Game Changer: ‘గేమ్ చేంజర్’కి షాకిచ్చిన తెలంగాణ ప్రభుత్వం
ABN , Publish Date - Jan 11 , 2025 | 09:27 PM
తెలంగాణ ప్రభుత్వం రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ సినిమాకు షాకిచ్చింది. ఒక్క ‘గేమ్ చేంజర్’ సినిమాకే కాదు.. రాబోయే సినిమాలన్నింటికీ ఈ నిర్ణయం షాకిచ్చేదే. ఇంతకీ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన షాక్ ఏంటంటే..
గ్లోబర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం షాకిచ్చింది. సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరలు పెంచుకునే వెసులుబాటుతో పాటు తెలంగాణ ప్రభుత్వం అదనపు షోలకు అనుమతిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడా అనుమతులను తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తీసుకుంటున్నట్లుగా ఓ జీవోని విడుదల చేసింది. అసలు విషయం ఏమిటంటే..
సంధ్య థియేటర్ ఘటన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి, ఇకపై తెలంగాణ వ్యాప్తంగా టికెట్ల ధరలు పెంచడం గానీ, బెనిఫిట్ షోలు కానీ ఉండవంటూ ఖరాఖండీగా చెప్పారు. కానీ, ‘గేమ్ చేంజర్’ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా కావడంతో నిర్మాతకు నష్టాలు రాకుండా ఉండేందుకు పట్టు సడలించి.., మొదటి రోజు 6 షోలకు, రెండో రోజు నుండి 9 రోజుల పాటు 5 షోలకు అనుమతులు ఇస్తూ.. టికెట్ల ధరలను కూడా పెంచుకునే వెసులు బాటుని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. కానీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Also Read-Game Changer Review: ‘గేమ్ చేంజర్’ మూవీ రివ్యూ
బెనిఫిట్ షో లు రద్దు చేశామంటూ పరోక్షంగా ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమేంటని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీంతో ప్రభుత్వం వెంటనే సవరణలకు దిగింది. టికెట్ ధరల పెంపు, తెల్లవారు జాము షోలకు అనుమతి ఇస్తూ తీసుకున్న ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. హైకోర్టు ఆదేశాలతో ప్రత్యేక షోల జీవోను ప్రభుత్వం ఉపసంహరించుకుని, ఇకపై ఉదయం 8 గంటల నుండి రాత్రి 1 గంట మధ్యలో మాత్రమే చిత్ర ప్రదర్శనలు చేయాలని సూచించింది. ఇకపై తెల్లవారుజామున స్పెషల్ షోలకు అనుమతి ఉండదని ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా సినిమాల స్పెషల్ షోలకు అనుమతి ఇవ్వబోమని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
దీంతో ఒక్క ‘గేమ్ చేంజర్’ సినిమాపైనే కాకుండా జనవరి 12న థియేటర్లలోకి వస్తున్న ‘డాకు మహారాజ్’, జనవరి 14న వస్తున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలపై కూడా తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది. సంక్రాంతి సినిమాలే అని కాదు.. ఇకపై వచ్చే అన్ని సినిమాలకు ఎటువంటి స్పెషల్ అనుమతులు లభించే అవకాశం అయితే లేదనేది ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలిసిపోతుంది.