎన్నికల్లో ప్రత్యక్షమయ్యారు. అయితే సినిమా టికెట్ల గురించి, థియేటర్ల సమస్య గురించి పవన్ కల్యాణ్ మాట్లాడితే.. ఇది సినిమా వాళ్లందరి సమస్య అని చెప్పి ఏపీ ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాల్సిన పోసాని.. తిరిగి అతనిపైనే తిరుగుబాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 


‘మా’ ఎన్నికలు

ఈ ఇష్యూస్ జరుగుతుండగానే ‘మా’ ఎన్నికలు వచ్చేశాయి. ఈ ఎన్నికలు సృష్టించిన హడావుడి, వాతావరణం మాములుది కాదు. దాదాపు ఒక స్టేట్‌కి సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో.. అంతకంటే ఎక్కువ హంగామా ఈ ఎన్నికలకు నడిచింది. ‘మా’ పీఠం కోసం ముందు నలుగురైదుగురు పోటీ చేసినా.. చివరికి మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ల మధ్య పోటీ జరిగింది. ఈ పోటీలో వర్గ, కుల, భాష.. అబ్బో ఒక్కటి కాదు అన్నీ కీలక పాత్ర పోషించాయి. చివరికి నాటకీయత మధ్య మోహన్ బాబు సపోర్ట్ ఇచ్చిన మంచు విష్ణు గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారి ప్రవర్తన, హేమ ఓవరాక్షన్, మోహన్‌బాబు వ్యవహారశైలి ఇలా అన్నీ వెరసీ.. ఒక అసోషియేషన్ ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా! అని తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ప్రపంచం మొత్తంలో తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ మాట్లాడుకునేలా చేశాయి. చిరంజీవి పోటీ వద్దని.. ఏకగ్రీవంగా ఇప్పుడు ప్రకాశ్ రాజ్‌ని, తర్వాత మంచు విష్ణుని ‘మా’ అధ్యక్షుడిని చేయాలని ప్రయత్నించినా.. పోటీ జరగాల్సిందే అనేలా మంచు విష్ణు అండ్ టీమ్ ప్రెస్టీజీయస్‌గా తీసుకుని ఎన్నికలకు పట్టుబట్టారు. ఈ ఎన్నికలకు సంబంధించి జరిగిన ప్రతి ఒక్కటీ వివాదం అవడమే కాకుండా.. టాలీవుడ్‌ని మరింతగా పతనం చేశాయి. ఇప్పటికీ ఈ ఎన్నికల కారణంగా మొదలైన ఇగోయిజం కొనసాగుతూనే ఉంది. పవన్ కల్యాణ్ లేవనెత్తిన అంశానికి ‘మా’ ఎన్నికల తర్వాత మాట్లాడతానని ప్రకటించిన మోహన్ బాబు.. ఎన్నికల తర్వాత అసలు బయటికి రావడమే మానేశారు. ఏపీలో థియేటర్ల, టికెట్ల ధరల గురించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ‘మా’కు సంబంధమే లేదు అనేలా మంచు విష్ణు సైలెంట్‌గా ఉండటం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.


సమంత-చైతూ విడాకులు

‘మా’ ఎన్నికల అనంతరం మళ్లీ ఇండస్ట్రీని హీటెక్కించిన అంశం సమంత-చైతూల విడాకులు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారనే విషయం.. వారు అధికారికంగా ప్రకటించక ముందే పెద్ద దుమారం రేపింది. ఇద్దరిపై ఎన్నెన్నో కథనాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చివరికి ఇద్దరూ ఎటువంటి హడావుడి లేకుండా కూల్‌గానే విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాతే సమంతను టార్గెట్ చేస్తూ కొందరు ప్రత్యేక వీడియోలు చేయడం, అలాంటి వారిపై సమంత కేసు పెట్టడం వంటివి టాలీవుడ్ గురించి ఇతర ఇండస్ట్రీలలో కూడా మాట్లాడుకునేలా చేశాయి. ఇప్పటికీ చైతూతో విడాకుల విషయమై బాధపడుతున్నట్లుగానే సమంత ప్రకటిస్తూ వస్తుంది. చైతూ మాత్రం విడాకుల అనంతరం ఎక్కడా పెదవి విప్పలేదు.


ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల రచ్చ

‘వకీల్‌సాబ్’ సినిమా నుండి జరుగుతున్న ఈ టికెట్ల రచ్చ.. ముదిరి పాకానికి చేరిందని అనుకున్నాం కదా. అది ఈ స్టేజే. సినిమా టికెట్ల సమస్యపై ఏపీ హైకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చినా.. అక్కడి రాజకీయ నేతలు మాత్రం అస్సలు వెనక్కి తగ్గేదే లే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అర్థం పర్థం లేని ఆవేశాలకు, పౌరుషాలకు పోతున్నారు. ‘ప్రత్యేక హోదా ఇష్యూ’, ‘ఏపీ క్యాపిటల్ ఇష్యూ’, ‘వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇష్యూ’, ‘పోలవరం ప్రాజెక్ట్ ఇష్యూ’, ‘రోడ్ల సమస్య’, ‘కూరగాయల రేట్ల సమస్య’.. ఇలా ఎన్నో సమస్యలు ఉండగా.. కేవలం సినిమా థియేటర్ల ఇష్యూనే అర్జంజ్ అనేలా.. జాయింట్ కలెక్టర్లని థియేటర్ల చెకింగ్‌కి పంపించి.. థియేటర్ల వ్యవస్థని నామరూపాలు లేకుండా చేసేలా.. ఏపీ ప్రభుత్వం మొండితనం ప్రదర్శిస్తోంది. కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న తీరు అయితే.. కక్ష కట్టి మరీ కావాలని ఏపీ ప్రభుత్వం ఇలా చేస్తుందనేది క్లియర్‌గా తెలియజేస్తుంది. అయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ వైపు నుండి మాట్లాడే నాధుడు లేడంటే.. టాలీవుడ్‌లో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘పెద్దరికం’ తీసుకుని ఎవరైనా మాట్లాడితే.. ఆయనెవరు మాట్లాడడానికి.. దాసరి తర్వాత నేనే ఇండస్ట్రీకి ‘పెద్ద’ అని.. మాట్లాడే నోరుని కూడా నొక్కేశారు. ఇదంతా గమనిస్తే.. ఏదో పెద్ద స్కెచ్ అయితే జరుగుతుందనేది మాత్రం సుస్పష్టం అవుతుంది. అదేంటనేది ఇండస్ట్రీలో చాలా మందికి తెలుసు. కానీ ఎవరూ మాట్లాడరు. మౌనమే అన్నిటికీ పరిష్కారం చూపుతుందని.. ఎవరూ నోరు ఎత్తకపోతే నష్టపోయేది మాత్రం తెలుగు చలన చిత్ర పరిశ్రమే. మరి ఇప్పటికైనా మేల్కొంటారో.. లేదంటే మాకెందుకులే అని అనుకుంటారో.. అనేది తెలియాలంటే దృశ్యం చూస్తూ ఉండటమే. 

-కొండపల్లి బాలకృష్ణ 

Updated Date - 2021-12-25T02:54:43+05:30 IST