Photo Talk: ఈ ఫోటోల సమయం, సందర్భం తెలుసా

ABN , Publish Date - Feb 24 , 2025 | 11:37 AM

ఇక్కడ గుసగుసలాడుతున్నది ఇద్దరు ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్. ఇద్దరూ దర్శకులుగానూ మారారు. అయితే గురువు కన్నా మిన్నగా శిష్యుడే డైరెక్టర్ గా రాణించారు. ఇంతకూ వీరిద్దరెవరో చెప్పాలా...

ఒక ఫొటో ఎన్నో జ్ఞాపకాలను (Photo Talk) పదిలంగా ఉంచుతుంది. మరచిపోయిన విషయాలను గుర్తు చేస్తుంది. సందర్భం ఏదైనా ఒక్క ఫొటో ఉంటే చాలు జీవిత కాలం ఓ మెమరీగా ఉండిపోతుంది. అప్పుడప్పుడూ ఆ జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తుంది. సినిమా ఇండస్ట్రీలో అలాంటి జ్ఞాపకాలకు సంబంధించిన ఆసక్తికర ఫొటోలు మీకోసం..

NAGARJU.jpg

1. సత్యం- శివం -  సుందరం (Nagarjuna - Sumanth- ANR)

మనవడు సుమంత్ ను సైతం సొంత కొడుకులాగే ఆదరించారు అక్కినేని నాగేశ్వరరావు. ఇక నాగార్జున కూడా తన మేనల్లుడు సుమంత్ ను హీరోగా నిలబెట్టడానికి పలు ప్రయత్నాలు చేశారు. నాగార్జున నిర్మించిన  'సత్యం' సినిమాతోనే తొలి సక్సెస్ ను అందుకున్నారు సుమంత్. 'సత్యం' సినిమా వేడుకలో తాత ఏయన్నార్, ఆ చిత్ర నిర్మాత అయిన తన మేనమామ నాగార్జునతో కలసి ఆనందం పంచుకుంటున్నారు సుమంత్. అభిమానులు ఈ ముగ్గురినీ ఓ గజమాలతో సత్కరించినప్పటి దృశ్యం ఇది.  ఈ పిక్ ను బట్టి టైటిల్ రోల్ పోషించిన 'సత్యం' సుమంత్ కాగా, ఆ ఫ్యామిలీకి మూలపురుషుడైన ఏయన్నార్ ను 'శివం'గా భావించవచ్చు. ఇక 'మన్మథుడు'గా సక్సెస్ చూసిన నాగ్ ను 'సుందరం' అనవలసిందే కదా!


NTR.jpg

2. ఆ ఇద్దరికీ... అతనే! (NTR -SS Rajamouli-VV Vinayak)

తనకు ఆరంభంలో భారీ విజయాలను అందించిన దర్శకులు రాజమౌళి, వి.వి.వినాయక్ తో కలసి యంగ్ టైగర్ యన్టీఆర్ ఓ వేడుకలో ఇలా దర్శనమిచ్చారు. యన్టీఆర్ కెరీర్ లో ఫస్ట్ హిట్ గా నిలచింది 'స్టూడెంట్ నంబర్ వన్'. ఆ సినిమాతోనే రాజమౌళి డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఇక యన్టీఆర్ హీరోగా తెరకెక్కిన 'ఆది'తో వి.వి.వినాయక్ దర్శకునిగా జనం ముందు నిలిచారు. ఈ సినిమా 'స్టూడెంట్ నంబర్ వన్'ను మించి ఘనవిజయం సాధించింది. యన్టీఆర్ కు ఆరంభంలో చెప్పుకో దగ్గ హిట్స్ అవే! అలా రాజమౌళి, వినాయక్  డైరెక్టర్స్ గా పరిచయం అయిన చిత్రాల్లో కథానాయకుడు యంగ్ టైగర్ కావడం వల్ల ఆ ఇద్దరితో ఇతని అనుబంధం ప్రత్యేకం అనే చెప్పాలి!


TEJA.jpg
3. చెప్పనా ఒక చిన్నమాట! (S Gopal Reddy - Teja)

ఇక్కడ గుసగుసలాడుతున్నది ఇద్దరు ప్రముఖ సినిమాటోగ్రాఫర్స్. ఇద్దరూ దర్శకులుగానూ మారారు. అయితే గురువు కన్నా మిన్నగా శిష్యుడే డైరెక్టర్ గా రాణించారు. ఇంతకూ వీరిద్దరెవరో చెప్పాలా!? దర్జాగా చేయి వేసి ఊసులాడుతున్నది గురువు ఎస్.గోపాల్ రెడ్డి, బుద్ధిగా చేతులు కట్టుకొని వింటున్నది శిష్యుడు తేజ. రామ్ గోపాల్ వర్మ తొలి చిత్రం 'శివ'కు సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్ రెడ్డి. ఆ సమయంలో ఆయనకు అసోసియేట్ గా చేశారు తేజ. తరువాతి రోజుల్లో తెలుగు, హిందీ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన తేజ 'చిత్రం' సినిమాతో డైరెక్టర్ అయ్యారు. ఆ తరువాత అనేక సక్సెస్ ఫుల్ మూవీస్ తీశారు. చిత్రమేంటంటే, శిష్యుడు డైరెక్టర్ అయిన తరువాతే గురువు గోపాల్ రెడ్డి 'నా ఆటోగ్రాఫ్ - స్వీట్ మెమోరీస్'తో మెగాఫోన్ పట్టారు!

Updated Date - Feb 24 , 2025 | 12:01 PM