Pushpa-2 Vs Chhaava : ఇద్దరికీ కలిసొచ్చిన నిర్ణయం!
ABN , Publish Date - Feb 18 , 2025 | 02:32 PM
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 'పుష్ప -2' విడుదల రోజునే హిందీ చిత్రం 'ఛావా' (Chhaava) కూడా విడుదల కావాల్సింది. కానీ కారణం ఏమైనా 'ఛావా' నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఓ రకంగా చూసుకుంటే ఇది గొప్ప, తెలివైన నిర్ణయం!
గత యేడాది డిసెంబర్ 5న విడుదలైన 'పుష్ప -2' (Pushpa-2) సినిమా ఆ ఇయర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ మూవీ జనవరి 6వ తేదీకి రూ. 1831 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని మైత్రీ మూవీ మేకర్స్ తెలిపారు. తెలుగులో రూపుదిద్దుకున్న ఓ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై ఈ స్థాయి కలెక్షన్స్ ను కొల్లగొట్టడం అనేది 'బాహుబలి -2' (Bahubali -2) తర్వాత ఇదే. ఈ మూవీ విడుదలైన రోజు నుండి రకరకాల వివాదాలలో చిక్కుకుని, రకరకాల అడ్డంకులను అధిగమించి ఈ స్థాయికి చేరుకుంది. తాజాగా 'పుష్ప -2' మూవీ రూ. 1871 కోట్ల రూపాయలను ఫిబ్రవరి 17 వరకూ వసూలు చేసినట్టు మేకర్స్ తాజాగా ప్రకటించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. 'పుష్ప -2' విడుదల రోజునే హిందీ చిత్రం 'ఛావా' (Chhaava) కూడా విడుదల కావాల్సింది. కానీ కారణం ఏమైనా 'ఛావా' నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఓ రకంగా చూసుకుంటే ఇది గొప్ప, తెలివైన నిర్ణయం! ఎందుకంటే... పట్టుదలకు పోయి 'పుష్ప-2', 'ఛావా' చిత్రాలు ఒకే రోజు వచ్చి ఉంటే... రెండింటికి ఈ స్థాయి కలెక్షన్స్ వచ్చేవి కాదు... ఇవాళ 'ఛావా' కూడా బాలీవుడ్ లో చక్కని ఓపెనింగ్స్ తో విజయపథంలో సాగిపోతోంది. ముందు అనుకున్నట్టు డిసెంబర్ 6న 'ఛావా' వచ్చి ఉంటే... పరిస్థితి వేరలా ఉండేది.
'పుష్ప-2', 'ఛావా' రెండూ భిన్నమైన కథలతో తెరకెక్కిన సినిమాలు. ఒకటి ఎర్రచందనం స్మగ్లర్ కథ అయితే... మరొకటి దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలను అర్పించిన శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ కథ. మరాఠా ప్రజలు 'శివాజీలా జీవించు... శంభాజీలా మరణించు' అని చెబుతుంటారు. ధర్మం కోసం శివాజీ పోరాటం చేస్తే, ధర్మాన్ని వీడటం ఇష్టం లేని శంభాజీ ప్రాణత్యాగం చేశాడు. అలాంటి యోధుడి కథ 'పుష్ప-2'తో వచ్చి ఉంటే ఎలా ఉండేదో ఊహించుకోవడం కూడా కష్టమే. అయితే ఈ రెండు సినిమాలలో నాయికగా నటించింది రశ్మికా మందణ్ణ (Rashmika Mandanna) కావడంతో ఖచ్చితంగా ప్రేక్షకులు, విమర్శకులు ఈ రెండు సినిమాలను ఒకదానితో ఒకటి పోల్చి చూసేవారు. అప్పుడు కథాపరంగా 'పుష్ప-2' తేలిపోయేది. అదే సమయంలో మేకింగ్ పరంగా 'ఛావా' నిలిచేది కాదు. రెండు సినిమాల్లోనూ యాక్షన్ సీన్స్ భారీగా ఉన్నా... పిక్చరైజేషన్ లో 'పుష్ప-2'ది పై చేయి అయ్యేది... ఎమోషన్ పరంగా 'ఛావా'ది పై చేయి అయ్యేది. దాంతో మూవీ లవర్స్ రెండు వర్గాలుగా చీలిపోయే వారు. 'పుష్ప-2'కు కొందరు కొమ్ముకాస్తే... 'ఛావా'కు మరికొందరు కొమ్ముకాసేవారు. దీనికి తోడు దక్షిణాది సినిమా, ఉత్తరాది సినిమా అని సోషల్ మీడియాలో అడ్డమైన రాతలూ రాసి... వివాదాలు సృష్టించే వర్గం ఉండనే ఉంది. ఆరకంగా ఈ రెండు సినిమాలకూ భారీ నష్టం జరిగి ఉండేది.
ఇవాళ 'పుష్ప-2' బాక్సాఫీస్ బరిలో తన ఆటను ముగించిన తర్వాత 'ఛావా' ఆ గేమ్ షురూ చేసి కంటిన్యూ చేస్తోంది. ఈ మొత్తం ఆటలో విజేత అంటే రశ్మికా మందణ్ణ అనే చెప్పాలి. 'ఛావా' తొలి నాలుగు రోజుల్లోనే దాదాపు రూ. 150 కోట్ల గ్రాస్ ను కొల్లగొట్టింది. రాబోయే రోజుల్లో ఈ సినిమా ఖచ్చితంగా రూ. 500 కోట్ల క్లబ్ లో చేరుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సో... డిసెంబర్ 5న 'పుష్ప-2'కు దారి వదిలి 'ఛావా' మేకర్స్ మంచి పనిచేశారు. వారు తీసుకున్న ఆ నిర్ణయం కారణంగా కలెక్షన్స్ రూపంలో దాని ప్రతిఫలం కనిపిస్తోంది. ఓ అడుగు వెనక్కివేసిన 'ఛావా' ఇప్పుడు బాక్సాఫీస్ లో విజృంభించడం మొదలెట్టిందన్నమాట. సో ఒక నిర్ణయం రెండు సినిమాలకు ఇలా ప్లస్ అయింది.