Pushpa 2: పుష్ప నిర్మాతలకు ఊరట...

ABN , Publish Date - Jan 02 , 2025 | 01:37 PM

పుష్ప-2 షో(Pushpa 2), సంధ్య థియేటర్‌ (Sandhya Theater Stampede) ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలకు ఊరట లభించింది.


పుష్ప-2 షో(Pushpa 2), సంధ్య థియేటర్‌ (Sandhya Theater Stampede) ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పుష్ప-2 సినిమా నిర్మాతలకు ఊరట లభించింది. యలమంచిలి రవిశంకర్‌, యెర్నేని నవీన్‌లపై  (mythri movies producer) దర్యాప్తు కొనసాగించవచ్చని, వారిని అరెస్ట్‌ చేయరాదని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. గత నెల 4వ తేదిన థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి నేపథ్యంలో చిక్కడపల్లి పోలీసులు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ రవిశంకర్‌, నవీన్‌ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.సుజన విచారణ చేపట్టి.. ఈమేరకు మధ్యంతర ఉత్తర్వులుని జారీచేశారు. తొలుత పిటిషనర్‌ తరఫు న్యాయవాది ఎన్‌.నవీన్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ ఈ ఘటనతో పిటిషనర్లకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్న అభియోగాలు ఏవీ వారికి వర్తించవన్నారు. హీరో అల్లు అర్జున్‌ థియేటర్‌కు వస్తున్నట్లు.. నిర్మాతల కార్యాలయ సిబ్బంది.. థియేటర్‌ నిర్వాహకులకు, పోలీసు అధికారులకు ముందే సమాచారం ఇచ్చారని తెలిపారు. ఘటన జరిగిన రోజు సీనియర్‌ అధికారులైన ఏసీపీ, డీసీపీలలు థియేటర్‌కు వచ్చి భద్రతను పరిశీలించారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్లను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లను ఆదేశించారు. కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు, ఫిర్యాదు దారు కి నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో అరెస్టయిన బన్నీ మేనేజర్‌ అడ్ల శరత్‌చంద్రనాయుడు, వ్యక్తిగత సిబ్బంది చెరుకు రమేశ్‌, శ్రీరాములు రాజు బెయిలు మంజూరు చేయాలంటూ దాఖలు  చేసిన పిటిషన్‌లపై విచారణను న్యాయమూర్తి ఈ నెల 6వ తేదీకి వాయిదా వేశారు. 

Updated Date - Jan 02 , 2025 | 01:37 PM